– అఖిలభారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు సారా సురేష్
– పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
అతివృష్టితో కురిసిన వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద కుటుంబాన్ని యుద్ధపాతిపాదికన ప్రభుత్వం ఆదుకోవాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు సారా సురేష్ డిమాండ్ చేశారు. ముప్పునకు గురైన గ్రామాలలో ప్రజలను తక్షణమే ఆదుకోవాలన్నారు. ఈ మేరకు సోమవారం అఖిలభారత ఐక్య రైతు సంఘం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాప్రంథా, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సారా సురేష్ మాట్లాడారు. అతివృష్టితో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద కుటుంబాన్ని, ప్రతి రైతును ఆదుకోవాలన్నారు.
ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు భారీ వర్షాల వల్ల లక్షలాది ఎకరాలలో పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తు పరిస్థితుల వల్ల నష్టపోయిన ప్రతి ఎకరానా సోయాబీన్ కు రూ.70వేలు, వరికి రూ.50 వేలు, మొక్కజొన్నకు రూ.50వేలు, ఇతర పంటలకు రూ.30వేల నుంచి 40వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ఒక లక్ష ఎకరాల పైననే పంట నష్టం జరిగి ఉంటదన్నారు. ఇప్పటికి గోదావరి నది తీర ప్రాంతంలో కిలోమీటర్ల పొడవునా నీటి ప్రవాహం కొనసాగుతుందన్నారు. ఇంకా లక్షలాది ఎకరాలలో పంట నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. ఇక ముందు ముందు కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలియజేస్తుందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని యుద్ధప్రాతిపాదికన చర్య తీసుకోవాలని కోరారు. కొన్ని గ్రామాలలో వంట సామాగ్రి పూర్తిగా నష్టపోయిందని, ఇండ్లలో నిల్వ ఉంచుకున్న మందులు, బియ్యం పప్పులు, ఉప్పులన్నీ కూడా నష్టపోయినయి పలువురు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.వారందరినీ కూడా ఆదుకోవాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం మాస్ లైన్ ప్రజాపంథా, వ్యవసాయ కార్మిక సంఘం తరపున డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.కిషన్, సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కమ్మర్ పల్లి సబ్ డివిజన్ కార్యదర్శి బషీర్ అశోక్, టియుసిఐ జిల్లా కార్యదర్శి సత్తెమ్మ, దయాల్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.