జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలవాల్సిందే..అభివృద్ధి జరగాల్సిందే
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ గుజరాత్ గులాంలు
రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా స్పందించట్లేదు
బీఆర్‌ఎస్ కాలగర్భంలో కలిసిపోయిన పార్టీ
బీజేపీకి జవసత్వాలు అందించాలని తాపత్రయం
2029లో జమిలీ ఎన్నికలు మీట్ ది ప్రెస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్‌పార్టీనే అధికారంలో ఉంటుందనీ, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్‌లో తమ పార్టీ అభ్యర్థి గెలవాల్సిందే… అభివృద్ధి కొనసాగాల్సిందేనని స్పష్టం చేశారు.దేశంలో 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయన్నారు. దానికోసం ప్రధాని నరేంద్రమోడీ రాజ్యాంగ సవరణలకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి గుజరాత్‌కు గులాంగిరీ చేస్తున్నారే తప్ప, రాష్ట్ర భవిష్యత్ కోసం ఏమాత్రం తాపత్రయపడట్లేదని తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రాష్ట్రానికి రావల్సిన ప్రాజెక్టులు, అనుమతుల్ని అడ్డుకుంటుంటే ఈ ప్రాంతం నుంచి కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ”జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. కేంద్రం నుంచి అదనంగా ఎన్ని నిధులు తెచ్చి, ఇక్కడ అభివృద్ధి పనులు చేశారో స్పష్టం చేయాలి” అని సవాలు విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సంపూర్ణంగా అవయవదానం చేసి, బీజేపీకి 8 స్థానాల్లో విజయం అందించిందనీ, ‘థ్యాంక్స్ గివింగ్’ కింద ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు బీజేపీ సహకరిస్తున్నదని ఎద్దేవా చేశారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆమేరకు పక్కా ప్రణాళికతో ఉన్నదనీ, దానికోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసేందుకూ సిద్ధమవుతున్నదని తెలిపారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఆ కాలంలో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు, నిధులు తదితరాంశాలను వివరిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలోని వైఫల్యాలను ఏకరువు పెట్టారు. ప్రస్తుతం తాము అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి, చేపడుతున్న పనులను సోదాహరణంగా వివరించారు. బీఆర్‌ఎస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కిషన్‌రెడ్డిలపై సెటైర్లు వేశారు.
ఓటమి బాధతో, తన మాట వినని కొడుకు చేష్టలతో విసిగిపోయిన కేసీఆర్, ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. అందువల్ల ఆయనపై తమకు సానుభూతి తప్ప కోపం లేదన్నారు. అయితే బీఆర్‌ఎస్ అధినేతగా జూబ్లీహిల్స్ అభ్యర్థి సునీతకు ఓటేయాలంటూ కేసీఆర్ ఇప్పటికీ ఓటర్లకు విజ్ఞప్తి చేయకపోవటం విచిత్రంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదని సీఎం విమర్శించారు. బీఆర్‌ఎస్ ఓనర్ (అధినేత)కు వారి ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదనీ, అందుకే తనను కలిసేందుకు వారు భయపడుతుం టారని చెప్పారు. అలా భయపడేవారు తమ తమ నియో జకవర్గాలకు ఏం ఒరగబెడతారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు తర్వాత అభివృద్ధి ఊపందుకుందని తెలిపారు. అక్కడి ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ విలీన ప్రతిపాద నలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామనీ, ఆరు నెలల్లో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలవాల్సిందే…
‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిందే.. అభివృద్ధి జరగాల్సిందే…’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2034 వరకు రాష్ట్రంలో అధికారం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా గుజరాత్‌కు గులాంగిరీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయనకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సహవాసముందని చెప్పారు. వారిద్దరూ కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పునరుద్ఘాటించారు. 2023 ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 8 ఎంపీ స్థానాలిచ్చి గెలిపించిన బీఆర్‌ఎస్‌కు ‘థ్యాంక్స్ గివింగ్’లా కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అందుకే బీఆర్‌ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వారిని జూబ్లీహిల్స్ ప్రచారానికి దూరం పెట్టారని ఉదహరించారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక లిట్మస్ టెస్టులాంటిదని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ అవయవదానం
బీఆర్‌ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేస్తున్నదనీ, మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో జరిగింది ఇదేనని స్పష్టం చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనానికి అడుగులు పడుతున్నాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్‌రడ్డి తదితరులను ప్రచారానికి ఎందుకు దూరం పెట్టారని ప్రశ్నించారు. ప్రతి వస్తువుకూ ఒక నిర్ణీత ఆయుష్షు ఉంటుంది, ఆ గుడువు తీరితే దాని పనైపోతుంది. బీఆర్‌ఎస్ పరిస్థితి కూడా ఇప్పుడు అంతేనన్నారు. ఆ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లయింది. దాని ఆయుష్షు కూడా 25 ఏండ్లే అనిపిస్తోంది. సహజంగా ప్రమాదంలో మరణించిన వారి అవయవాలను దానం చేస్తారు. కానీ బీఆర్‌ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది. సినిమా ఇంకా పూర్తి కాకపోయినా ఆ స్టోరీ లైన్ ఎటు వెళ్తుందో అర్థమవుతున్నట్టే… బీఆర్‌ఎస్, బీజేపీల అడుగులు విలీనం వైపే వెళ్తున్నాయి…’ అని సీఎం వ్యాఖ్యానించారు.
సొంత చెల్లినే అవమానించారు
సొంత చెల్లినీ, మాగంటి గోపీనాథ్ తల్లిని అవమానిం చిన కేటీఆర్‌కు మహిళల సంక్షేమం పడుతుందా అని సీఎం ప్రశ్నించారు. దశ, దిశ బాగాలేని కేటీఆర్ కోసం సచివాలయ వాస్తు మారిస్తే ఏమొస్తుందంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తనపై ఎగరటం కాకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తోన్న కేంద్రాన్ని, ప్రధాని మోడీని నిలదీయాలని హితవు పలికారు. తమ రెండేండ్ల పాలనలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డుల జారీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, రేషన్ కార్డు లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ, రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వటంతోపాటు వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని గుర్తుచేశారు.
కాళేశ్వరం కూలిపోయినా రూ.2.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలో నెంబర్ వన్‌గా నిలిచామన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి రూ.7,100 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, రూ.3 వేల కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం, 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం, రూ.21 వేల కోట్లతో రైతు రుణమాఫీ, రూ.9 వేల కోట్లు రైతుభరోసా… ఇవన్నీ తమ ప్రభుత్వం సాధించిన ఘనతలని చెప్పారు. కేసీఆర్ ప్రారంభించిన ఏ ఒక్క పథకాన్నీ తాము ఆపలేదని వివరించారు. వాటికి అదనంగా కొన్నింటిని జోడించి, అమలు చేస్తున్నామని విశదీకరించారు. 22 నెలల్లో 60 వేలకు పైగా ఉద్యోగాలిచ్చినట్టు సీఎం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలనను, గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనతో పోల్చి చూసి ఓటేయాలంటూ జూబ్లీహిల్స్ ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
అంచనాలు పెంచి, అవినీతికి పాల్పడ్డారు
బీఆర్‌ఎస్ నేతలు తాము ఘనంగా నిర్మించామని చెప్పుకుంటున్న సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అమరవీరుల స్మారకం తదితర భవనాల అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వందేండ్ల ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తదితర ప్రజాపయోగ నిర్మాణాలను చేపట్టలేదని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ చేపట్టిన సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? అని ప్రశ్నించారు. రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన కేసీఆర్ పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని నిలదీశారు. పదేండ్లలో ఐదు వేల పాఠశాలలను మూసేశారనీ, కనీసం యూనివర్సిటీలకు వీసీలను కూడా నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరిద్దరూ ఏం చేశారు?
గత పదేండ్లపాటు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో ఉన్న చెత్త సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని సీఎం ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి అడ్డుపడని సందర్భాల్లో తెలంగాణకు కేంద్రం సహకరిస్తున్నదని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించకపోవటంతో రాష్ట్రానికి నిధులు రాలేదన్నారు. బీఆర్‌ఎస్ సర్కారు మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేయకపోవటంతో పలు పథకాలు నిర్వీర్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు మెజారిటీ, మైనార్టీ ప్రజలు రెండు కండ్లలాంటి వారని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. జూబ్లీహిల్స్‌లో అన్ని వర్గాల ప్రజలు తమ పార్టీ వెంటే ఉన్నారంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు సీపీఐ, సీపీఐ(ఎం), ఎంఐఎంతో పాటు పలు పార్టీలు, సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని గుర్తు చేశారు.



