కమ్యూనలిస్టు మోడీ.. కమ్యూనిస్టు విజయన్ ఇద్దరూ ఓడాలి
అప్పుడే కేరళంకు మంచి రోజులు
బీజేపీకి లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్‌య్యే : కేరళం ఎన్నికల ప్రచారసభల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని మోడీ..తివేండ్రం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఓడగొడితేనే ఆ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆయన తెలిపారు. వారిద్దరివి విభిన్న భావజాలాలైనా… భావాలొక్కట ేనని వ్యాఖ్యానించారు. ఎల్డీఎఫ్.. బీజేపీల మధ్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కేరళంలోని నేమం సహా పలు నియోజకవర్గాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ నియోజక వర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరీనాథన్ తరఫున పూంథురలో సీఎం రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను కేరళంలోకి రానీయకుండా లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్‌య్యేనని అన్నారు. ఆ రాష్ట్రంలో జాతీయ రహదారులు సహా పలు అభివృద్ధి పనులు నిలిచిపోయినా ముఖ్యమంత్రి పినరయి విజయన్ నోరుమెదపడం లేదని విమర్శించారు. అందువల్ల బీజేపీ, ఎల్డీఎఫ్‌కు గుణపాఠం చెప్పాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ కేరళం భవిష్యత్తును దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ-సీపీఐ(ఎం) మధ్య సైలెంట్ అండర్ స్టాండింగ్ ఉందన్నారు. అందుకే వారిపై ఎలాంటి కేసులు ఉండబోవని విమర్శించారు. దేశంలో ఎవరినైనా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తుందని..కానీ, విజయన్ సర్కారుపై మాత్రం ఈగ కూడా వాలనీయరని పేర్కొన్నారు. బీజేపీ, ఎల్‌డీఎఫ్ బయటకు పోటీ పడుతున్నట్టు కనిపిం చినా, అది ఉత్తిత్తిదేనని చెప్పారు. కేరళం సమగ్రాభి వృద్ధే యూడీఎఫ్ లక్ష్యమన్నారు.
విద్యావంతులైన ఎందరో మలయాళీలు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని.. వారికి స్థానికంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు తగిన సంఖ్యలో లేవన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు కేరళం సమగ్రాభివృద్ధికి యూడీఎఫ్ ప్రణాళికలు రచిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలు, యువతకు కాంగ్రెస్‌తోనే న్యాయం జరుగుతుందని సీఎం చెప్పారు. హస్తం పార్టీకి ఓటేస్తే పాత కేరళం ఏమిటో మళ్లీ చూపిస్తామని హామీనిచ్చారు. డెవలప్‌మెంట్ విత్ డిగ్నిటీతో ముందుకు వెళుతున్నామని తెలి పారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సామాజిక ప్రగతి, అభివృద్ధి, అక్షరాస్యతలో కేరళం ఎప్పటినుంచో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన కృషే అందుకు కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా రంగంలో కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన ప్రగతిని ఆయన వివరించారు.
దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళంకు ఉన్న గుర్తింపును ప్రస్తావించారు. విద్యా, అవగాహన, సామాజిక చైతన్యంలో కేరళం దేశానికి అప్పటికీ, ఇప్పటికీ నమూనాగా ఉందని తెలిపారు. గత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీ, ఏకే ఆంటోనీల కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. వారు కేరళంకు సమగ్ర, సమ్మిళిత, సమతుల్య, నిష్కళంక రాజకీయాలను అందించారని పేర్కొన్నారు. కరుణాకరన్ కేరళలో అభివృద్ధికి బాటలు వేశారని, ఊమెన్ చాందీ సంక్షేమం-అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. ఏకే ఆంటోనీ నిజాయితీకి నిదర్శనంగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కేరళంకు గౌరవం, నమ్మకం, పరిపాలనా స్థిరత్వం వచ్చాయని అన్నారు. ఆ రాష్ట్రాన్ని ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ గా పిలుస్తారని, అందుకే దేశంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా కేరళం ఒక బ్రాండ్‌గా నిలిచిందన్నారు. పర్యాటకం, విద్య, ఆరోగ్యం, సామాజిక పురోగతి- ఇవన్నీ కేరళంను ఒక ప్రత్యేక రాష్ట్రంగా నిలబెట్టాయని ఆయన చెప్పారు.
గత 12 ఏండ్లుగా అటు ఢిల్లీలో, ఇటు పదేండ్లుగా కేరళంలో పరిస్థితులను పూర్తిగా దిగజారాయని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ, విజయన్ ‘డబుల్ ఫెయిల్యూర్’గా నిలిచారని విమర్శించారు. వారి హయాంలో దేశం, రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లాయని విమర్శించారు. వీరి ఇరువురి సిద్ధాంతాలు వేరయినా… వైఫల్యాలు మాత్రం ఒకేలా ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగంతో ఇక్కడి యువత ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. సోనియా గాంధీ దత్తత తీసుకున్న తెలంగాణ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని.. కేరళం కూడా అలానే ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆ రాష్ట్ర అభివృద్ధికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని అన్నారు. వారిద్దరూ కేరళం కుటుంబ సభ్యుల్లా మారారని సీఎం తెలిపారు. ‘విజయన్ నీ సమయం అయిపోయింది.. వెళ్లిపో…’ అంటూ సీఎం ఈ సందర్భంగా మళయాళంలో వ్యాఖ్యానించారు.



