Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజన హక్కుల కోసం వీఎన్‌వీకే శాస్త్రి జీవితాంతం కృషి

గిరిజన హక్కుల కోసం వీఎన్‌వీకే శాస్త్రి జీవితాంతం కృషి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
శాస్త్రి భౌతికకాయానికి నివాళి అర్పించిన సీపీఐ(ఎం) నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

గిరిజన హక్కులు, సంస్కృతి, సమస్యలపై జీవితమంతా అంకితభావంతో పనిచేసిన గొప్ప వ్యక్తి డాక్టర్‌ వీఎన్‌వీకే శాస్త్రి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కొనియాడారు. మంగళవారం హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో శాస్త్రి భౌతికకాయానికి జాన్‌వెస్లీ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మృతికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తరఫున సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏటూరునాగారం, ఉట్నూర్‌, శ్రీశైలం, భద్రాచలం ఐటీడీఏలలో ప్రాజెక్టు అధికారిగా, ఆ తరువాత గిరిజన సాంస్కృతిక అధ్యయన సంస్థ డైరెక్టర్‌గా సుధీర్ఘ కాలం సేవలు అందించారని గుర్తుచేశారు. గిరిజన సంస్కృతి, సంక్షేమం, జీవనోపాధి, భౌగోళిక హక్కులపై అనేక పరిశోధనలు చేసి పుస్తకాలు, వ్యాసాలు రాసి ప్రజలను చైతన్యపర్చారని తెలిపారు. గిరిజన హక్కులు, చట్టాల రక్షణ కోసం అండగా ఉంటూ, సదస్సులు, సెమినార్‌లలో ప్రత్యక్షంగా పాల్గొని వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేవారన్నారు. బాక్సైట్‌ తవ్వకాల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యుడిగా గిరిజనులకు వాటిల్లే నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తూ, నివేదికను సమర్పించారని గుర్తుచేశారు. ఇంద్రవెల్లి గిరిజన భూముల ఆక్రమణ సందర్భంగా జరిగిన పోలీస్‌ కాల్పుల్లో 25 మంది మరణించిన ఘటనపై విచారణాధికారిగా పనిచేసి పోలీసులపైనే వ్యతిరేకంగా ధైర్యంగా నివేదికిచ్చిన అరుదైన అధికారి అని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనేక గిరిజన కమిటీల్లో సభుడిగా పనిచేసి గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, భూముల హక్కుల పరిరక్షణకు చివరి వరకూ శ్రమించిన ఆయన సేవలు అందరికీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డీ అబ్బాస్‌, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాంనాయక్‌, అధ్యక్షులు ఎం ధర్మానాయక్‌, రైతు సంఘం ఉపాధ్యక్షులు మూడ్‌ శోభన్‌ పాల్గొని నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -