– పెరుగుతున్న నీటిమట్టం
– జూరాల 6 గేట్లు ఎత్తివేత
నవతెలంగాణ- ధరూర్/ మహదేవపూర్
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతోపాటు రాష్ట్రంలోనూ కొద్దిపాటి వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ నుంచి జూరాలకు వరద కొనసాగుతుండటంతో 6గేట్లు ఎత్తి శ్రీశైలానికి వదిలారు. ఐదు యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఎగువ నుంచి 87 వేల క్యూసెక్కుల వరద చేరుతున్నది. పూర్తిస్థాయి నీటి మట్టం 9.587 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.150 టీఎంసీల నీట నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం 215.7080 టీఎంసీలు కాగా, 152.4941 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 12 అడుగులు నీరు వచ్చి చేరితే శ్రీశైలం నిండుతుంది. కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద నీరు దిగువకు వస్తోంది. తుంగభద్ర నది పొంగిపొర్లుతోంది. ఆల్మట్టి డ్యాం నుంచి జూరాలకు పెద్దఎత్తున వరద వచ్చి చేరుతోంది.
కాళేశ్వరం, మేడిగడ్డ వద్ద పెరిగిన నీటిమట్టం
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం మేడిగడ్డ వద్ద గోదావరి నీటిమట్టం 16.17టీఎంసీల సామర్థ్యం కాగా, మరమ్మతుల కారణంగా గతేడాదిగా 85గేట్లు తెరిచే ఉంచుతున్నారు. ప్రస్తుతం 12,600 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో కిందికి వదులుతున్నట్టు మేడిగడ్డ డీఈ సురేష్ మంగళవారం తెలిపారు. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో అక్కడి నుంచి క్రమక్రమంగా వరద కాళేశ్వరం చేరుతోంది. దీంతో కాళేేశ్వరం వద్ద మెట్ల వరకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు సూచిస్తున్నారు. మేడిగడ్డ వద్ద 8 గేట్లు ఎత్తివేయడంతో పెద్దంపేట లంకలగడ్డ కింది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండటంతోపాటు ఎవరూ గోదావరిలోకి పోవద్దని, సెల్ఫీలు దిగొద్దని రెవెన్యూ అధికారులు కోరారు. వరంగల్ జిల్లా పరిధి పాకాల సరస్సు 30.1అడుగుల సామర్థ్యం కాగా ప్రస్తుతం 17.8 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది.