Friday, July 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిబీహార్‌లో ఓట్లకు పెనుగండం - ఇసి తతంగం

బీహార్‌లో ఓట్లకు పెనుగండం – ఇసి తతంగం

- Advertisement -

న్యాయమైన, స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నిర్వహణలోనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గుండెకాయ, ఆత్మ మనుగడ వుంటుంది. అదే అన్ని రాజకీయ పార్టీలకూ సమానావకాశాలకు హామీ కల్పించే అత్యావశ్యక ప్రక్రియగా వుంటుంది. ఈ లక్షణం కారణంగానే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ప్రజాస్వామ్యంగా తరచూ పరిగణిస్తుంటారు. 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని ఆమోదించేందుకు ముందు రాజ్యాంగ పరిషత్తు శాసనసభలకు, పార్లమెంటుకూ న్యాయమైన స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై రెండేళ్లపాటు ఎంతో లోతుగా చర్చించడం ఊరికే జరగలేదు.సమగ్రమైన ఈ ముందస్తు ప్రణాళిక సహజంగానే ఎన్నికల నిర్వహణపై భారత ఎన్నికల సంఘం (ఇ.సి.ఐ) స్వతంత్రతకూ నిష్పాక్షికపాత్రకూ అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. దానికి పూచీ కల్పించేలా ఇసిఐ రాజకీయ ప్రభావాల నుంచి నిపాక్షికంగా ఉండేలా చూసేందుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా అది స్వతంత్రంగా పని చేసేందుకుగాను దానికి విస్తారమైన, అవసరమైన అధికారాలు ఇచ్చింది. సర్వ సంపూర్ణమైన అధికారాలతో అది పనిచేసే పరిస్థితి కల్పించింది.
భారత రాజ్యాంగంలోని 324వ అధికరణం ఈ అధికారా లను పొందుపర్చుకున్నది. పార్లమెంటుకూ శాసనసభలకు, రాష్ట్ర పతి ఉప రాష్ట్రపతి స్థానాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ, నిర్దేశం, అదుపాజ్ఞలు అప్పగించింది. ఓటర్ల జాబితాల తయారీ, ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా ఎన్నికల సంఘానికే ఇవ్వబడింది.గత 75 ఏండ్లకాలంలోనూ ఎన్నికల సంఘం తగినంత సమగ్రతతో పారదర్శకతతో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా బాధ్యతలు నిర్వహించింది. కొన్ని స్వల్పమైన అపశ్రుతులు ఉన్నప్పటికీ ఇసిఐ భారత దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగానూ కూడా గౌరవం సంపాదించుకుంది.
మారిన దృశ్యం
ఇవన్నీ నిజమైనా నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారం చేపట్టాక ఈ ప్రక్రియ మారిపోయింది. కమిషన్‌ పొందికనే ఒక వివాదంగా తయారైంది. ముఖ్యంగా కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌నూ, ఎన్నికల కమిషనర్లనూ ఎంపిక చేసేందుకు బాధ్యత వహించే అన్వేషణ కమిటీలో ఎవరెవరికి చోటుండాలనే దానిపై సుప్రీం కోర్టు స్పష్టంగా చేసిన సిఫార్సులు ఉల్లంఘించబడ్డాయి. దాంతో ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా కార్యనిర్వాహకవర్గం ఉక్కు పట్టులోకిి వచ్చేసినట్టయింది. అంతేగాకుండా మొదటి మోడీ ప్రభుత్వం ఎన్నికల కోసం కార్పొరేట్లు అంతులేని రీతిలో రాజకీయ విరాళాలు సమకూర్చే విషయమైన నిబంధనలకు అత్యంత ఘోరమైన సవరణలు తెచ్చింది. ఈ సవరణలతో ఎన్నికలకు పెట్టుబడి పెట్టే వ్యవహారం మొదలంటా మారిపోయింది. కార్పొరేట్‌ ప్రయోజ నాలకూ ఎన్నికైన ప్రభుత్వాలకూ మధ్య ఇచ్చిపుచ్చు కునే లావాదేవీలు ప్రమాదకరంగా పరిణమించాయి. ఎన్నికల బాండ్లకు వీలు కల్పించే నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవంటూ సుప్రీం కోర్టు కొట్టివేయ డంతో రాజకీయ నిధుల రహస్య నమూనా ఏమిటో ప్రజల ముందు బహిర్గత మైంది. ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీకి చాలా ఎక్కువ నిష్పత్తిలో సొమ్ములు సమకూరినట్టు సాక్ష్యాధారాలతో నిరూపిత మైంది. అంతేగాక ఈ బాండ్ల వసూలు వెనక కీలకమైన ఆర్థిక అక్రమాలు బట్టబయలైనాయి. కుమ్మక్కుతో లావాదేవీలు జరిగిన తీరు కళ్లకు కట్టే ఆధారాలు అందుబాటులోకి వచ్చాయి.
ఇ.వి.ఎంలపై తీరని సందేహాలు
ఇవేగాక ఇంకా-ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు (ఇ.వి.ఎం), ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వి.వి.ప్యాట్‌) వ్యవస్థ విశ్వసనీయత వంటి ఇతర సమస్యలు కూడా ప్రజావరణంలోకి వచ్చాయి. ఈ యంత్రం పనిని నిర్ణయించే సోర్స్‌ కోడ్‌, ప్రక్షాళన నియమావళి పారదర్శకతనూ నిజాయితీ వంతమైన నిర్వహణకూ కీలకం కాగా వాటి సాంకేతిక వివరాలకు సంబంధించీ అనేకానేక ప్రశ్నలు కొనసాగుతూనే వున్నాయి. ఈ విధమైన ఆందోళన తీసుకొచ్చిన వివాదం ఇంకా నివృత్తి కావలసే వుంది.ఇటీవలి సంవత్సరాల్లో ముఖ్యంగా 2019 ఎన్నికల సన్నాహ దశలో ఎన్నికల సంఘం పక్షపాత పాత్ర అంతకంతకూ ఎక్కువగా ప్రదర్శితమైంది. ప్రధానినీ, హోంమంత్రినీ కాపాడేందుకు పచ్చిగా ప్రయత్నాలు జరుగుతుంటే ఇసిఐ పట్టనట్టు కూర్చుండి పోయింది. పుల్వామా, బాలాకోట్‌ ఘటనలను రాజకీయమయం చేయకుండా అడ్డుకోలేక పోయింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆ విధంగా భద్రతా బలగాల కేంద్రకంగా వీర దురభిమాన జాతీయవాద కథనం తీసుకురావడం ఎన్నికల నిర్వ హణ నియమావళికి (ఎంసిసి) దారుణంగా గండికొట్టింది.ఈ కారణాల వల్ల అతికీలకమైన సమస్య మన ముందుకొస్తుంది. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీల పాత్రను వ్యవస్థీకరించడం ఎలాగన్నదే ఆ సమస్య. మొదటి నుంచి చూస్తే ఇసిఐ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు, సూచ నలతో కీలకమైన నిర్ణయాలు, చర్యలు చేపట్టడం రివాజుగా వస్తోంది. ఎంసిసి దానికదే ఒక రాజ్యాంగ నిబంధన కాదు. రాజకీయ తేడాలకు అతీతంగా ఏకాభిప్రాయ ప్రతిబింబింగానే అది నడుస్తూ వచ్చింది.
బీహార్‌లో దుస్సాధ్య ప్రక్రియ
బీహార్‌ శాసనసభ ఎన్నికలు జరగనుండగా ఓటర్ల జాబితాల తనిఖీ కోసం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ప్రత్యేక ప్రగాఢ పరిశీలన) చేపట్టడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. బీహార్‌ శాసనసభ కాలపరిమితి 2025 నవంబర్‌ 22తో ముగుస్తుంది. సహజంగా ఆ తేదీలోగా ఎన్నికలు జరపాలి. 2025 జూన్‌ 24న ఇసిఐ పరిశీలన ప్రక్రియను ప్రారంభించడం కోసం కావలసిన పత్రాలను ప్రకటించింది. దానిపై నాలుగు పేజీల పత్రికా ప్రకటన, బీహార్‌ ప్రధాన ఎన్నికల అధికారికి 19 పేజీల లేఖ విడుదల చేసింది. తొమ్మిది పేజీల మార్గనిర్దేశాలు, ఓటరు ధృవీకరణతో సహా ఓటరుగా ప్రకటనకు మద్దతుగా సమర్పించాల్సిన పత్రాల జాబితాతో పాటు రెండుపేజీల నమోదుపత్రం ప్రకటించింది.సవివరమైన ఈ పత్రాల ప్రకటనే అనేక తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నది. మొదటిది చరిత్ర క్రమానికి సంబంధించింది. ఈ పత్రికా ప్రకటన 2025 జూన్‌ 24న విడుదల కాగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌లో పేరు నమోదు చేసుకోవడానికి గడువుగా ప్రకటించిన తేదీ 2025 జులై 1. ఈలోగా తాత్కాలికంగా ఓటర్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు ముందుగా రాసిపెట్టిన నమోదు పత్రాలను (డూప్లికేట్‌తో సహా) ఓటర్లందరికీ సిద్ధం చేసుకోవాలి. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు (బి.ఎల్‌.ఒ) వాటిని పంపిణీ చేయాలి. బి.ఎల్‌.ఒ లకు శిక్షణ కూడా నిర్వహించాలి. మరోవైపున ఆ బి.ఎల్‌.ఒ లు ఇంటింటికి పంపిణీ చేసి భర్తీ అయిన వాటిని సేకరించాలి. పరిశీలించాలి. అంతేగాక పైస్థాయి అధికారులు హేతుబద్దంగా వాటిని పునరేర్పాటు చేయాలి. ప్రతిపాదిత పోలింగ్‌ కేంద్రాల పునర్వ్యవస్థీకరణకు తుది రూపమివ్వాలి. పోలింగ్‌ కేంద్రాల జాబితాకు ఆమోదం పొందాలి. ముసాయిదా ఓటర్ల జాబితాలను 2025 ఆగష్టు 1 లోగా ప్రచురించాలి. 2025 సెప్టెంబరు 30 నాటికి తుది ఓటర్ల జాబితాలను ముద్రించాలి. ఆ తదుపరి రెండు మాసాలు అభ్యంతరాలు అభ్యర్థనల కోసం ఉద్దేశించబడింది.
భారీగా ఓట్ల గండం
దాదాపు విజ్ఞాన సర్వస్వాలలాగా కనబడే ఈ పత్రాలను పైపైన చూసినా అవెంత విపరీత తరహాలో ఉన్నాయో తెలుస్తుంది. వేగంగా పట్టణీకరణ, నిరంతరాయంగా వలసలు, కొత్త ఓటర్ల అర్హతలు, మరణాలు నమోదు కాకపోవడం, విదేశీ అక్రమ వలసదార్ల చేర్పింపు ఈ ముమ్మర పరిశీలనకు సమర్థనగా చెప్పడం కూడా అంతే విడ్డూరంగా వుంది. 2003 జనవరి 1వ తేదీని కొలబద్దగా ఈ ఓట్ల జాబితాలను తాజా పరచడం లక్ష్యంగా చెబుతున్నారు. ఈ సమస్యలు రెండు దశాబ్దాలుగా సాగుతున్నాయన్న మాట. ఈ తర్కం ప్రకారం చూసేట్టయితే గత 22 ఏళ్లుగా బీహార్‌లో జరిగిన ఎన్నికలన్నీ సక్రమంగా లేనట్టేనా? అలాంటి ఆరోపణ ఇప్పటివరకూ పాలించిన గత ప్రభుత్వాల చట్టబద్ధతను ప్రశ్నార్థకం చేసేదిగా వుంది.ఈ పత్రాలు క్లుప్తంగా రాజకీయ పార్టీల సహకారాన్ని గురించి ప్రస్తావిస్తున్నా ఆచరణలో ఎన్నికల కమిషన్‌ వాటితో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఈ బృహత్‌ కసరత్తు ప్రారంభించింది. అక్రమ వలసదారుల గురించి ప్రస్తావించడం, చాలా కఠినమైన గుర్తింపు పత్రాలు అందించాలని కోరడం చూస్తే దొడ్డిదోవన పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తున్నారా అనుకోవాల్సి వస్తుంది. ఈ మొత్తం తతంగంలో చిన్న, పెద్ద లొసుగులు ఇంకా అనేకం ఉన్నాయి. ప్రత్యేక ప్రగాఢ పరిశీలన ముసుగులో ఓటర్ల జాబితాల ప్రక్షాళన పేరిట భారీగానే ఓట్లను తొలగించడం జరుగుతుంది. దీనివల్ల బీహార్‌లోని పేద, శ్రామిక వర్గాలే ఎక్కువగా నష్టపోతాయి. ఎందుకంటే వారిలో అత్యధికులు వలసలు పోతుంటారు గనక డిజిటల్‌గా గానీ, భౌతికంగా గానీ దీన్ని అందుకునే అవకాశం వుండదు.
మహారాష్ట్రకు రివర్స్‌ ప్రయోగం
ఇది ఒక విధంగా మహారాష్ట్రలో జరిగిన దాన్ని అటూ ఇటూ చేయడమే. అక్కడ లోక్‌సభ, శాసనసభ ఎన్నికల మధ్యలో కేవలం అయిదు మాసాల వ్యవధిలో 39 లక్షల ఓట్లను కొత్తగా చేర్చడం జనాభా తర్కానికి విరుద్ధంగా జరిగింది. దీనంతటి తుది సందేశం బిగ్గరగా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. చొరబాటు మిషతో కొత్తగా ప్రజల్లో విభజన తీసుకురావడమే. ప్రత్యేక ప్రగాఢ పరిశీలన ఈ ప్రస్తుత రూపంలో ముందుకు సాగడానికి వీల్లేదు. ప్రతిపక్షాలు దీనికి వ్యతిరేకంగా గొంతెత్తాయి. ఇప్పుడు బంతి పూర్తిగా ఇసిఐ కోర్టులో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగ స్ఫూర్తిని వదులుకోవడం సరైంది కాదు.
(జులై2 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -