Sunday, July 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమేమున్నామనీ…!

మేమున్నామనీ…!

- Advertisement -

”నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమె కన్నీరు నించుటకు నేనున్నానని, నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ…” అంటూ స్నేహ హస్తాన్ని అందించగల ఒక మనిషి ఉంటేచాలని పాడుకున్నాడు శ్రీశ్రీ. నీతిగా, నిజాయితీగా, స్నేహంగా, ప్రేమగా జీవించే వారికి కష్టం, దుఃఖం వచ్చినపుడు, భుజంపై చేయివేసి, కన్నీళ్ళను తుడిచి మేమున్నామని ధైర్యం చెప్పటం మనుషులంగా సౌహార్ధత ప్రకటించడం మనందరి కర్తవ్యం. కనీసవిధి కూడా. ఇది వ్యక్తులకు మాత్రమేకాదు, దేశాల మధ్య కూడా అవసరమైనదే. దేశమంటే మట్టి కాదు మనుషులోరు అని గురజాడ చెప్పాడు కదా ! ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ మనుషులు తల్లడిల్లినా హదయం చలించడం, సహాయాన్ని అందించడం మానవులంగా మనం చేయాల్సిన పని. ఎంతో ఆత్మగౌరవంతో ప్రజల మద్దతుతో తన గమనాన్ని సాగిస్తున్న క్యూబాపై అమానవీయ ఆంక్షలతో లొంగదీసుకోవాలని అమెరికన్‌ సామ్రాజ్యవాదం చూస్తోంది. ఇప్పుడే కాదు ఫిడెల్‌ కాస్ట్రో, చె గువేరాల నాయకత్వాన 1959లో విప్లవం విజయవంతమయిన నాటి నుండీ, అమెరికాకు క్యూబా అంటే ఎనలేని ద్వేషం. ఎన్ని ఆంక్షలు, దాడులు, కుట్రలు చేసినా, ప్రజల అండదండలతో సోషలిస్టు దేశంగా నిలదొక్కుకొంటున్న అతి చిన్న దేశం క్యూబా. అంత నిబ్బరంగా, నిబద్ధతతో ఉన్నందుననే అమెరికాలాంటి ప్రపంచ పోలీసూ ఏమీ చేయలేకపోతున్నది. కానీ కుయుక్తులతో, నిర్బంధాలతో దుర్మార్గాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. అయినా తలవంచక ధైర్యంగా నిలబడ్డ కమ్యూనిస్టు దేశం క్యూబా.
సోషలిజం అన్నా, కమ్యూనిస్టు లన్నా, సాధారణంగానే దోపిడి దారులకు చిర్రెత్తుకొస్తదాయె. ఇక ప్రపంచ దేశాలను దోపిడి చేసి బతుకీడుస్తున్న అమెరికా క్యూబాను చూస్తే వెర్రెక్కి పోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ రోజు సొంత దేశంలోని న్యూయార్క్‌లో తనకు వ్యతిరేకి అయిన మందానీని కమ్యూనిస్టు అనీ, అతను మేయర్‌గా ఎన్నికయితే, న్యూయార్క్‌ తన పరిపాలన కిందకు తీసుకువస్తానని హెచ్చరిస్తున్న ట్రంప్‌ కమ్యూనిస్టు లంటేనే వణికిపోతున్నాడు. అందుకే క్యూబాపై తీవ్ర నిర్బంధానికి పూనుకుంటున్నాడు. ఇప్పుడు కొత్తగా క్యూబాతో వాణిజ్యం చేయాలనుకునే కంపెనీలు, దేశాలపై ఒత్తిడి తెచ్చి దేశాన్ని అస్థిరపరచే పనికి అమెరికా పూనుకొంటున్నది. గతంలో క్యూబా దేశంలోని పసిపిల్లలు రోజూ త్రాగే పాలడబ్బాల సరఫరాను సైతం అడ్డుకుని తన అమానవీయతను చాటుకున్నది. ఇటీవల ఎల్‌ఎల్‌సి అనే లాజిస్టిక్స్‌ కంపెనీ క్యూబాకు ఆహార పదార్థాలతోపాటు చిన్నపాటి యంత్రాలు, ఎలక్ట్రిక్‌ వస్తువులు రవాణా చేసినందుకు ఆరు లక్షల డాలర్ల జరిమానా విధించి అమెరికా తన దుర్మార్గ పెత్తనాన్ని ప్రదర్శించింది. క్యూబాలో నేడు ఆహారం, ఔషధాలు, ఇంధనం, రవాణా వంటి ప్రాథమిక అవసరాల కొరతతో పాటు, విద్య వైద్యం గహనిర్మాణం వంటి రంగాలు నష్టపోయాయి. వీటిని సరిచేసుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ముడిసరుకుల కొరతతో ఇబ్బందులు పడుతోంది.
కోవిడ్‌ సమయంలో తమ దేశంలోని వైద్యులను, దాదాపు యాభై దేశాలకు పంపి సేవలందించింది. సేవలందుకున్న దేశాలలో అభివద్ధి చెందిన దేశాలూ ఉన్నాయి. అంతేకాదు కోవిడ్‌ టీకాలను ప్రపంచంలోని దేశాలకు విరివిగా అందించింది. ఆ విధంగా క్యూబా నిజమైన అంతర్జాతీయతను, మానవత్వం, స్నేహం, సంఘీభావాన్ని చాటుకుంది. తన దేశంలోని ప్రజలకు ఉచిత విద్యను, వైద్యాన్ని, క్రీడా సౌకర్యాలను అందిస్తోంది. కానీ కుట్రపూరితమైన అమెరికా ఆంక్షలు, నిర్బంధాలతో అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నది. మరోవైపు క్యూబాను ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాల జాబితాలో అమెరికా అన్యాయంగా చేర్చింది. ప్రపంచదేశాలన్నీ చూస్తుండగానే అమెరికా ఇన్ని దుర్మార్గాలకు పాల్పడుతోంది. అదే అమెరికా మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌, అఫ్ఘనిస్తాన్‌లను ప్రోత్సహిస్తుంది. పాలస్తీనాపై దాడులు చేసి, ప్రజలను చంపుతున్న ఇజ్రాయెల్‌ దమనకాండకు మద్దతునిస్తుంది. ఇతర దేశాలపై దాడులకు దిగుతుంది. తిరిగి తనను విభేదించేవారిని అన్యాయంగా దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇది అమెరికా దుష్టత్వం.
అందుకే ఆత్మగౌరవంతో, స్వేచ్ఛకోసం, ఆత్మవిశ్వాసంతో పొరాడుతున్న క్యూబాను బలపరచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ”నేషనల్‌ కమిటీ ఫర్‌ సాలిడారిటీ విత్‌ క్యుబా” అనే సంస్థ మేమున్నాము నీకండగా అంటూ సహాయమందించేందుకు ముందుకు వచ్చి ప్రజల నుండి విరాళాలు సేకరిస్తోంది. సమతా భావనతో, దఢ నిశ్చయంతో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేస్తున్న ఆదర్శ క్యూబా దేశానికి స్నేహ హస్తాన్ని అందించాలి. ధైర్య వచనాన్ని గుండెల్లో నింపాలి. మనవంతు తోడ్పాటును ప్రకటించాలి. ‘మేమున్నామని’ చెప్పటమే మహా సంఘీభావం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -