ఈసీ వైఖరి..పారదర్శకత, విశ్వసనీయతకే ముప్పు
మీరు చట్టాలను మార్చొచ్చు..
కానీ ప్రజల గొంతును అణచలేరు : రాజ్యసభలో కేంద్రంపై ప్రతిపక్షాల విమర్శలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పేరుతో ‘ఓట్ చోరీ’కి పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో పౌరుల ఓట్ల తొలగింపునకు తాము వ్యతిరేకమని, రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుకు భంగం వాటిల్లితే తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి పారదర్శకత, విశ్వసనీయతకే ముప్పుగా మారిందని అన్నారు. గురువారం రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ప్రతిపక్షనేతలు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుతెన్నులపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీ అజరు మకెన్ మాట్లాడుతూ భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అని మనం అంటున్నామని, కానీ ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా లేదనడానికి రుజువులు ఉన్నాయని అన్నారు. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు, పారదర్శకత, విశ్వసనీయత వంటి మూడు అంశాలు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని తెలిపారు. 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారని, ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత మాత్రమే వాటిని అనుమతించారని ఆయన పేర్కొన్నారు. అదే బీజేపీ బ్యాంక్ ఖాతాల జోలికి పోగలరా? అని ప్రశ్నించారు. హర్యానాలో ఎన్నికల సంఘం చేసిన వివిధ ప్రకటనలలో ఓటింగ్ శాతం స్థిరంగా లేదని అన్నారు. పారదర్శకతకు సంబంధించిన ఆందో ళనలను కూడా ఆయన వ్యక్తం చేశారు. ఎన్నికల బూత్‌ల సీసీటీవీ ఫుటేజ్‌లను ఇకపై యాక్సెస్ చేయలేని విధంగా సవరణను తీసుకువ చ్చారని ఆయన పేర్కొన్నారు. ఏ తప్పు జరగకపోతే, ఎన్నికల అధికారులను ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిం చారు. ప్రతిపక్షం మహిళలకు చెల్లింపులు చేయాలని ప్రయత్నిం చినప్పుడు, దానిని లంచంగా పరిగణించి మోడల్ ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తారని, కానీ అధికార పార్టీ అలా చేసినప్పుడు, ఎందుకు దాన్ని అమలు చేయటం లేదని ప్రశ్నించారు. మీరు చట్టాలను మార్చవచ్చు, కానీ ప్రజల గొంతును అణచివేయలేరని ఆయన అన్నారు. ఎన్నికల వ్యవస్థలో ఈవీఎంలు చాలా సమస్యలు సృష్టిస్తున్నాయని డీఎంకే ఎంపీ ఎన్‌ఆర్ ఎలాంగో అన్నారు. నేడు మన దగ్గర ఫూల్ ప్రూఫ్ ఎన్నికల వ్యవస్థ లేదని తెలిపారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన ఈవీఎం డిజైన్ పలు సమస్యలు కలిగిస్తోందని చెప్పారు. పారదర్శకత లేకపోవడం, సాంకేతిక సవాళ్లన్నీ ఈవీఎంలతో ఉత్పన్నమవు తున్నాయని వివరించారు. ఓటరు, కంట్రోల్ యూని ట్ మధ్య ప్రత్యక్ష ఇంటర్‌ఫేస్ లేదని ఆయన నొక్కి చెప్పారు. సింబల్ లోడింగ్ యూనిట్లలో ఏముందో ఎవరికీ తెలియదని అన్నారు. టీఎంసీ ఎంపీ డోలా సేన్ మాట్లాడుతూ ఎన్నికల సంస్కరణలను తాము వ్యతిరేకించడం లేదని, ఓటర్లను జాబితాలో నుంచి తొలగించేందుకు తయారు చేసే జాబితాలను తాము వ్యతిరేకి స్తున్నామని అన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓటు చోరీ అంగీకరించబోమని, దేశ ప్రజల హక్కులను హరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. అన్నా డీఎంకే ఎంపీ తంబిదురై మాట్లా డుతూ సర్ అంశం ఇప్పటికీ విచారణలోనే ఉందని, దాని గురించి తాము మాట్లాడలేమని అన్నారు. ఆప్ ఎంపీ సంజరు సింగ్, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ ఎంపీ సుదాన్షు త్రివేది, బీజేడీ ఎంపీ సుభా షిష్ ఖుంటియా తదితరులు చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చ నేడు (శుక్రవారం) కూడా కొనసాగనుంది.
అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు: రాహుల్ గాంధీ
కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ఒత్తిడికి గురైనట్టున్నారని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు చోరీపై విలేకరుల సమావేశంలో లేవనెత్తిన అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాలని కేంద్ర హౌం మంత్రి అమిత్ షాను నేరుగా సవాలు చేసినప్పటికీ, ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు. ‘ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సమయంలో పార్లమెంటులో అమిత్ షా చాలా ఆందోళనగా కనిపించారు. ఆయన చేతులు వణుకుతున్నాయి. ఆయన వాడిన భాష సరిగా లేదు. అమిత్ షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇది నిన్న దేశమంతా చూసింది. ఆయన ఏ ప్రశ్నకూ సరిగా సమాధానం ఇవ్వలేదు. వేటికీ ఆధారం చూపలేదు. మీడియా సమావేశంలో అమిత్ షాని నాతో చర్చకు రావాలని సవాల్ విసిరాను. దానికి కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’ అని అన్నారు.
జమిలీ ఎన్నికల బిల్లు పరిశీలన కమిటీ కాలపరిమితి పొడిగింపు
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని తలపెట్టే జమిలీ ఎన్నికల (ఒకే దేశం, ఒకే ఎన్నిక) బిల్లులను పరిశీలించే పార్లమెంటరీ కమిటీ కాలపరిమితిని పొడిగించారు. గురువారం లోక్‌సభ ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లుల కాల పరిమితిని 2026 బడ్జెట్ సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించాలని కోరుతూ కమిటీ చైర్మెన్ పీపీ చౌదరి తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదిం చింది. గతేడాది డిసెంబర్‌లో ఏర్పాటైనప్పటి నుంచి ఈ కమిటీ రాజ్యాంగ నిపుణులు, ఆర్థిక వేత్తలు, లా కమిషన్ చైర్మెన్ దినేష్ మహేశ్వరి, ఇతరులతో సమావేశమైంది.
పార్లమెంట్ సమావేశాలను మరో ప్రాంతానికి మార్చాలి : ఎంపీ మానస్ రంజన్ మంగరాజ్
కాలుష్యంతో నిండిన ఢిల్లీ నుంచి పార్లమెంట్ సమావేశాలను మరో ప్రాంతానికి మార్చాలని బీజేడీ రాజ్యసభ ఎంపీ మానస్ రంజన్ మంగరాజ్ కోరారు. గురువారం రాజ్యసభలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశ రాజధాని కాలుష్య సంక్షో భాన్ని మానవ నిర్మిత విపత్తుగా అభివర్ణించారు. గాలి నాణ్యత మెరుగుపడే వరకు పార్లమెంట్ శీతాకాల, బడ్జెట్ సమావేశాలను ఢిల్లీ వెలుపలికి మార్చాలని డిమాండ్ చేశారు. ఎంపీలు, పార్ల మెంట్ అధికారులు, డ్రైవర్లు, పారిశుధ్య కార్మికులు, భద్రతా సిబ్బంది ప్రతిరోజూ విషపూరిత గాలికి గురవుతున్నారని అన్నారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో కీలకమైన పార్లమెంటరీ సమావేశాలను నిర్వహించడం వల్ల అనవసరంగా ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నా మని పేర్కొ న్నారు. భువనేశ్వర్, హైదరాబాద్, గాంధీనగర్, బెంగళూరు, గోవా, డెహ్రాడూన్ వంటి అనేక నగరాలను ఈ ప్రాంతానికి ప్రత్యామ్నాయాలుగా ఆయన సూచించారు.
సర్ పేరుతో ఓట్ చోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



