Friday, January 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఉపాధి పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి

ఉపాధి పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి

- Advertisement -

పేద ప్రజలంతా ఏకం కావాలి : ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పిలుపు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వీబీ-జీఆర్‌ఎంజీ చట్టానికి వ్యతిరేకంగా, ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు పేదలంతా ఐక్యంగా పోరాడాలని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పిలుపు నిచ్చారు. ”మూడు నల్ల వ్యవసాయ చట్టాలను” తీసుకువచ్చినట్టే, ఎంజీఎన్‌ ఆర్‌ఈజీఎ ను రద్దు చేయడం కూడా మోడీ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. వీబీ-జీఆర్‌ఎంజీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఇందుకు పేద ప్రజలంతా ఏకం కావాలని ఆయన కోరారు. గురువారం నాడిక్కడ జవహర్‌ భవన్‌లో నిర్వహించిన ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఎ కార్మికుల జాతీయ సదస్సులో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఎంజీఎన్‌ ఆర్‌ఈజీఎ అంటేనే పేదలకు హక్కులు కల్పించడమని అన్నారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థ ఏర్పాటు ఉద్దేశానికే చరమగీతం పాడాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని రాహుల్‌ విమర్శిం చారు. పేద ప్రజలందరికీ పని హక్కును ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ కల్పిస్తే, దాన్ని దెబ్బతీయడమే బీజేపీ, మోడీ కోరిక అని తప్పుబట్టారు. ”అవసరమైన వారికి పని కల్పించాలనేది ఆలోచన. ఈ చట్టాన్ని ప్రభుత్వంలోని మూడవ అంచె పంచాయతీ రాజ్‌తో అమలు చేయాలి.

పేదలందరికీ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ కింద పని చేసే హక్కు ఉంది. ప్రధాని మోడీ- బీజేపీ ఆ భావనను పూర్తిగా రద్దు చేయాలని కోరుకుంటున్నాయి” అని అన్నారు. ”కొన్నేండ్ల క్రితం బీజేపీ మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. దీని పేరుతో రైతులపై దాడి చేసింది. ఇప్పుడు కొత్త చట్టంతో వ్యవసాయ కార్మికులపై దాడి చేస్తోంది. అప్పుడు రైతులు, కార్మికులు అందరూ ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఆ నల్ల చట్టాలను రద్దు చేయించుకున్నాం. ఈ మూడు నల్ల వ్యవసాయ చట్టాలపై రైతులతో కలిసి వ్యవసాయ కార్మికులు, కార్మికులు కూడా పోరాడారు” అని రాహుల్‌గాంధీ గుర్తు చేశారు. కొత్త చట్టంతో, బీజేపీ పాలిత ప్రభుత్వాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత లభిస్తుందని, కేంద్రం పని, నిధుల కేటాయింపును నిర్ణయిస్తుందని అన్నారు. గతంలో కార్మికులు పొందే వాటిని, ఇప్పుడు కాంట్రాక్టర్లు, బ్యూరోక్రసీకి ఇచ్చారని విమర్శించారు.

”వారు (బీజేపీ) ఆస్తులు కొంతమంది చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నారు. తద్వారా పేద ప్రజలు అదానీ-అంబానీపై ఆధారపడతా రు. అదే వారి భారతదేశ నమూనా” అని ఆయన విమర్శించారు. రాజు ప్రతిదీ నిర్ణయించే భారతదేశాన్ని వారు కోరుకుంటున్నారని, రాజుల పాలనలా ఇండియాను మార్చాలని బీజేపీ అనుకుంటోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్యం, ఓటు హక్కు భావనను అంతం చేయడమే బీజేపీ ఆలోచన అని విమర్శించారు. విక్షిత్‌ భారత్‌ – రోజ్‌ గార్‌ అజీవిక మిషన్‌ (గ్రామీణ్‌) (వీబీ-జీఆర్‌ఎంజీ) చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ హక్కుల ఆధారిత చట్టంగా దాని అసలు రూపంలో పునరుద్ధరించాలని, పని చేసే హక్కు, పంచాయతీల అధికారాలపై దాడిని ఆపాలని డిమాండ్‌ చేశారు.

పేద ప్రజల పని హక్కును కేంద్రం హరిస్తూ, ఆధునిక భారత్‌ను విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. కేంద్రాన్ని అడ్డుకునేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతిఒక్కరూ ఐక్యంగా నిలబడినప్పుడే కేంద్రం వెనక్కి తగ్గుతుందన్నారు. కేంద్రం తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని వెనక్కి తీసుకుని ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎను పునరుద్ధరించే వరకూ తాము పోరాడతామని హెచ్చరించారు. దీనిపై పార్లమెంటు బడ్జెటా సమావేశాల్లోనూ పోరాటం సాగిస్తామని తెలిపారు. ఈ సదస్సులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరోపక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్‌ఈజీఎ) రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ జనవరి 10న 45 రోజుల దేశవ్యాప్త ప్రచారాన్ని ‘ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ బచావో సంగ్రామ్‌’ను ప్రారంభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -