నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) పేరుతో ఎన్నికల సంఘం ఓట్ల చోరీ ఉదంతాన్ని ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర నేటితో ముగియనుంది. బీహార్ వ్యాప్తంగా 110 శాసనసభ నియోజకవర్గాల మీదగా 16 రోజుల పాటు 1300 కిలో మీటర్ల పొడవునా సాగిన ఈ యాత్రకు ఇండియా బ్లాక్ పార్టీల శ్రేణులతో పాటు ప్రజలు నీరాజనం పలికారు. ఈరోజు పాట్నాలోని గాంధీ మైదాన్ నుండి అంబేద్కర్ పార్క్‌లోని భీమ్ రావు అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకోగానే ఈ యాత్ర ముగియనుంది.
ఆగస్టు 18న రాహుల్ గాంధీ, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్ ససారంలో కలిసి ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుంచి 25 జిల్లాల మీదుగా ఔరంగాబాద్, గయాజీ, సివాన్ ఇతర ప్రాంతాలకు ర్యాలీ విస్తరించింది. పాట్నాలో ముగింపు రోజున రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఓటరు అధికార్ యాత్రలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులు యూసుఫ్ పఠాన్, లలితేష్ పాటి త్రిపాఠి కూడా చేరనున్నారు.
ఈ యాత్రలో వివిధ చోట్ల ఇండియా బ్లాక్ నాయకులు పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సుఖు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇతర ముఖ్యమంత్రులు యాత్రలో పాల్గొన్నారు.