రాష్ట్రంలో మూడ్రోజులు నిరసనలు
బిల్లుల ప్రతులు దహనం : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేక ిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. గ్రామీణ పేదలకు నష్టం చేకూర్చే కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 18,19 తేదీల్లో గ్రామాల్లో, 20న మండల కేంద్రాల్లో నిరసనలు చేయాలనీ, ఉపాధి హామీ చట్టం సవరణ బిల్లు ప్రతులను దహనం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. బుధవారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన 30 కోట్ల మందికిపైగా పేదలకు ఉపాధి కల్పిస్తున్న చట్టాన్ని నీరుగార్చటం తగదని పేర్కొన్నారు. పనిదినాలను పెంచామని చెబుతూ కూలీల సంఖ్య పెద్ద ఎత్తున కుదించడం సరిగాదని పేర్కొన్నారు. ఇప్పుడున్న చట్టంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు విడుదల చేస్తున్నాయని తెలిపారు.
అయితే, ప్రస్తుత బిల్లులో కేంద్రం ఇచ్చే నిధుల్ని 60 శాతానికి కుదించడం, 40 శాతం నిధులను రాష్ట్రాలే భరించాలని పేర్కొనటం దారుణమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అతి జోక్యంతో ఇప్పటికే నిధుల లేమితో అల్లాడుతున్న చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఎత్తేసే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో 60 రోజుల పాటు ఉపాధి హామీ పనులను ఆపటం వల్ల కూలీలు పనికోల్పోయే అవకాశం ఉంటుందని ఎత్తిచూపారు. చట్టానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును తొలగించి ఇప్పుడు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గారీ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్(విబి జి రాంజీ)గా మార్చడాన్ని తప్పుబట్టారు. ఉపాధి హామీ పని దినాలను 200కి పెంచాలనీ, రోజుకూలిని రూ.307 నుంచి రూ.600 వరకు పెంచడంతో పాటు ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.



