వంద శాతం ఆధారాలున్నాయి
ఇది ప్రజాస్వామ్యంపై అణుబాంబు లాంటిది
ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది : విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ
ఆన్‌లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదు : రాహుల్ ఆరోపణలను ఖండించిన ఈసీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఓటు చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వెనక్కి తగ్గటం లేదు. ఓటర్ల పేర్ల తొలగింపు ప్రజాస్వామ్యంపై పడిన అణుబాంబు అని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం(ఈసీ) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అంతేకాదు.. ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించబడిన వ్యక్తులను ఆయన మీడియా ముందుకు తీసుకొచ్చారు. గురువారంనాడిక్కడ ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇది కేవలం ఓట్ల జాబితా సమస్య కాదనీ, లక్షలాది మంది ఓటర్ల హక్కులపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో తేడాలు, అక్రమాలు సరిచేయాల్సిన సమయం వచ్చిందనీ, ఈ చీకటి రాజకీయం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
వివిధ రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు
కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్‌ల్లో ఓట్ల తొలగించారని ఆయన అన్నారు. ఒక్క కర్నాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో 6,018 ఓట్లను నకిలీ లాగిన్, ఫోన్ నెంబర్లను ఉపయోగించి తొలగించారని తెలిపారు. 14 నిమిషాల్లో 12 మంది ఓటర్లను తొలగించారని ఆరోపించిన సూర్యకంత్ అనే వ్యక్తిని రాహుల్ గాంధీ ఉదహరించారు. ”తొలగించిన” ఓటర్లలో ఒకరైన బాబిటా చౌదరిని ఆయన వేదికపైకి తీసుకువచ్చారు. నాగరాజ్ అనే వ్యక్తి ఉదయం 4:07 వద్ద కేవలం 38 సెకన్లలో రెండు డిలెట్ అప్లికేషన్లు నింపాడని ఆరోపించారు. ఇది ”మానవీయంగా అసాధ్యం” అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ మహారాష్ట్రకు చెందిన రాజురా అసెంబ్లీలో నకిలీ ఓటర్ల చేర్పులను వివరించారు. విచిత్రమైన ఎంట్రీలతో ఈ ఓటర్ల చేర్పులు జరిగాయని అన్నారు. అందులో ఒకటి ఓటరు పేరు:”వైయూహెచ్ యూక్యూజేజేడబ్ల్యూ”, చిరునామా : ”షష్టి, షష్టి” అని రాహుల్ గాంధీ ఉదహరించారు. ఈ ప్రక్రియలో దుండగులు సాఫ్ట్‌వేర్‌ను హైజాక్ చేశారని తెలిపారు. నకిలీ అప్లికేషన్‌లు, తప్పుడు ఫోన్ నంబర్లు ఉపయోగించి ఓట్ల తొలగింపునకు అప్పీల్ చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశమున్న బూత్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపు జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ చర్యలు తమ పార్టీని బలహీనపరచడానికి జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అలాంటి ప్రజాస్వామ్య విధ్వంసకులను రక్షిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఓట్ల మోసంపై వంద శాతం ఆధారాలు
ఓట్ల మోసంపై వంద శాతం ఆధారాలున్నాయని ఆయన అన్నారు. కర్నాటకలో ఓట్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ కొన్ని ఆధారాలను రాహుల్ గాంధీ చూపించారు. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో ఈ మోసం జరిగిందని, గోదాబారు పేరుతో ఫేక్ లాగిన్ ఉపయోగించి 12 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని ఆయన తెలిపారు. ఓట్ల తొలగింపు కోసం ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ ఉపయోగించారని, ప్రతి బూత్‌లో మొదటి ఓటరును దరఖాస్తుదారుగా చూపేలా చేశారని వెల్లడించారు. ఎక్కువ ఓట్లు తొలగించిన టాప్ 10 బూత్‌లన్నీ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రాంతాల్లో ఉన్న చోటనే జరిగాయని రాహుల్ తెలిపారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
మహారాష్ట్ర, కర్నాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఓటర్లను జాబితా నుంచి తొలగించారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ తొలగింపులు వ్యక్తుల ద్వారా కాకుండా, ఓ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి జరిగిందన్నారు. ప్రతి బూత్‌లో మొదటి పేరును ఆ ఆటోమేటెడ్ ప్రోగ్రాం తీసుకుని తొలగించేలా రూపొందించారని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రక్రియలో రాష్ట్రానికి చెందినవారు కాకుండా ఇతర ప్రాంతాల ఫోన్లు ఉపయోగించి ఓటీపీలతో అప్లికేషన్లు దాఖలు చేసినట్టు ఆయన ఆరోపించారు. వీటి గురించి కర్నాటకలో సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఈసీకి తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి 18 సార్లు ఈసీని కోరినప్పటికి శ్రద్ధ వహించలేదని చెప్పారు.
ఓటీపీల సమాచారం విడుదల చేయాలి
ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా, పెద్ద ఎత్తున జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ తొలగింపులపై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుందని ఆయన హెచ్చరించారు. ఈసీ ఒక వారంలోపు తీసివేసిన ఓటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఇది మరోసారి ఓట్ల చోరీకి నిదర్శనమవుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
‘రాహుల్‌లో నిరాశ పెరుగుతోంది’
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించారు. రాహుల్ గాంధీలో నిరాశ నిరంతరం పెరుగుతోందన్నారు. రాజకీయ ఆరోపణలను తన ఆభరణంగా రాహుల్ మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. సీఈసీపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ప్రశ్నించినప్పుడల్లా.. ఆయన వెనుదిరిగి పారిపోతున్నారని తెలిపారు. ఆరోపణల నేపథ్యంలో అఫిడవిట్ ఇవ్వాలని ఈసీ అడిగితే.. రాహుల్ వెనక్కి తగ్గుతారన్నారు.