– జీతం అడిగినందుకే భూస్వామి కొట్టి చంపారన్నబాధిత కుటుంబం
– అమేథీ గ్రామంలో వెలుగులోకి 
అమేథి : ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి పాలనలో జంగిల్‌రాజ్ నడుస్తుందనటానికి అక్కడ జరుగుతున్న ఎన్నో దారుణాలు, మరెన్నో అరాచకాలే నిదర్శనం. మైనర్లను బలవంతంగా లాక్కెళ్లి వారిపై సామూహిక అఘాయిత్యాలకు పాల్పడిన ఘటన మరువక ముందే.. అమేథి గ్రామంలో ఓ దళిత వ్యవసాయ కూలీని ఒక భూస్వామి, అతని సహచరులు కలిసి అతి కిరాతకంగా కొట్టి చంపారు. అయితే రూ. 2,500 జీతం ఇవ్వాలని అడిగినందుకే అతన్ని కొట్టి చంపారని బాధిత కుటుంబం ఆరోపించింది.దళిత కూలీ ప్రసాద్ (40)మృతిపై విచారణలో భాగంగా పోలీసులు అగ్ర కులానికి చెందిన ఇంటి యజమాని శుభం సింగ్‌ను అరెస్టు చేశారు. అయితే ”నలుగురిని నిందితులుగా పేర్కొనడానికి బదులుగా ఒకరిని మాత్రమే నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారని, ఆయనపై హత్య కాకుండా నేరపూరిత హత్యకేసును మాత్రమే మోపారు” అని బాధితుడి కుటుంబం విచారం వ్యక్తం చేసింది. ”అక్టోబర్ రెండో వారంలో శుభం సింగ్ , ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రసాద్‌ను బలవంతంగా వారి పొలంలో పని చేయడానికి తీసుకెళ్లారు” అని మృతుడి భార్య కీర్తి రాంబరి మజారే సారారు మహేషా తెలిపారు. ప్రసాద్‌కు యజమాని వారం రోజుల పాటు రోజుకు రూ. 350 చొప్పున కూలి ఇస్తానని హామీ ఇచ్చాడని, కానీ ఇవ్వలేదని ఆమె చెప్పింది.”అక్టోబర్ 26న తన జీతం తనకివ్వాలని ప్రసాద్ యజమాని దగ్గరికి వెళ్లి అడగగా ఆయనపై భూస్వామి దౌర్జన్యానికి దిగాడు. రాడ్లతో కొట్టాడు. ప్రసాద్ స్పృహ కోల్పోగానే.. జీపులో తెచ్చి మా ఇంటి తలుపు దగ్గర పడేశాడు” అని ఆమె విలపించింది. గాయాలపాలైన ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించగా.. ఆదివారం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో మరణించాడు.”మేం ప్రసాద్ మృతదేహాన్ని హైవేపై ఉంచి ధర్నా నిర్వహించడానికి ప్రయత్నించాం. కానీ పోలీసులు మమ్మల్ని బెదిరించి, అంత్యక్రియలను త్వరగా పూర్తి చేయాలని బలవంతం చేశారు” అని బాధితుడి బంధువు మనీష్ ప్రసాద్ అన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ దళితులపై దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న 65 ఏండ్ల రామ్‌పాల్ అక్టోబర్ 20న లక్నోలోని కాకోరి ప్రాంతంలోని శీతల మాతా మందిర్ మెట్లపై తన మూత్రాన్ని తానే తాగేలా అగ్రవర్గాలు దౌర్జన్యానికి దిగినట్టు వెలుగులోకి వచ్చింది.
దళిత కూలీపై దౌర్జన్యం
- Advertisement -
- Advertisement -

                                    

