ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం చుట్టూ ముట్టు సూర్యాపేట.. నట్ట నడుమ నల్గొండ.. నీవు ఉండేది హైద్రాబాదు, దాని పక్కన గోల్కొండ.. గోల్కొండ ఖిల్లా కింద నిన్ను ఘోరి కడతాం కొడుకో నైజాం సర్కారోడా.. అని గర్జించి, తొడగొట్టి, సవాల్ విసిరి, ప్రజలచేత ఆయుధాలు పట్టించి నైజాం సర్కారోడిని నడ్డి విరిచిన చరిత్ర దళాన్ని నడిపించిన కమ్యూనిస్టు పార్టీది.. అదే చైతన్యంతో సూర్యాపేట ఆనుకొని ఉన్న బరిసెలు అందుకొని బరిగీసిన గ్రామం బాలెంలా..
అది 1946 అక్టోబర్ 18 నాడు తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రజలు ఇంకా మేల్కొనక ముందే లెవీ గల్లా వసూల్ పేరుతో పోలీసులు, రెవెన్యూ అధికారులు బాలెంల గ్రామంపై పడి గ్రామాన్ని దోపిడి చేసి దొరికిన ధాన్యం, స్త్రీలపై నగలు దోచుకొని వెళ్లడానికి మందీ మార్భలంతో పెద్దఎత్తున వచ్చి దౌర్జన్యం మొదలుపెట్టారు. అప్పటికే గ్రామంలో ఉన్న సంఘ నాయకులు పసిగట్టి తీవ్రంగా ప్రతిఘటించారు… కానీ పోలీసులు దౌర్జన్యం చేశారు.
ఇక తప్పని పరిస్థితుల్లో గ్రామ యువకులైన గార్లపాటి అనంత రెడ్డి, పటేల్ మట్టారెడ్డి, సుంకు రంగయ్య, జమాల్ సాబ్, చాకలి బిక్షం, చాకలి చెన్నయ్య ఏకమై చేతికి అందిన గునపాలు, ముల్లు కర్రలు, రోకలి బండలతో పోలీసులతో గంటకు పైగా భీకర యుద్ధం చేశారు. పోలీసుల తుపాకులు లాక్కొని వారిని ఉరికించి కొట్టారు. తిరిగి దొంగ చాటుగా సాయుధులైన 25 మంది పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టీ విక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఏ ఆయుధాలు లేని యువకులు పోలీసు మూకలను ఎదుర్కోవడం సాధ్యం కాలేదు. పోలీసులు జరిపిన కాల్పుల్లో గార్లపాటి అనంత రెడ్డి, పటేల్ మట్టారెడ్డి, పోరాడుతూ నేలకొరిగిన తొలి అమరులు. ఆ ఘటన అనంతరం గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా 170 మందిని అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టీ జైల్లో పెట్టారు…
అది 1946.. నవంబర్ 2న అర్ధరాత్రి ఐదు వందల మంది సాయుధ మిలటరీ పాత సూర్యాపేటను దళం ఆచూకీ తెలిసి చుట్టూ ముట్టిర్రు…
ఆ సందర్భంగా భీమిరెడ్డి నర్సింహ నాయకత్వంలో అనిరెడ్డి వెంకటరెడ్డి, చకిలం తిరుమలరావులు కలిసి అప్పటికే గ్రామంలో శిక్షణ పొందిన ప్రజలు అప్రమత్తంగా ఉండి ఊరుకు పడమరగా గుట్టపై నగారా మోగించి ప్రజలు తెల్లవారు జామున తండోపతండాలుగా చేరి ప్రతిఘటనకు సిద్ధమయ్యారు.. తెల్లవారు జామున నాలుగు గంటల నుండి ఉదయం 12 గంటల వరకు మిలటరీని ఒక్క అడుగు కూడా ముందుకు రానివ్వలేదు.. మిలటరీ చెట్టుకు పుట్టకు దాగి ఒకే సారి అదును చూసుకొని విక్షణ రహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఆ పోలీసు దాడిలో సరసాని నర్సయ్య, బిక్షమ్మయ్య, అమరులయ్యారూ..
హుజూర్‌నగర్ తాలుకా మల్లారెడ్డి గూడెంలో 1946 డిసెంబర్ ఒకటిన జరిగిన అర్ధరాత్రి మిలటరీ అకస్మాత్ గా దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారు.. ఆ గ్రామానికి చెందిన దళ సభ్యులు ఒకే ఒక సైరన్ తో ఆరువందల మంది జనం ఒడిసెలు, బరిసెలు, గుతపలు, గొడ్డళ్లు, కొడవళ్ళు రోకళ్ళు, కారం ఉండలతో గుమ్మి గూడి ఎదురు దాడికి దిగారు. మిలటరీ ఒక్క అడుగు వెనుకకు వేసినట్లే వేసి కుట్రపూరితంగా నడి బజారులో జరుగుతున్న సభలో ముందు వరుసలో ఉన్న యరబోలు అప్పిరెడ్డి, ముండి వీరయ్యను కాల్చి చంపారు. తన్నీరు నాగయ్య, గంగారెడ్డి నర్సారెడ్డి లకు గాయాలు అయ్యాయి. దాంతో రెచ్చిపోయిన స్త్రీలు కారం ఉండలతో మిలటరీపై చల్లుకుంటూ రోకల్లు చేతపట్టి వెంటపడ్డారు. మిలటరీ దాడిలో తోటి కోడళ్లు అయిన చింద్రాల గుర్వమ్మ, తొండమ్మ, అంకాలమ్మలను మిలటరీ కాల్చిచంపారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన తొలి హరిజన మహిళా మణులు మల్లారెడ్డి గూడెం వాసులే..
అంతటి పోరాట చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్ – బీజేపీ వక్రీకరిస్తున్నాయి.. ఇది హిందువులు ముస్లీలపై జరిపిన పోరాటంగా, హిందువులు సాధించిన విజయంగా చెప్పుతూ సాధారణ ప్రజలు ఆయుధాలు పట్టి ప్రభుత్వ మిలటరీ దళాలను, రజాకారు మూకలను, భూస్వాముల గూండాలను తరిమి తరిమి కొట్టిన మట్టి మనుషులు చేసిన ప్రజా తిరుగుబాటు. వేల మంది అమరులు త్యాగాలు చేసిన గొప్ప పోరాటం. పోరాటంలో ఆనవాళ్లు లేని వారు. చరిత్ర తెలియని వారు పోరాటానికి మతం రంగు పూసి హిందువులు ముస్లింల పైన చేసిన పోరాటంగా చెప్పుతున్నారు. భీమిరెడ్డి నర్సింహ రెడ్డి అన్నట్లుగా పులిని చంపంది ఒకరైతే నెత్తురు చల్లుకొని నేనే పులిని చంపినట్లుగా బీజేపీ సిగ్గు ఎగ్గు లేకుండా పోరాడిన ప్రజలకు మతం రంగు పూసి ముస్లీం,హిందువుల మధ్య జరిగిన పోరాటంగా చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు.
నెమ్మాది వెంకటేశ్వర్లు