ప్రజా సమస్యలపై చర్చించే చిత్తశుద్ధి రాష్ట్ర సర్కారుకు లేదు
మూడు రోజులే నిర్వహణ సరిగాదు : బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను 30 అంశాలపై 30 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరామని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. కానీ, కాంగ్రెస్ సర్కారుకు ప్రజాసమస్యలపై చర్చించే చిత్తశుద్ధి లేదనీ, అందుకే మూడు రోజుల్లో ముగిస్తామని చెప్పడం బాధ్యతారాహిత్యమేనని విమర్శించారు. శనివారం అసెంబ్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. భారీ వర్షాలతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందనీ, చెరువులకు గండ్లు పడి రోడ్లు తెగిపోయాయని తెలిపారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగ యువత, మహిళలు, పెన్షన్‌దారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, నేతన్నలు, కల్లుగీత కార్మికులు, వృత్తిదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. విద్యావైద్యం, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్థిక రంగాలు అస్తవ్యస్తంగా మారాయని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న భూముల అన్యాక్రాంతం, దేవాలయాలపై దాడుల వంటి అంశాలను అసెంబ్లీలో చర్చించాలని కోరామని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే అసెంబ్లీని ఎక్కువ రోజులు నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ గత బడ్జెట్ సమావేశాలను కేవలం 11 రోజులే నిర్వహించిందని ఎత్తిచూపారు. జస్టిస్ ఎం.ఎన్.వెంకటచల్లయ్య కమిషన్ అసెంబ్లీలు ఏడాదికి 90 రోజుల పాటు సమావేశమవ్వాలని సిఫారసు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2016లో జరిగిన ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ (అసెంబ్లీ స్పీకర్స్) కాన్ఫరెన్స్ అసెంబ్లీలు ఏడాదికి 60 రోజుల పాటు నడవాలని సూచించిందని తెలిపారు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఏడాదికి 30 రోజులు కూడా నడవకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలను పొలిటికల్ మైలేజి కోసమో, ప్రభుత్వ అజెండాను పూర్తి చేసుకునేందుకో, ఆరు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాలనే రాజ్యాంగ నిబంధనల కోసమో నడపడం అనేది సరికాదని హితవుపలికారు. కాంగ్రెస్ సర్కారుకు దమ్మూధైర్యముంటే 30 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.