Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంహింసోన్మాదం

హింసోన్మాదం

- Advertisement -

నేపాల్‌ వీధుల్లో పేట్రేగిన అరాచక శక్తులు
మంత్రులు, నేతలపై, ఇండ్లపై దాడులు
పార్లమెంట్‌, సుప్రీం కోర్టు సహా పలు కార్యాలయాలకు నిప్పు..ప్రధాని ఓలి రాజీనామా
సంయమనం పాటించండి : ఆర్మీ, భద్రతా చీఫ్‌ల విజ్ఞప్తి
చర్చలకు రండి : అధ్యక్షుడి ఆహ్వానం

ఖాట్మండు : నేపాల్‌లో రెండో రోజైన మంగళవారం కూడా నిరసనలు, ఆందోళనల ఉధృతి కొనసాగింది. ప్రభుత్వ అవినీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సోమవారం నాటి పోలీసుల దారుణ చర్యలను ఖండిస్తూ ప్రధాని, అధ్యక్షుడు సహా పలువురు నేతల ఇండ్లకు, పాలక పార్టీ కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. పార్లమెంట్‌ భవనాన్ని, సుప్రీం కోర్టు భవనాన్ని కూడా వదిలిపెట్టలేదు. పలువురు మంత్రులు, పార్టీల నేతలపై దాడులు కూడా జరిగాయి. ముఖంపై రక్తమోడుతూ, తగలబడుతున్న ఇండ్ల వద్ద కూలబడిపోయిన నేతలకు సంబంధించి పలు దృశ్యాలు, వీడియోలు బయటకు వచ్చాయి. కాంతిపూర్‌ పబ్లికేషన్స్‌, ఖాట్మండు పోస్ట్‌ వంటి పత్రికల కార్యాలయాలు కలిగిన భవనానికి కూడా ఆందోళనకారులు నిప్పంటించారు. ఖాట్మండు లోయలోని మూడు జిల్లాల్లో ఉదయం నుంచి కర్ఫ్యూను విధించినప్పటికీ ఆందోళనకారులు ఏమాత్రమూ పట్టించుకోలేదు.

ప్రధాని రాజీనామా
కాగా, దేశంలో నెలకొన్న అరాచక పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ప్రధాని కె.పి.శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ‘సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు వీలుగా, రాజకీయంగా దీన్ని పరిష్కరించడంలో సాయపడేందుకు” తాను రాజీనామా చేసినట్చు ఓలి ప్రకటించారు. ఆయన రాజీనామాను అధ్యక్షుడు వెంటనే ఆమోదించారు.
ఈ పరిస్థితుల్లో సైన్యం చేతుల్లోకి పగ్గాలు వెళ్ళేలా కనిపిస్తోంది. మంత్రులు, ఇతర నేతలను ఆర్మీ బ్యారక్స్‌లోకి తరలిస్తున్నట్లు వార్తలందాయి. మంత్రుల ఇండ్లపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా వారిని తరలిస్తున్నట్టు ఖాట్మండు పోస్ట్‌ తెలిపింది. ఆందోళనలు, నిరసనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడాన్ని ఖండిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేశారు.
దేశంలో సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ ఆందోళనకారులు తమ ఆందోళన లను విరమించలేదు. ప్రధానంగా జెడ్‌ జనరేషన్‌ ప్రభుత్వ అవినీతిని తీవ్రంగా ఖండిస్తోంది. సోమవారం నాడు ఉధృతంగా ప్రారంభమైన నిరసనలు, ఆందోళ నల్లో 19మంది మరణించగా, 400మందికి పైగా గాయపడ్డారు.

సంయమనం పాటించాలి : ఆర్మీ విజ్ఞప్తి
సంయమనం పాటించా లంటూ ఆందోళనకారులకు ఆర్మీ విజ్ఞప్తి చేసింది. దేశ సార్వభౌమాధికా రానికి, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి వున్నామని ప్రకటించింది. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా వుండి, దేశ ఐక్యతను, సామాజిక సామరస్యతను కాపాడాలని కోరింది. అరుదైన రీతిలో నేపాల్‌ ఆర్మీ, ఇతర భద్రతా సంస్థల చీఫ్‌లు కలిసి సంయుక్తంగా ప్రజలను సంయమనం పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆస్తులను కాపాడుకోవాలని కోరారు. ఈ ప్రకటనపై ఆర్మీ చీఫ్‌ అశోక్‌ రాజ్‌ సిగ్డల్‌, చీఫ్‌ సెక్రెటరీ ఏక్‌నారాయణ్‌, హోం కార్యదర్శి, సాయుధ పోలీసు బలగాల చీఫ్‌ ప్రభృతులు సంతకాలు చేశారు.

బట్టలు ఊడదీసి నడిరోడ్డుపై లాక్కెళుతూ…
నేపాల్‌ డిప్యూటీ ప్రధాని, ఆర్థికమంత్రి విష్ణుప్రసాద్‌ పౌడల్‌పై నిరసనకారులు చేయి చేసుకున్నారు. ఆయన బట్టలు కూడా ఊడదీసి కొంతమంది వ్యక్తులు ఆయన కాళ్లూ, చేతులుపట్టుకుని ఈడ్చుకుని వెళుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. మాజీ మంత్రి ఏక్‌నాథ్‌ థకాల్‌ను కూడా అలాగే బట్టలూడదీసి వీదుల్లో ఈడ్చుకువెళ్ళారు.

విదేశాంగమంత్రి నిర్బంధం
పాలక సంకీర్ణంలో భాగస్వామి అయిన నేపాలీ కాంగ్రెస్‌ నేత షేర్‌ బహదూర్‌ దేబా, ఆయన భార్య, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జూ రాణా దేబాలపై వారి నివాసంలోనే దాడి జరిగింది. వారిని ఆందోళనకారులు తొలుత తమ కస్టడీలో అట్టిపెట్టుకు న్నారు. ఇంటిని మొత్తంగా విధ్వంసం చేశారు. తర్వాత మండుతున్న ఇంటి నుండి మంత్రిని తరలించారు.

పలువురు నేతల ఇండ్లకు నిప్పు
అంతకు ముందు ఉద యం లలిత్‌పూర్‌లోని నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయా నికి ఆందోళనకారులు నిప్పంటిం చారు. దీంతో ప్రధాని వెంటనే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేశారు. అలాగే బాల్‌కోట్‌ లోని ప్రధాని నివాసానికి, అధ్యక్షుడు రామ్‌ చంద్ర పౌడల్‌, హోం మంత్రి రమేష్‌ లేఖక్‌ల నివాసాలకు కూడా ఆందోళనకారులు నిప్పంటించారని మీడియా వార్తలు వెల్లడించాయి.

విమానాలు రద్దు
మరోవైపు దేశంలో అనూహ్య పరిస్థితు లు, భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్నం దున ఖాట్మండులోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దయ్యాయం టూ ఖాట్మండు పోస్ట్‌ పేర్కొంది. ఢిల్లీ, ఖాట్మండుల మధ్య అన్ని విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌ ఇండియా, ఇండిగో సంస్థలు కూడా ప్రకటించాయి. విమానాల రద్దుతో పలువురు భారతీయులు నేపాల్‌లో చిక్కుకుపోయారు. భారత్‌, నేపాల్‌ సరిహద్దు పొడవునా భద్రతను కట్టుదిట్టం చేశారు.

చర్చలొక్కటే పరిష్కారం : అధ్యక్షుడు
దేశంలో తిరిగి పరిస్థితులను చక్కబెట్టాలంటే, శాంతి భద్రతల వ్యవస్థను పునరుద్ధరించాలంటే చర్చలు ఒక్కటే పరిష్కార మార్గమని అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడల్‌ పేర్కొన్నారు. ఆందోళనకారులను చర్చలకు రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో వుందని, దీన్నుండి బయటపడేందుకు, శాంతియుత పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు చర్చలకు సహకరించి ముందుకు రావాల్సిందిగా ఆయన కోరారు.

మాజీ ప్రధాని భార్య మృతి
నేపాల్‌ మాజీ ప్రధాని జాలానాథ్‌ ఖనాల్‌ భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్‌ మరణించారు. వారి ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.

భారతీయులకు సూచనలు
నేపాల్‌లోని భారతీయులు అప్రమత్తంగా, జాగ్రత్తగా వుండాల్సిందిగా భారత ప్రభుత్వం కోరింది. నేపాల్‌ అధికారులు జారీ చేసే మార్గదర్శకాలకు కట్టుబడి వుండాల్సిందిగా సూచించింది. నేపాల్‌లోని భారత జాతీయులకు ఇండియన్‌ ఎంబసీ ఎమర్జన్సీ నెంబర్లు జారీ చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad