Monday, October 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమూడు పార్టీల మధ్య మాటల యుద్ధం

మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం

- Advertisement -

జూబ్లీహిల్స్‌లో ప్రచార జోరు
నియోజకవర్గంలో ఇంటింటికీ కాంగ్రెస్‌
సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు
సీటుపై బీజేపీ కన్ను


నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ.. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ముమ్మర ప్రచారంలో నిమగమయ్యాయి. అగ్రనేతలు రంగంలోకి దిగి మాటల తూటాలు పేల్చుతుం డటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గడప గడపకూ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు, నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి మాగంటి సునీత ఆ పార్టీ తరపున, వి.నవీన్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా, లంకల దీపక్‌ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఉప ఎన్నిక నవంబర్‌ 11న జరగనుంది.

మూడు పార్టీల మధ్య నువ్వా..నేనా..?
ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, ఇచ్చిన హామీలను అమలు చేసేలా చేయవచ్చని ప్రజలకు చెబుతున్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఈ రెండు పార్టీల కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నిక రౌడీలకు, మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటమని.. ఇందులో మహిళనే గెలవాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ మాటాలతో ప్రచారాన్ని మరింత హీటేక్కించారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు దశాబ్దాలుగా జూబ్లీహిల్స్‌ను నిర్లక్ష్యం చేశాయని విమర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని ‘సమస్యల హిల్స్‌’గా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీల మధ్య అవగాహన ఉందని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది ఎంఐఎంకు వేసినట్టేనని చెబుతున్నారు.

రంగంలోకి అగ్రనేతలు
మూడు ప్రధాన పార్టీలు తమ అగ్రనేతలను ప్రచార బరిలోకి దింపాయి. బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు సహా 40 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ విడుదల చేయగా.. కేటీఆర్‌, హరీశ్‌ రావు వంటి నేతలు ఇప్పటికే డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లను ప్రకటించగా.. మంత్రులు, సీనియర్‌ నేతలు డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతలు చేపట్టారు.

పొన్నం ప్రభాకర్‌, ఇతర నేతలు ఇప్పటికే డివిజన్ల వారీగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ.. ఓటర్లకు ప్రజాపాలన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ఓట్లు అడుగుతున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈనెల 28 నుంచి రోడ్‌ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రచార బాధ్యతలను ముందుండి నడిపిస్తున్నారు. ఆయనతో పాటు పలువురు రాష్ట్రస్థాయి నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.

గడప గడపకూ ప్రచారం
అభ్యర్థులు, పార్టీల నేతలు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ మంత్రులు, నేతలు డివిజన్ల వారీగా గడప గడపకూ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఇంటింటికి వెళ్లి, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీ నేతలు సైతం, ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బస్తీలలో పర్యటిస్తూ, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం రానున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల మూడు పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -