బీజేపీని బలహీనపరిచే శక్తులు ఏకం కావాలి
బీఆర్‌ఎస్‌తో బీజేపీ లోపాయికారి ఒప్పందం
రష్యా అక్టోబర్ విప్లవం ద్వారా ప్రపంచమంతా కమ్యూనిస్టు బీజాలు
మహబూబ్‌నగర్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘పీడిత ప్రజలతో సీపీఐ(ఎం) శ్రేణులు మమేకం కావాలి. దేశవ్యాప్తంగా బీజేపీని బలహీనపరిచే శక్తులు ఏకం అయ్యేందుకు కృషి చేయాలి. బీజేపీతో బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నది. బీహార్‌లో మతతత్వ ప్రమాదాన్ని ప్రజలకు చెప్పడంలో కాంగ్రెస్‌తోపాటు బీజేపీయేతర శక్తులు విఫలం అయ్యాయి’ అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. రష్యా అక్టోబర్ విప్లవంతో ప్రపంచం అంతా కమ్యునిస్టు బీజాలు పడ్డాయని తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల కన్వెన్షన్ హాల్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లె గోపాల్ అధ్యక్షతన సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడటం రాజకీయ నాయకులకు సర్వసాధారణంగా మారిందన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసి గెలు స్తున్నారని తెలిపారు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న నాయ కుల పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి ఓట్లు వేయలేదన్న కారణంతో ఇండ్లు తిరిగి వసూలు చేసుకోవడం గతంలో ఎక్కడా జరగలేదన్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తులేకపోయినా.. లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. బీజేపీని బలహీన పరిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి లౌకిక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సీపీఐ(ఎం) బలపరిచినా… ఆ పార్టీ విధానా లను ఆమోదించినట్టు కాదన్నారు. మతతత్వంతో ముందుకు వస్తున్న బీజేపీని అడ్డుకోవడానికే కాంగ్రెస్‌కు మద్థతు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అనేదే లేదని కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయమని, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్ అనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
బీజేపీకి దూరంగా బీఆర్‌ఎస్ వచ్చి లౌకికశక్తు లతో కలవాల్సిన అవసరముందని తెలిపారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ దొడ్డిదారిన గెలిచిందన్నారు. మొదటి నుంచి 65 లక్షల ఓట్లను తొలగించిన విషయం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్యాంపెయిన్‌లో చెబుతూనే ఉన్నారని, ప్రతిపక్షాలూ గగ్గోలు పెట్టాయని, అయినా మోడీ పెడచెవిన పెట్టారని అన్నారు. మతం, కులం, ప్రాంతం, డబ్బు ప్రలోభాలతో బీజేపీ గెలిచిందన్నారు. మతతత్వాన్ని ఎండగట్టకుండా వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా మనం బీజేపీని ఓడించలేమన్నారు. బీజేపీని బలహీన పరిచే శక్తులు దేశంలో పెరుగుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీని చంపిన ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన గాడ్సేను ఆగస్టు 15న దేశ ప్రధాని మోడీి పొగడటం బీజేపీ మతతత్వ విధానాలకు నిదర్శనమన్నారు. బాబ్రీ మసీద్‌ను కూల్చి మతచిచ్చు లేపిందే గాక మధుర, వారణాసిలో మసీదులు ఉన్నాయంటూ వాటిని సైతం కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏకపార్టీ విధానం తెచ్చి ప్రజాస్వామ్యాన్ని మంట గలుపుతున్నారని విమర్శించారు. ఎర్రజెండాను చూసి అమెరికా దడుసుకుంటుందన్నారు.
పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు తిరగబడుతున్నారు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు తిరగబడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో కమ్యూనిస్టులు ఎర్రజెండా ఎగుర వేశారని అన్నారు. కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళ.. కడు పేదలు లేని రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. అత్యధిక జనాభా చేతిలో సంపద తగ్గి కొద్ది చేతుల్లో కేంద్రీకృతం కావడంతోనే దారిద్య్రం పెరిగిపోతుందన్నారు. అందుకే ప్రత్యామ్నాయ రాజకీయాలు, సోషలిజం వైపు ప్రజలను ప్రయాణం చేసేందుకు ఉద్యమించాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. సాగర్, రాష్ట్ర కమిటి సభ్యులు జయలక్ష్మి, స్కైలాబ్‌బాబు, మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి ఏ. రాములు, వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, నారాయణపేట జిల్లా కార్యదర్శి వెంకట్‌రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లవెల్లి కురుమూర్తి, చంద్రకాంత్, జగన్, కడియాల మోహన్ తధితరులు పాల్గొన్నారు.



