Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'మార్పు' హామీని అమలు చేస్తున్నాం

‘మార్పు’ హామీని అమలు చేస్తున్నాం

- Advertisement -

– అందులో భాగంగానే వాట్సప్‌లో మీ సేవలు
– 580కుపైగా సేవలు ప్రజల చేతి వేళ్లపైనే : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రజలు కోరిన మార్పును ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. అందులో భాగంగా మీ సేవా ద్వారా అందే 580కిపైగా సేవలను వాట్సప్‌లో ప్రజల వేళ్లతోనే పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి సమక్షంలో వాట్సప్‌లో మీ సేవా సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 40కి పైగా విభాగాలకు చెందిన దాదాపు 580కి పైగా సేవలను ప్రజలు తమ చేతి వేళ్లతోనే వాట్సప్‌లో పొందే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని నిరక్షరాస్యులకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడమే తమ లక్ష్య మని స్పష్టం చేశారు. తద్వార సమానత్వాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. డాటా ఎక్స్ఛేంజ్‌ ప్లాట్‌ఫాం ను తెచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఏఐ డేటాను ఉపయోగించుకుని డెలివరీ సిస్టమ్స్‌ ద్వారా మెరుగైన సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. రాబోయే ఏడాది కాలంలో 10 లక్షల మందిని ఏఐలో సాధికారిత దిశగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మీ సేవా కార్యక్రమాలు ఇంగ్లీష్‌ భాషలో అందుబాటులో ఉన్నాయనీ, భవిష్యత్తులో దేశంలోని అన్ని భాషలతో పాటు, వాయిస్‌ కమాండ్‌తో సేవలందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజరు కుమార్‌, మీ సేవా సర్వీసెస్‌ కమిషనర్‌ టి.రవి కిరణ్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, మెటా ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -