సిఐటియు అఖిల భారత కార్యదర్శి ఎకె.సింధు
విశాఖ : విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు మాత్రమే కాదని… భారతీయుల హక్కు అని సిఐటియు అఖిల భారత కార్యదర్శి ఎకె.సింధు అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు విశాఖ నగరంలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షల్లో శుక్రవారం ఐద్వా జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. మోడీ విధానాలు స్టీల్‌ప్లాంట్ కార్మికుల, ప్రభుత్వ రంగ పరిశ్రమల మెడకు ఉరితాడుగా మారాయని తెలియజేస్తూ మహిళలు మెడకు ఉరితాడు తగిలించుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నష్టాల బాటలో పెట్టి ప్రైవేటు వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని వివరించారు. ఇప్పటికే 32 విభాగాలను ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు పూనుకున్నారన్నారు. ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడమే కాకుండా విఆర్‌ఎస్ పేరుతో పర్మినెంట్ ఉద్యోగులను వేల సంఖ్యలో బయటకు పంపించేశారని తెలిపారు.
ప్రైవేటుపరమైన ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నామన్నారు. దేశ రక్షణకు, సంపదకు కీలకమైన ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తే, మన దేశ భవిష్యత్తు ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ పరిరక్షణకు ఐదు సంవత్సరాలుగా పోరాడుతుండడం, అందులో మహిళలు కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం గొప్ప విషయమన్నారు. దేశవ్యాప్తంగా ఈ పోరాటాలు శ్రామిక మహిళలకు ఉత్తేజాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలని, కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగించే లేబర్ కోడ్స్‌ను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్ర మాజీ కార్మిక శాఖ మంత్రి మెర్సీ కుట్టి అమ్మ హాజరై మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎన్.మాధవి, వై.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఉక్కు భారతీయులందరి హక్కు
- Advertisement -
- Advertisement -



