Friday, July 4, 2025
E-PAPER
Homeమానవికుటుంబం మ‌ద్ద‌తిస్తే మేం త‌క్కువేం కాదు

కుటుంబం మ‌ద్ద‌తిస్తే మేం త‌క్కువేం కాదు

- Advertisement -

ట్రాన్స్‌ బిడ్డగా వివక్షను ఎదుర్కోవడం నుండి పిహెచ్‌డి సంపాదించడం, కళాశాల తరగతి గదిలో అధ్యాపకురాలిగా అడుగుపెట్టడం వరకు ఆమె ప్రయాణం ఓ స్ఫూర్తిదాయక పోరాటం. కులం, లింగం, తరగతి అడ్డంకులను సవాలు చేసి ఓ శక్తిగా అవతరించారు. తమిళనాడు రాష్ట్రంలోనే ఇంగ్లీష్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమించబడ్డ మొట్టమొదటి ట్రాన్స్‌ ఉమెన్‌గా చరిత్ర సృష్టించారు. విద్యా రంగాలలో ట్రాన్స్‌ ప్రాతినిధ్యానికి పునాదులు వేశారు. ట్రాన్స్‌ యువతకు ఓ చేయూత నివ్వాలని ఆమె నిర్ణయించు కున్నారు. ఆమే ఎన్‌.జెన్సీ. ఇటీవల ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో ఆమె సంభాషించారు. ఆ వివరాలు నేటి మానవిలో…
ఎన్‌.జెన్సీ తమిళనాడులోని తిరుత్తణి సమీపంలోని ఒక చిన్న గ్రామానికి చెందినవారు. మారుమూల గ్రామంలో పెరిగిన జెన్సీ 2వ తరగతి నుంచే తాను భిన్నంగా ఉన్నానని గ్రహించారు. ‘నన్ను నేను ఎప్పుడూ అమ్మాయిలా భావించేదాన్ని. అమ్మాయిలతో నడవడం, వారితో ఆడుకోవడం, వారిలాగే ఇంటి పనులు చేయడం చాలా ఇష్టపడ్డాను. ఇదంతా సహజంగానే జరిగింది. అయితే ఇది చూసి ఇరుకు పొరుగువారు వారు ఎగతాళి చేసేవారు. నా తల్లిదండ్రులు కూడా దీన్ని తమ పరువు తక్కువగా భావించారు’ అని ఆమె తన చిన్ననాటి రోజులు పంచుకున్నారు.


ఒంటరితనం అలాగే ఉంది
‘నన్ను ఎగతాళి చేసిన కొందరు నా మార్కులు చూసి ప్రశంసించేవారు. నన్ను అర్థం చేసుకోని ఉపాధ్యాయులు కూడా చదువు పట్ల నా నిబద్ధతను అభినందించారు. అయినప్పటికీ నా ఒంటరితనం అలాగే ఉండేది. అబ్బాయిలు నాతో మాట్లాడటం మానేసారు’ అంటూ జెన్సీ పంచుకున్నారు. గ్రామంలో మంచి ఇంగ్లీష్‌ ఉపాధ్యాయులు లేకపోవడం, ఉన్న వారికి సరైన అర్హత లేకపోవడంతో జెన్సీకి ఇంగ్లీష్‌ పట్ల ఆసక్తిక పెరిగింది. ‘మా పాఠశాలలో ఎప్పుడూ ఇంగ్లీష్‌ టీచర్‌ ఉండేవారు కాదు. ఒకవేళ వచ్చినా వెంటనే చెన్నైకి బదిలీ చేసేవారు. అందుకే నేనే స్వయంగా సిద్ధం కావాల్సి వచ్చింది’ అని ఆమె వివరించారు. అయితే ఆమె 12వ తరగతి పరీక్షలలో ఇంగ్లీషులో అత్యల్ప మార్కులు సాధించారు. ఈ అనుభవం ఆమె దృఢ సంకల్పాన్ని మరింతగా పెంచింది.


మార్పు సాధ్యమే
ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చిన జెన్సీ ఇంగ్లీష్‌ సాహిత్యంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలలో బంగారు పతకాన్ని సంపాదించారు. లయోలా కళాశాలలో పిహెచ్‌డి కూడా పూర్తి చేసారు. లయోలాలో ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్‌ పడితే దరఖాస్తు చేసుకున్నారు. ‘ఈ పోస్టుకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపిక కూడా చాలా కఠినంగా ఉండేది. కానీ నేను నియామక లేఖ అందుకున్నప్పుడు ఆశ్చర్యపోయాను. ట్రాన్స్‌ ఉమెన్‌గా నన్ను అంగీకరించడమే కాకుండా చాలా మంది ప్రశంసించారు, ప్రోత్సహించారు. అప్పుడే మార్పు సాధ్యమని నేను భావించాను’ అని ఆమె అంటున్నారు.


ఓ చేతన వ్యూహం
ఆమె నియామకం జెన్సీకి మాత్రమే కాదు తమిళనాడుకు కూడా ఒక మైలురాయిగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ ఆమెను స్వయంగా అభినందించారు. ఆమె సాధించిన విజయాన్ని ట్రాన్స్‌ కమ్యూనిటీకి, అంతకు మించి స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు. కానీ జెన్సీ ప్రయాణం వ్యక్తిగత ప్రతిభ ద్వారా మాత్రమే రూపొందించబడలేదు. ఇది మనుగడ కోసం ఓ చేతన వ్యూహం. ఆమె తన ఎంఫిల్‌ తర్వాత వరకు తన లింగ నిర్ధారణ శస్త్రచికిత్సను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ‘నేను నా చదువు పూర్తి చేయడానికి ముందే పరివర్తన చెంది ఉంటే చాలా మంది ఇతర ట్రాన్స్‌వుమెన్‌ల మాదిరిగానే భిక్షాటన లేదా సెక్స్‌ వర్క్‌లోకి బలవంతంగా నెట్టబడేదాన్ని.ఇప్పుడు విద్య నాకు కొత్త ఎంపికలను ఇచ్చింది’ అంటూ ఆమె ఆనందంగా పంచుకున్నారు.


అదే అసలు సమస్య
ట్రాన్స్‌ వ్యక్తులు ఎదుర్కొంటున్న అడ్డంకుల పట్ల జెన్సీ స్పష్టంగా ఉన్నారు. ముఖ్యంగా పేద, గ్రామీణ, మద్దతు లేని కుటుంబాల నుండి వచ్చిన వారి సమస్యల గురించి మాట్లాడుతూ ‘తల్లిదండ్రులు తమ ట్రాన్స్‌ పిల్లలను తిరస్కరిస్తే వాళ్లు ఎక్కడికి వెళ్లాలి? ఎలా బతకాలి? ట్రాన్స్‌ కమ్యూనిటీ పెద్దలు వాళ్లను చేరదీస్తారు. కానీ కొంతకాలం తర్వాత సెక్స్‌ వర్క్‌లోకి నెట్టబడతారు. ఇది వారికి ఒక ఎంపిక కాదు, కానీ మనుగడ’ అన్నారు. ఆమె దృష్టిలో కుటుంబ మద్దతు ట్రాన్స్‌ వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైన అంశం. ‘తల్లిదండ్రులు తమ బిడ్డను అంగీకరిస్తే వారు ఏదైనా సాధించగలరు. మాకు చాలా నైపుణ్యాలు ఉన్నాయి, కానీ మమ్మల్ని ప్రోత్సహించడం లేదు. అదే అసలు సమస్య’ అంటున్నారు జెన్సీ.


వ్యవస్థాగత మార్పు అవసరం
ఇప్పుడు తన తరగతి గదిలో జెన్సీ పాఠాలకు చెప్పడానికి మించి ముందుకు సాగాలని చూస్తున్నారు. ‘నేను నా సమాజానికి మాత్రమే బోధించాలనుకోవడం లేదు. మొదట నేను ప్రొఫెసర్‌ని. ఆ తర్వాతే లింగమార్పిడి మహిళగా కనిపించాలనుకుంటున్నాను. నా పనిని నేను బాగా చేస్తే నా విద్యార్థులు వారి కుటుంబాలకు, స్నేహితులకు, పొరుగువారికి చెబుతారు. ఆ విధంగా సమాజంలో ట్రాన్స్‌ వ్యక్తుల పట్ల అవగాహన పెరుగుతుంది’ అంటున్నారు. విద్యార్థులు తనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారని ఆమె అంటున్నారు. ‘మేడమ్‌, మీరు చాలా బాగా బోధిస్తున్నారు. మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది’ అని విద్యార్థులు అంటున్నారు. జెన్సీ ఇప్పుడు కోరుకునేది వ్యవస్థాగత మార్పు. ‘ప్రభుత్వం పాఠశాలలో ట్రాన్స్‌ వ్యక్తుల గురించి ఒక పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలి. తల్లిదండ్రులలో అవగాహన పెంచాలి. కుటుంబాలు అర్థం చేసుకోవడం మొదలుపెడితే మరింత మార్పు వస్తుంది’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.

పుస్తకాలే నేస్తాలుగా
ఎన్ని అవమానాలు ఎదురైనా జెన్సీ తన నుండి ఎవరూ తీసుకోలేని ఒకదాన్ని అంటిపెట్టుకుని ఉండేది. అదే విద్య. ఆమె ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో చదువుకుంది. నిందలతో ఒంటరితనాన్ని అనుభవించినా పుస్తకాలనే తన నేస్తాలుగా భావించింది. ‘విద్య నా ఏకైక మార్గం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కొనసాగించాలని అనుకున్నాను. ఎందుకంటే నా కుటుంబం, క్లాస్‌మేట్స్‌, సమాజం నుండి నేను ఎదుర్కొంటున్న ఒత్తిడిని దూరం చేసుకునేందుకు చదువే నాకు సహాయపడింది’ అన్నారు ఆమె. పాఠశాలలో ఆమె ఎప్పుడూ అగ్రస్థానంలో నిలిచింది. ఇదే ఆమెను ఇతరులు చూస్తున్న దృష్టికోణం నుండి మార్పు తీసుకొచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -