Thursday, November 6, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివేతన సవరణ ప్రభుత్వాల దయాదక్షిణ్యం కాదు…

వేతన సవరణ ప్రభుత్వాల దయాదక్షిణ్యం కాదు…

- Advertisement -

పదేండ్లకోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరగాలి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం గత జనవరిలో వేతన సవరణ కమిటీ నియమిస్తున్నట్టు ప్రకటన చేసింది. పది నెలల తర్వాత వేతన కమిటీ అధ్యక్షులు, సభ్యులను నియమించింది. అదే విధంగా కమిటీ అనుసరించాల్సిన సూచనలను, మార్గ దర్శకాలను కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కమిటీ సిఫార్సులతో కోటిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి జరుగుతుందని, కనీస వేతనం రూ.18 వేల నుంచి 30 వేలకు పెరుగుతుందని, 13 శాతం జీతాలు పెరుగుతాయని, కేంద్ర ఖజానాపై 3.2 లక్షల కోట్ల రూపాయల భారం పడనున్నదని వార్తలు కూడా వచ్చాయి. ఉద్యోగులకు వేతన సవరణ చేయడం ప్రభుత్వ దయాదాక్షిణ్యమా? ఉద్యోగులకు, కార్మికులకు ఏ ప్రాతిపదికన వేతన సవరణ కమిటీ సిఫార్సులు చేయాలి?

దశాబ్దానికోసారి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల వేతనాలు సవరిస్తుంది. అందుకు వేతన సవరణ కమిషన్‌ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలను సవరించి వారి కొనుగోలు శక్తి క్షీణించకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చూడటం బాధ్యత. అయితే ఉద్యోగుల వేతనాల సవరణ ప్రభుత్వాల దయాదా క్షిణ్యం కాదు. అది వారిహక్కు! న్యాయంగా గౌరవప్రదమైన జీవితం గడ పడం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు! అంతర్జాతీయ న్యాయ సూత్రాల కనుగుణంగా భారత ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై అంగీకరించిన నియమాలకు అనుగుణంగా ఉద్యోగులకు న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.

1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో కార్మికులకు ”జీవన వేతనం” గా ఉండాలని పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం నియమించిన న్యాయవేతనాల కమిటీ మూడు రకాల వేతనాలను సిఫార్సు చేసింది. ఒకటి – రోజువారీ జీవితాన్ని సాగించడానికి కొంతమేరకు చదువు వైద్యానికి అయ్యే ఖర్చుగా ”కనీస వేతనం”(Minimum wage). రెండు -?ఆనాటి పరిస్థితులను బట్టి భవిష్యత్తు అవకాశాలను బట్టి ”న్యాయవేతనం”(Fair wage). మూడు- అంతర్జాతీయ కార్మిక సంస్థ సూచనల ప్రకారం ఒక పరిమితితో సుఖపడే ”జీవన వేతనం”. ఆ తర్వాత 1957 లో జరిగిన 15 ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ ”అవసరాల ప్రాతిపదికగా కనీస వేతనం”(Need based Minimum wage) ఉండాలని నిర్ణయించింది. మనదేశంలోని శ్రామికునికి రోజుకు 2700 కేలరీల శక్తి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబాన్ని మూడు యూనిట్లుగా పరిగణించి కనీస వేతనం నిర్ణయించాలి. అయితే ఈ ప్రమాణాల మేరకు కనీస వేతనం నిర్ణయించబడడం లేదు. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగుల కొనుగోలుశక్తి పడిపోతోంది.

వినియోగదారుల సూచి ఆధారంగా ఆరు నెలలకోసారి కరువుభత్యం రూపంలో డిఏ చెల్లిస్తున్నప్పటికీ అదుపు లేని ద్రవ్యోల్బణంతో ఉద్యోగుల నిజవేతనాలు పడిపోతున్నాయి. ఈ వినియోగదారుల సూచి కూడా మారుతున్న పరిస్థితులకు ప్రతిబింబించడం లేదు. వినియోగ దారుల సూచిక కుటుంబ జీవన సర్వే (Family Living Survey) ఆధారంగా రూపొందిస్తారు. 1999-2001లో చేసిన సర్వే ఆధారంగా ప్రస్తుత డిఏ రేట్లు ఉన్నాయి. ఇందులో 160 ఆహార పదార్థాలు, ఆహారేతర పదార్థాలు మాత్రమే ఉన్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న చదువు, వైద్యం, ఫోన్లు, ఇంటి అద్దె, రవాణా ఖర్చులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. పైగా ఈ సూచికను ప్రతి ఐదేండ్లకు ఒకసారి చేసే సర్వే ఆధారంగా నిర్ణయించాలి. కానీ మన దేశంలో 1982 తర్వాత 2001లో నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత కూడా మారకపోవడంతో పాటు, ఉద్యోగి వినియోగ వస్తువుల్లో మార్పులు వచ్చినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఉద్యోగులు పెద్ద మొత్తంలో జీతాలను నష్టపోతున్నారు. పెరిగిన ఆయు ప్రమాణాలతో కుటుంబ సభ్యుల సంఖ్యలో తల్లిదండ్రులను చేర్చి, కుటుంబాన్ని నాలుగు యూనిట్లుగా లెక్కించి, కనీస వేతనాన్ని రూపొందించకపోవడం ఆశాస్త్రీయం.

1957లో జరిగిన 15 ఇండియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో నిర్ణయించిన ప్రమాణాలు మేరకు కుటుంబానికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులను, సేవలను పరిగణనలోకి తీసుకొని 1జనవరి2026 నాటి ధరల ప్రాతిపదికన అవసరాల ప్రాతిపదికగా కనీస వేతనాన్ని నిర్ణయించాల్సి ఉంది ఇంకా కనిపించని వైద్య ఖర్చులు ఉన్నతవిద్యగా ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే కనీస వేతనం ఇంకా పెంచాలి.కానీ తాజాగా నియమించిన వేతన సవరణ కమిటీ మార్గదర్శకాలు అలా లేవు. దేశంలోని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక జాగ్రత్తలు పాటించాలంటూ ముందరి కాళ్లకు బంధం వేసింది.అభివృద్ధికి కావలసిన నిధులు, సంక్షేమ చర్యలకు సరిపడా వనరులను నిర్ధారించి దానికి అనుగుణంగా వేతనాలు నిర్ణయించాలని, వాటా నిధులు లేని నాన్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాల ఖర్చుల తగ్గింపు, కేంద్ర వేతన సిఫార్సులు పాటించే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రయివేటు రంగంపై వేతన సవరణ ప్రభావాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని కమీషన్‌ను ఆదేశించారు.

ఈ మార్గదర్శకాలు ఉద్యోగుల, కార్మికుల, పెన్షనర్ల వ్యతిరేక సూచనలు తప్ప మరొకటి కాదు. వేతన సవరణ కమిటీ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థికస్థితులు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి అంశాలను పరిగణించాలి. అంతేకాక వేతన యంత్రాంగానికి వనరుల లభ్యత గురించి ప్రాతిపదికన పెన్షన్‌, వేతనాలు నిర్ణయించడం అనేది వేతనాలను పెన్షన్లను అదుపు చేయమని షరతులు విధించడమే అవుతుంది. ప్రయివేటు రంగంలో కార్మికుల శ్రమ దోపిడీ ఎక్కువ. వేతనాలు తక్కువ. అధ్వాన్నమైన పని పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగుల/కార్మికుల ప్రయోజనాల కంటే యాజమాన్యాల లాభాలకు ప్రాముఖ్యత ఉంటుంది. వాటితో కేంద్ర ప్రభుత్వ రంగాన్ని పోల్చడం, ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలను, పెన్షన్లను తగ్గించడానికే!

అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం, పదిహేనవ అంతర్జాతీయ కార్మిక సంస్థ సూచనల ప్రకారం అవసరాల ఆధారిత కనీస వేతనము, జీవనవ్యయ సూచిక గురించిన ప్రస్తావన లేని వేతన సవరణ మార్గదర్శకాలు చరిత్రలో ఇవే! కాంట్రిబ్యూషన్‌ లేని పెన్షన్‌ పథకాల నిరాధారమైన ఖర్చు అనే ప్రస్తావన ద్వారా పాత పెన్షన్‌ పథకంపై పరోక్ష దాడి చేస్తూ క్రమంగా దాన్ని రద్దుచేసే ప్రభుత్వ కుట్ర మార్గదర్శకాల వెనుక ఉంది. ఈ మార్గదర్శకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం సర్వీసులో ఉన్న ఉద్యోగుల వేతనాల తగ్గింపు,పెన్షనర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి.నయా ఉదారవాద ఆర్థిక విధానాలను తలకెత్తుకున్న బీజేపీ ప్రభుత్వం ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాల ఖర్చును తగ్గించే చర్యల్లో భాగంగా ఎనిమిదో వేతన సవరణ కమిషన్‌ సిఫార్సులు ఉండబోతున్నాయి. అందుకు భూమిక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో ఉంది. ఇటువంటి ఉద్యోగ, కార్మిక,పెన్షనర్ల వ్యతిరేక విధానాలను సమైక్య పోరాటాల ద్వారా ఉద్యోగ కార్మిక వర్గాలు ఎదుర్కొనడానికి సిద్ధం కావాలి.

కె.వేణుగోపాల్‌
9866514577

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -