ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా మేడారంలో జాతర పనుల పరిశీలన
నవతెలంగాణ-ములుగు
మేడారం జాతర పనులతో పాటు అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా మేడారంలో జరిగే మహాజాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం మంత్రి సీతక్క పరిశీలించారు. స్థానిక ఎస్పీ శబరీష్‌తో బైక్‌పై తిరుగుతూ పనులను, రహదారులను పర్యవేక్షించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చే ఏడాది జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. మేడారంలో గద్దెలు మారుస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సందర్శకులు ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ఆదివాసీ బిడ్డగా, వారి జీవితం తెలిసిన వ్యక్తిగా ఆదివాసీ సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకుంటూ పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ మహా మేడారం జాతరకు రూ.150 కోట్లు ప్రజా ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అవసరమైతే ఇతర శాఖల సహాయంతో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. మేడారంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.