– అధికార, ప్రతిపక్షం ఢీ అంటే ఢీ
– కాళేశ్వరం నివేదికతో మరింత ఊతం
– అసెంబ్లీలో చర్చించాకే చర్యలు
– పంచాయతీ ఎన్నికల తర్వాతే అరెస్ట్‌లు ?
– కమిషన్ నివేదికను అడిగిన హరీశ్
– అసెంబ్లీలో ఇచ్చే ఛాన్స్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రోజురోజుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక అగ్గి రాజేస్తున్నది. అధికార, ప్రతిపక్షం మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. పోటా పోటీగా స్పందిస్తున్నాయి. కాళేశ్వరం బ్యారేజీలపై దాదాపు ఏడాదిన్నరపాటు విచారించిన పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల సర్కారుకు నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. అన్నీ తానై వ్యవహరించి నిర్ణయాలు తీసుకున్న మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తోపాటు ఇతర ఉ్నతాధికారులూ బాధ్యులని నివేదిక తేల్చింది. ఈనేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ఇతరులు మీడియాతో మాట్లాడుతూ పాత బీఆర్‌ఎస్ సర్కారుతోపాటు అప్పటి పాలకవర్గానిదే బాధ్యత అంటూ విమర్శలకు దిగారు. నివేదిక సర్కారుకు అందిన వెంటనే అది తప్పులతడక, అబద్ధాల పుట్ట అంటూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీశ్‌రావు, తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావును కలిశారు. పూర్తిస్థాయి కమిషన్ నివేదిక కాపీ ఇవ్వాలంటూ తన తరపున, కేసీఆర్ తరపున వినతిపత్రాలు సమర్పించారు. దీనిపై అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం పంద్రాగస్టు తర్వాత వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ద్వారా బీఆర్‌ఎస్‌ను ప్రజల్లో దోషిగా నిలపాలనే వ్యూహంతో సర్కారు కదలికలు ఉన్నాయి. వాటిని అడ్డుకునేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఆ పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో జలరాజకీయం మరింత వేడెక్కనుంది. ఇందుకు అసెంబ్లీ వేదిక కానుంది. అయితే ఈ నివేదికపై పోలీసు ‘సిట్’ ఏర్పాటు చేయాలా ? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగానే బాధ్యులపై కేసులు పెట్టి చర్యలకు దిగాలా ? అనే మీమాంసలో ప్రస్తుతం సర్కారు ఉంది. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లోగా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు భరోసా, ఇతర పథకాల అమలుతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కొంత తగ్గిందనే భావన సర్కారులో నెలకొంది. బీసీ రిజర్వేషన్లను కేంద్రం అనుమతించకపోతే, పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలుచేయడం ద్వారా పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని రేవంత్ సర్కారు భావిస్తున్నది. ఈ ఎన్నికలకు ముందే కాళేశ్వరం నివేదిక ఆధారంగా అరెస్ట్‌లు ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదముందనే అభిప్రాయాలు వస్తున్నాయి. అసలు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ముట్టుకునే దమ్ముందా అనే రాజకీయ సవాళ్లు సైతం వినిపిస్తున్నాయి. కాళేశ్వరంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ, అదే ప్రాజెక్టుతో మళ్లీ వార్తల్లో నిలిచే పరిస్థితులు ఏర్పడవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
జల రాజకీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES