ధరణి దోపిడీకి అడ్డున్నారనే వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు
కాళేశ్వరం కూలిందని బీఆర్‌ఎస్‌ను రద్దు చేసుకున్నారా?
ఆ పాలకులు కొల్లగొట్టిన భూములు బయటికి తీయండి
ప్రజల సమస్యలకు పరిష్కారం చూపండి : జీపీవోలకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒకరిద్దరు తప్పులు చేస్తే గ్రామ పాలనా వ్యవస్థనే రద్దు చేసిన బీఆర్‌ఎస్ పాలకులు.. నిర్మించిన కాళేశ్వరం కూలిపోతే ఆ పార్టీని రద్దు చేసుకున్నారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ధరణి పేరుతో భూములు కొల్లగొట్టేందుకు అడ్డుకున్నందుకే గ్రామపాలనా వ్యవస్థలో కీలకమైన వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారని ఆయన విమర్శించారు. ఇంట్లోకి ఎలుక వస్తే ఆ ఎలుకను బయటికి పంపిస్తారే తప్ప ఆ ఇంటిని తగులబెట్టుకోరన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని ముందే నిర్ణయించుకుని చంపే ముందు కుక్కను పిచ్చి కుక్కలా చిత్రీకరించినట్టు ప్రజల్లో వీఆర్వో వ్యవస్థ పట్ల విపరీతమైన దుష్ర్రచారం చేశారని ఆరోపించారు. ఆ మచ్చను తొలగించుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ పాలకుల భూముల భాగోతాన్ని బయటికి తేవాలనీ, గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన నూతనంగా నియమితులైన 6,860 మంది గ్రామపాలనాధికారుల నియామకపత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంలోనూ రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషించారని అభినందించారు. కొమురం భీం నుంచి 2023 ఎన్నికల వరకు జరిగిన అనేక పోరాటాలు తెలంగాణలో భూమి చుట్టూనే జరిగాయని ఆయన గుర్తు చేశారు. జల్, జమీన్, జంగిల్, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగించిన పోరాటాలు, వీరనారి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి లాంటి యోధుల తిరుగుబాటు అంతా భూమి కోసమేనని తెలిపారు. వెదిరె రాంచంద్రారెడ్డి వేలాది ఎకరాల భూమి పంపిణీతో పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా పేరుగాంచిందన్నారు. దున్నెవానిదే భూమి అని నినదించిన నక్సలైట్ల పోరాటంతో నాటి ముఖ్యమంత్రి పి.వి.నర్సింహారావు, నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఒప్పించి వ్యవసాయ భూములపై సీలింగ్ తెచ్చి 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంపిణీ చేశారని తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలు పోడు వ్యవసాయం కోసం పంపిణీ జరిగిందని చెప్పారు. తెలంగాణలో భూమిని చెరబట్టి ఆధిపత్యం చేయాలనుకున్న ప్రతి సందర్భాల్లో అలాంటి వారిని దిగంతాలకు తరిమికొట్టిన పోరాట చరిత్ర ప్రజలకుందని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణి నుంచి విముక్తి కల్పించి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టాన్ని తెచ్చి నిబంధనలు రూపొందించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలకులు భూసమస్యలు పరిష్కారం కాకుండా అడ్డుపడి ఆ నెపాన్ని రెవెన్యూ వ్యవస్థ మీదికి నెట్టడంతో ప్రజలు కోపోద్రిక్తులైన ఇబ్రహీంపట్నం హత్యలు, సిరిసిల్ల నిరసనలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉదహరించారు. అయితే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో గ్రామ రెవెన్యూ సిబ్బంది లేని లోటును ప్రజా ప్రభుత్వం గుర్తించిందని సీఎం చెప్పారు. పథకాలు ప్రజలకు మెరుగ్గా అందించేందుకు గ్రామపాలనాధికారులు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. అదే సమయంలో రెవెన్యూ సిబ్బందిపై గత పాలులు చేసిన దుష్ప్రచారాన్ని, తనకు పాలన చేతకాదని చేస్తున్న ఆరోప ణలను తిప్పికొట్టాలని జీపీవోలకు సూచించారు. ధరణి పేరుతో జరిగిన దోపిడీలను ప్రజలకు వివరించాలన్నారు.
ఉగాది నాటికి 7 వేల మంది సర్వేయర్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సర్వేయర్ల నియామకం ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టబోతున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 318 మంది సర్వేయర్లుకు అదనంగా 800 మందిని నియమించడమేగాక 7,000 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను వచ్చే ఉగాదిలోగా భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణిని తొలగించి భూభారతి చట్టాన్ని తెచ్చినట్టు వెల్లడించారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయకుండా 8.65 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు.
గత ప్రభుత్వంలో సాదాబైనామాలపై సుమారు 9.26 లక్షల దరఖాస్తులను పరిష్కరించలేదనీ, పైగా కోర్టుల్లో కేసులు నమోదయ్యాయని విమర్శించారు. వారం రోజుల క్రితం కోర్టులో సాదాబైనామాలపై స్టేను తొలగించేలా ప్రయత్నించి సఫలమయ్యామని తెలిపారు. గతంలో వచ్చిన దరఖాస్తులు, తాజా దరఖాస్తులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతేగాక సుమారు 3 దశాబ్దాలుగా వివిధ ప్రాజెక్టులకు జరిగిన భూసేకరణలో ఇంకా రైతుల పేర్లు పహాణీల్లో ఉండిపోయాయనీ, ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీనాటికి అన్ని గ్రామాల వారీగా జమాబందీ మేరకు అప్పటి వరకు జరిగిన క్రయవిక్రయాలను హక్కులను వివరించేలా ప్రకటన జారీ చేస్తామన్నారు. దీని హార్డ్‌కాపీలు ప్రతి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, భూపరిపాలన ప్రధాన కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్ పర్సన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.