Saturday, July 26, 2025
E-PAPER
Homeసినిమానిర్మాతల్లారా ఇకనైనా మేల్కోండి

నిర్మాతల్లారా ఇకనైనా మేల్కోండి

- Advertisement -

పవన్‌కళ్యాణ్‌, విజయ్‌లాంటి అగ్ర హీరోలు రాజకీయాల్లోకి ‘సై’ అంటూ దిగితే, అజిత్‌ లాంటోళ్లు వాళ్ళకి ఇష్టమైన కారు రేసుల్లో ‘రైయ్‌..రైయ్‌’ అంటూ దూసుకుపోతున్నారు. అయితే జోడుగుర్రాల స్వారీ చేసే ఇలాంటి అగ్ర హీరోలను నమ్ముకున్న నిర్మాతలు ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. లేకపోతే ఆ హీరోల లక్ష్యాలకు, ఇష్టాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే.. ‘హరి హర వీరమల్లు’ సినిమా. కరోనాకి ముందు ప్రారంభమైన, ఈ సినిమా కరోనా వల్ల కొంత కాలం, పవన్‌కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారం వల్ల కొంతకాలం, డిప్యూటీ సీఎం కావడంతో ఆయన బిజీ షెడ్యూల్స్‌ వల్ల కొంతకాలం.. దర్శకుడు క్రిష్‌ తప్పుకోవడం వల్ల కొంతకాలం, నాణ్యమైన గ్రాఫిక్‌ వర్క్స్‌ కోసం కొంత కాలం.. కనీసం అరడజనుకు పైగా మారిన విడుదల తేదీల వల్ల కొంత కాలం..వెరసీ ఈ సినిమా థియేటర్ల ముఖం చూడ్డానికి ఆరేళ్ళు పట్టింది.
ఆరేళ్ళు పట్టినా ‘వీరమల్లు’ ఏమైనా ప్రేక్షకుల్ని అలరించిందా అంటే అదీ లేదు. పవన్‌కళ్యాణ్‌ ఒన్‌ మ్యాన్‌ షో చేసినప్పటికీ సరైన కథాకథనాలు, అలరించని సంభాషణలు, నాణ్యత లేని గ్రాఫిక్‌ వర్క్‌.. ఇవన్నీ ఇదేం సినిమా అని పెదవి విరిచేలా చేశాయి. అన్నింటికి మించి సుదీర్ఘ కాలంపాటు సినిమా చేయటంతో హీరో, హీరోయిన్లే కాదు ఇతర ఆర్టిస్టులు సైతం ఒక్కో సీన్‌లో ఒక్కోలా కనిపించి, చిరాకు తెప్పించారు. సినిమాని ఆరు నెలల్లో పూర్తి చేసినా, ఆరేళ్ళల్లో పూర్తి చేసినా అంతిమంగా ప్రేక్షకులకు నచ్చకపోతే ఆ కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అయితే ఇక్కడ హీరోలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. వాళ్ళ కెరీర్‌లో ఇదొక ఫెయిల్యూర్‌ మాత్రమే. వాళ్ళ కోసం ఎగబడి సినిమాలు తీయాలనుకునే నిర్మాతలు బోల్డెంత మంది ఉంటారు. మరి ఫ్లాప్‌ అయిన నిర్మాత పరిస్థితి ఏంటి?, ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సదరు నిర్మాతని కాపాడేది ఎవరు?.
ఓ సినిమా ప్రారంభం అవుతుందంటే దర్శక, నిర్మాతలు ఎంతో జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్లతోపాటు ప్రధాన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల డేట్లను ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుంటారు. ఈ డేట్ల విషయంలో తేడాలొస్తే షూటింగ్‌లు క్యాన్సిలై నిర్మాతకు భారీ నష్టాన్ని తీసుకొస్తాయి. అందుకే అందరి డేట్లు పక్కాగా కుదిరిన తరువాతే షూటింగ్‌ని ప్లాన్‌ చేసుకుంటారు. అలాగే అవుట్‌డోర్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా వర్షాలు పడితే ఏ విధంగా షూటింగ్‌ చేసుకోవాలి?,
లొకేషన్లలో అనుకోని ఇబ్బందులు ఎదురైతే ఏవిధంగా షూటింగ్‌ చేసుకోవాలి?, అలాగే ఆరోగ్యపరంగా ఆర్టిస్టులకు ఏదైనా సమస్యలు వస్తే ఏ విధంగా షూటింగ్‌ చేసుకోవాలనే విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇక కథాకథనాల విషయంలోనూ ఇంతే జాగ్రత్తగా ఉంటారు. అయితే ‘హరి హర వీరమల్లు’ విషయంలో నిర్మాత ఎ.ఎం.రత్నం ఇలాంటి జాగ్రత్తల్ని తీసుకోవడంలో విఫలమయ్యారు. కరోనా వల్ల యావత్‌ చిత్ర పరిశ్రమ కష్టాల్ని ఎదుర్కొంది. ఆ కష్టాల్ని ఈ సినిమా పడింది. అలాగే ఇతర కారణాల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రధానంగా ఎన్నికలు, రాజకీయాల చుట్టూ తిరిగే క్రమంలో హీరో ఎంత కాలం స్ట్రక్‌ అవుతాడనే విషయాన్ని పట్టించుకోకుండా, సినిమా చేశారు. ఈ విషయంలో పవన్‌కళ్యాణ్‌తో ‘ఓజీ’, ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చేస్తున్న చిత్ర నిర్మాతలకూ మినహా యింపు లేదు. ఈ సినిమాలు కూడా ఇప్పుడు ప్రారంభమైనవి కావు. హీరోకి టైమ్‌ కుదిరినప్పుడల్లా ఎంతో కొంత షూటింగ్‌ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీని వల్ల ఈ నిర్మాతలు అనుకున్న బడ్జెట్‌ ఎప్పుడో చేతులు దాటిపోయింది.
ఇక పవన్‌కళ్యాణ్‌ మాదిరిగానే తమిళ అగ్రనటుడు విజరు కూడా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సొంత పార్టీ పెట్టారు.
అయితే సినిమాలు చేసే విషయంలో ఆయన ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఆయన చేస్తున్న తన 69వ సినిమా ‘జననాయగన్‌’ని చివరి సినిమాగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆయనతో సినిమాలు తీయాలను కున్న చాలా మంది నిర్మాతలు వేరే హీరోలతో ప్లాన్‌ చేసుకుంటున్నారు.
ప్రజా సేవ, కారు రేసులు అనేవి హీరోల వ్యక్తిగతం. వారిని తప్పు బట్టే హక్కు ఎవరికీ లేదు. ఇక్కడ తప్పు కేవలం నిర్మాతలదే. ఇకనైనా ఆ తప్పు చేయకుండా నిర్మాతలు సరైన దిశలో ఆలోచిస్తారని ఆశిద్దాం.
– రెడ్డి హనుమంతరావు
హీరో అజిత్‌కి తమిళనాట మంచి క్రేజ్‌ ఉంది. అలాగే తెలుగు నాట కూడా ఆయనకంటూ ఓ ప్రత్యేక అభిమాన గణమూ ఉంది. రీసెంట్‌గా ఆయన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’తో మంచి సక్సెస్‌ సొంతం చేసుకున్నారు. దీనికి దర్శకత్వం వహించిన అదిక్‌ రవిచంద్రన్‌తోనే తన కొత్త సినిమాని అజిత్‌ చేయ బోతున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. ఇవి అజిత్‌ నటించబోయే తన 64వ చిత్రానికి సంబంధించిన వివరాలు. దీంతోపాటు మరికొన్ని సినిమాలను ప్లాన్‌ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, అజిత్‌కి బైక్‌ రేసులన్నా, కారు రేసులన్నా మహా ఇష్టం. ఇక తీరిక దొరికినప్పుడల్లా దూరాన్ని లెక్క చేయకుండా బైక్‌ మీద ట్రావెల్‌ చేస్తుంటారు. ‘వలిమై’ సినిమా చిత్రీకరణ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కి ఆయన చేసిన 650 కిలోమీటర్ల ప్రయాణమే ప్రత్యక్ష ఉదాహరణ. తరచూ కారు రేసుల్లో పాల్గొంటుంటారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు, మూడు సార్లు తృటిలో ప్రాణాపాయ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఇక రీసెంట్‌గా ఇటలీలో జరగబోయే జీటీ4 యూరోపియన్‌ కారు రేసుల్లో భాగంగా అజిత్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు 180 కిలోమీటర్ల వేగంగా వెళ్తున్న ఆయన కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు అజిత్‌కి ఏమీ కాలేదు. ఇలాంటి రేసుల్లో మరణం సంభవించడం, ప్రమాదం కారణంగా బెడ్‌కే పరిమితమైన ఎంతో మంది రేసర్లు ఉన్నారు. ఈ విషయంలో అజిత్‌ ఏమీ అతీతుడు కాదు కదా..?, ఈ రేసుల్లో ఆయనకు ఏమైనా జరగొచ్చు. అప్పుడు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న సినిమా నిర్మాతల పరిస్థితి ఏంటి?.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -