18 గ్రామాల తీర్మానం..
ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్తుల ఆగ్రహం
ఇతరుల చేత సంతకాలు సేకరించే ప్రయత్నం విఫలం
భిక్కనూరు బంద్ సంపూర్ణం
నవతెలంగాణ – భిక్కనూర్
ప్రాణాలను హరించే కంపెనీలు మాకు వద్దని 18 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో ఏకగ్రీవంగా తీర్మానించారు. భిక్నూర్ గ్రామ సమీపంలో ఫ్యూజస్ హెల్త్ కేర్ కెమికల్ కంపెనీ స్థాపన కొరకు ప్రజాభిప్రాయ సేకరణ బుధవారం రెవెన్యూ జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఉమ్మడి జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి లక్ష్మీప్రసాద్ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 18 గ్రామ పంచాయతీల నుండి గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, న్యాయవాదులు, యువకులు సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. అధికారులు 39 మంది వ్యక్తుల వద్ద నుండి అభిప్రాయాన్ని సేకరించారు.
ప్రతి ఒక్కరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కెమికల్ కంపెనీలు ఏర్పాటు చేస్తే ఉద్యమం చేపడతామని, ప్రస్తుతం ఉన్న కెమికల్ కంపెనీల ద్వారా ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క కెమికల్ కంపెనీ ఏర్పాటుచేసిన ఊరుకునేది లేదని హెచ్చరికలు దారి చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో కొందరు ఎన్జీవో సంస్థలు, ఇతర వ్యక్తుల ద్వారా కుట్ర ద్వారా సంతకాలు సేకరణ చేస్తున్న సమయంలో గమనించిన స్థానిక గ్రామస్తులు వారిని అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. అంతకుముందు భిక్కనూర్ బంద్ విజయవంతంగా, స్వచ్ఛందంగా ఎవరికివారు సంపూర్ణ బంధు పాటించి ప్రజాభిప్రాయ సేకరణలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పోలీసులు ముందస్తుగా ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తుల ద్వారా సేకరించిన అభిప్రాయాలను ఉన్నత అధికారులకు పంపించి నిర్ణయం తీసుకుంటామని జిల్లా అధికారులు తెలియజేశారు.



