తమిళనాడు మాదిరిగా చేయాలని చెప్పినా పట్టించుకోలేదు : మండలి పక్ష నేత మధుసూదనాచారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తరపున ఢిల్లీకి వెళ్తున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్‌కుగానీ, నాకుగానీ చెప్పారా? మమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్తే వాళ్ళ మోసం బయటపడుతుందని అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదు. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు కాంగ్రెస్ తీరు ఉంది’ అని శాసనమండలి బీఆర్‌ఎస్ పక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పోరాటంలో మోడీని దించి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. తమిళనాడు రాష్ట్రంలో అమలు చేసిన మాదిరిగా రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ చేరిస్తే సరిపోతుందని తాము చెప్పిన సూచనను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఎండగడతామన్నారు. వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..రిజర్వేషన్లు పెంచితే 50శాతం లోబడి ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును కేసీఆర్ అమలుచేశారని తెలిపారు. తమిళనాడు సీఎంగా జయలలిత ప్రధానమంత్రినీ, అన్ని పార్టీల నేతలనూ ఒప్పించి రిజర్వేషన్లు సాధించారని గుర్తుచేశారు. ప్రభుత్వం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లను ఆర్డినెన్స్‌లో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని విమర్శించారు. మిగిలిన మూడు మంత్రి పదవులను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ,హౌంశాఖలను బీసీలకు ఇవ్వాలని కోరారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులను బీసీలకు 42శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ..14న తమ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో బీసీ గర్జన సభ పెడుతున్నామని ప్రకటించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన హడావిడిగా చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. జంతర్‌మంతర్ ధర్నాకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్తే తాము ఢిల్లీకి వస్తామని చెప్పినా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదని విమర్శించారు.
మోసం బయటపడుతుందనే మమ్మల్ని తీసుకెళ్లలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES