Tuesday, December 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవీఎన్‌వీకే శాస్త్రి కన్నుమూత

వీఎన్‌వీకే శాస్త్రి కన్నుమూత

- Advertisement -

ఆదివాసీలకు తీరనిలోటు : టీఏజీఎస్‌
గిరిజన ఉద్యమాలకు నష్టం : టీజీఎస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దశాబ్ధాలపాటు గిరిజన తెగల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలందించిన డాక్టర్‌ వీఎన్‌వీకే శాస్త్రి (78) సోమవారం హైదరాబాద్‌లోని మెహిదీపట్నం టోలిచౌకిలో ఉన్న తన నివాసంలో మరణించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారులు అరుణ్‌, కశ్యప్‌ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పక్కన కొవ్వూరు ఆయన స్వస్థలం. ఆయన గిరిజన సంక్షేమ శాఖలో 36 ఏండ్లు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన గిరిజనుల స్థితిగతులపై అనేక విలువైన పుస్తకాలు రాశారు. 1975 నుంచి ఆదిలాబాద్‌, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూర్‌, శ్రీకాకుళం, ఉట్నూర్‌ ఐటీడీఏలలో అధికారిగా పనిచేశారు. గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. 1990లో గిరిజన సంక్షేమ శాఖ సాంస్కృతిక, అధ్యయన సంస్థ డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. దశాబ్ధాలపాటు గిరిజనుల కోసం పనిచేస్తూ వారి జీవన విధానం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో లోతైన అధ్యయనం చేశారు. గొప్ప సామాజికవేత్తగా గుర్తింపు పొందారు. గోండులు, కోలాం, కోయ, చెంచు, లంబాడి గిరిజనుల చరిత్రపై అనేక వ్యాసాలు, పుస్తకాలు రాసి గిరిజ నుల్లో చైతన్యం పెంపొందించేందుకు కృషి చేశారు. గొప్ప మానవతా వాదిగా ప్రఖ్యాతిగాంచారు. గిరిజనుల హక్కుల కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. గిరిజన సంఘాలకు ఆయన సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఏఏఆర్‌ఎం సంతాపం
వీఎన్‌వీకే శాస్త్రి మరణం పట్ల ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ (ఏఏఆర్‌ఎం) జాతీయ చైర్మెన్‌ జితేంద్ర చౌదరి సంతాపం తెలిపారు. గిరిజనుల కోసం ఆయన నిబద్ధతతో పనిచేశారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా గిరిజన సాహిత్యంపై అనేక పుస్తకాలను అందించారని తెలిపారు. ఆయన మరణం గిరిజనులకు, అభ్యుదయవాదులకు తీరనినష్టమని పేర్కొన్నారు.

ఆదివాసీ సమాజానికి తీరనిలోటు : టీఏజీఎస్‌
డాక్టర్‌ వీఎన్‌వీకే శాస్త్రి మరణం ఆదివాసీ సమాజానికి తీరనిలోటని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్‌ ఎం బాబురావు, కార్యదర్శి పూసం సచిన్‌, ఉపాధ్యక్షులు బండారు రవికుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీల కోసం ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. వివిధ ఐటీడీఏల్లో పనిచేసి ఆదివాసీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆదివాసీ లను చైతన్యం చేసేందుకు అనేక పుస్తకాలు రాశారనీ, నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సంస్కృతి పరిరక్షణ, విద్యా, వైద్యం ఉద్యోగ రంగాల్లో వారిని అభివృద్ధి చేసేందుకు విశేష సేవలందించారని వివరించారు. తమ సంఘం ద్వారా ఎప్పుడు రాజకీయ శిక్షణ తరగతులు పెట్టినా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆదివాసీల్లో చైతన్యం పెంచే వారని గుర్తు చేశారు. ఇంద్రవెల్లి కాల్పుల ఘటన తర్వాత వ్యవస్థలపైన నమ్మకం కోల్పోయిన దశలో స్థానిక గోండు, పరదాన్‌, తోటి, నాయకపోడ్‌ ఇతర ప్రిమెటివ్‌ గిరిజనుల బాగు కోసం ఐటీడీఏ తరపున ఆయన బృందం చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. పట్టా భూములు, వ్యవసాయ బావులు తవ్వించడం, కాడెద్దులు కొనివ్వడం, స్థానిక ఆదివాసీల బాష తెలిసిన యువకులను ఉట్నూరు ఐటీడీఏలో నియమించి వారి ద్వారా సమస్యలను వినే వారని పేర్కొన్నారు. అల్లంపల్లి నక్సల్స్‌ మందుపాతర పేలుడు తర్వాత ఏర్పడ్డ అలజడి వాతావరణంలో నాటి సీఎం ఎన్టీఆర్‌ ఉట్నూరు ఏజెన్సీ పర్యటనలో ఆదివాసీ సంక్షేమ కార్యక్రమాల ప్రకటన వెనుక వీఎన్‌వీకే శాస్త్రి కృషి ఉందని వివరించారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆయన ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేశారనీ, వారి సంక్షేమం గురించి ఆలోచించే వారని తెలిపారు. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లాలో లంబాడ-ఆదివాసీ తెగల మధ్య నివురుగప్పిన నిప్పులా సాగుతున్న వైరం నేపథ్యంలో ఆయన విశేష అనుభవాన్ని రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ సూచనల రూపంలో తీసుకుందని తెలిపారు. ఆయన మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
గిరిజన ఉద్యమానికి తీరనిలోటు : టీజీఎస్‌
డాక్టర్‌ వీఎన్‌వీకే శాస్త్రి మరణం గిరిజన ఉద్యమానికి తీరనిలోటని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాం నాయక్‌ అన్నారు. ఆయన మరణవార్త తెలియగానే హైదరాబాద్‌ మెహిదీపట్నం వద్ద టోలిచౌకిలోని నివాసానికి రమావత్‌ వాణితో కలిసి వెళ్లి వీఎన్‌వీకే శాస్త్రి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీరాంనాయక్‌ మాట్లాడుతూ గోండులు, కోలాం, కోయ, చెంచు, లంబాడి గిరిజనుల చరిత్రపై అనేక వ్యాసాలు, పుస్తకాలు రాసి గిరిజనుల్లో చైతన్యం నింపిన గొప్ప మానవతావాది అని అన్నారు. గిరిజన సంఘానికి 25 ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి అనేక సూచనలు, సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. అనేక జిల్లాల్లో సదస్సులు, సెమినార్లలో ఆయన పాల్గొని సేవలందించారని చెప్పారు. గొప్ప సామాజికవేత్త కలం, గళం ఆగిపోవడం గిరిజన ఉద్యమాలకు తీరనిలోటని అన్నారు. ఆయన ఆలోచనలు, స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -