మానవుడు ఆదిమకాలం నుంచి శ్రమ ద్వారానే తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) దాకా ప్రయాణం సాగిస్తున్నాడు. శ్రమకు ఆలోచనతో, సజనాత్మకతతో, నైపుణ్యం జోడించడం ద్వారా మాత్రమే ఇంతటి ముందడుగు సాధ్యం అవుతుంది. నేటి పోటీ ప్రపంచంలో రాణించాలన్నా, నిలబడాలన్నా తప్పకుండా స్కిల్స్ ఉండాల్సిందే. ప్రపంచదేశాల్లో ఎక్కడాలేని యువశక్తి మన దేశంలోనే ఉంది. వారికి సరైన నైపుణ్యం కల్పించి, వారి సామర్థ్యాల్ని సద్వినియోగం చేసుకుంటే దేశం అభివద్ధి చెందుతుంది. పదకొండేండ్లుగా కోట్లాది మంది యువత తమ కలల్ని సాకారం చేసుకోలేక, ఉపాధి లేక నిర్వీర్యంగా ఉన్నారు. ఏ దేశమైనా అభివద్ధి చెందాలంటే అక్కడ యువశక్తిని ఉపయోగించుకుంటేనే సాధ్యం. ‘నైపుణ్యం.. నిరంతర సాధన ఫలితం. అది అకస్మాత్తుగా వచ్చేది కాదు..’ అంటారు అబ్దుల్ కలాం. చేసే పనిలోనైనా, కెరీర్‌లోనైనా.. వచ్చే మార్పుల్ని గమనిస్తూ.. నైపుణ్యాలను పెంచుకున్నప్పుడే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. అయితే అలాంటి సాధన చిన్న వయసు నుంచే అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఇలా సొంతం చేసుకున్న నైపుణ్యాలే మన తరగని ఆస్తులవుతాయని, అవే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా వ్యక్తిగతంగా, వత్తిపరంగా మనల్ని ఉన్నతంగా నిలబెడతాయని చెబుతున్నారు. నైపుణ్యాలు గల యువతతోనే అభివద్ధి సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో జులై 15వ తేదీన ‘ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం’ సందర్భంగా జోష్ కథనం..
ప్రస్తుతం యువజనుల నైపుణ్యాల మెరుగుదలకు వత్తి శిక్షణా, ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్, ఆన్లైన్ కోర్సులు, వర్క్‌షాపులు, సెమినార్లు, మెంటార్ షిప్, వెబ్‌నార్స్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, లాంగ్వేజెస్ ట్రైనింగ్, కెరియర్ కౌన్సెలింగ్, జీవన నైపుణ్యాలు, క్రీడలు, సజనాత్మక సాధనాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ వంటివి వేదికలుగా ఉన్నాయి. అయితే అవి అందరికీ అందుబాటులో లేకపోవడం లేదా వాటి గురించి ఎక్కువ మందికి ముఖ్యంగా యువతకు తెలియకపోవడం, తెలియజేసే పరిస్థితిలో పాలకులు లేకపోవడం మన దురదష్టకరం. ఇప్పటికే గ్రామాల్లోకి అన్ని సౌకర్యాలు వస్తున్నప్పటికీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోగా-ఉన్న ఉపాధిని ఊడగొట్టే పరిస్థితి నెలకొంది.
గ్రామీణ స్థాయి నుంచే బేసిక్ స్కిల్స్ అభివద్ధికి ప్రత్యేక కషి జరగాల్సి ఉంది. ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న విద్యకు, చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోయింది. విద్యకు, నైపుణ్యాలకి, ఉపాధికి అంతరాన్ని తగ్గించాలి. చదువుతో పాటు స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా నేటి యువతకు బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి.
మార్పు మంచిదే!
ప్రస్తుతం మన రోజువారీ జీవితాలే కాదు.. కెరీర్ కూడా టెక్నాలజీతో ముడిపడిపోయిందని చెప్పాలి. ఇక భవిష్యత్తులో ఇది మరెంత అడ్వాన్స్‌డ్‌గా మారనుందో ఊహించగలం. ఈ క్రమంలో టెక్నాలజీలో వస్తోన్న కొత్త పోకడల్ని అవపోసన పట్టడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందుకు మారుతోన్న సాంకేతికతకు అనుగుణంగానే కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపాలి. ఎలాంటి కొత్త బాధ్యతనైనా అందిపుచ్చుకునే నేర్పును అలవర్చుకోవాలి.
కమ్యూనికేషన్ ముఖ్యం!
చాలామందికి నలుగురిలో మాట్లాడాలంటే ఏదో తెలియని బిడియం, భయం ఉంటాయి. వ్యక్తిగతంగా, వత్తిపరంగా ఎదగాలనుకునే వారికి ఇవే పెద్ద అవరోధాలుగా మారుతున్నాయంటున్నారు నిపుణులు. మీరు మీ బృందంతోనే కాదు.. ఇతర బృందాలతో సైతం పని/ప్రాజెక్ట్ గురించి మాట్లాడాల్సి రావచ్చు. మీ ఆలోచనల్ని వారితో పంచుకోవాల్సిన అవసరం ఏర్పడచ్చు. ఇలాంటప్పుడు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు.. వంటివన్నీ ముందు నుంచే అలవర్చుకోవడం మంచిది.
విశ్లేషించగలగాలి!
ఇప్పటికే మనుషులు చేసే చాలా పనులు చేయడానికి మెషీన్లు, రోబోలు అందుబాటులోకొచ్చాయి. ఇక వివిధ రంగాల్లో కత్రిమ మేధ సష్టిస్తున్న అద్భుతాల గురించి వింటూనే ఉన్నాం. అయితే ప్రస్తుతానికి వాటి పనితీరులో ఇంకా కొన్ని పరిమితులున్నాయి. ఈ క్రమంలో సజనాత్మకంగా ఆలోచించగలిగే సామర్థ్యం, ఒక సమస్యకు పరిష్కారం కనుక్కొని దాన్ని విశ్లేషించగలిగే నేర్పు.. వంటివి పెంచుకుంటూ, నూతన సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచించడంతో పాటు అందులోని లోపాల్ని కనిపెట్టగలిగినప్పుడే పరిష్కారం దిశగా విశ్లేషణ చేయగలం. తద్వారా భవిష్యత్తులోనూ మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతాం.
పోటీని తట్టుకునేలా..!
ఈరోజుల్లో పోటీ లేని రంగం, కెరీర్ లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది భవిష్యత్తులో మరింత తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అలాగని భయపడిపోతే ముందుకు సాగలేం.. అందుకే ఈ పోటీని తట్టుకొని నిలబడాలంటే.. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. ఎంచుకున్న రంగంలో పోటీని అధిగమించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ లక్షణాలు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ముందుకు నడిపించడంతో పాటు.. విజయం సాధించేలా చేస్తాయి.
యువత కోరుకునేది
యువతలో ఉన్న నిరుద్యోగాన్ని రూపుమాపడానికి మన రాష్ట్రంలో ఉన్న వనరుల ఆధారంగా చేసుకుని, విద్యార్థులకు ప్రాథమిక దశలోనే స్కిల్స్ నేర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం యూత్ పాలసీ ప్రకటించాలి. యూత్ పాలసీలో విద్య, వ్యవస్థాపకత %-% ఆవిష్కరణ, నైపుణ్యాభివద్ధి, ఉపాధి, ఆటలు, సంఘసేవ, సామాజిక న్యాయం, దేశరక్షణ, ఐక్యత, సంక్షేమ పాలన రాజకీయ ప్రోత్సాహం వంటి అంశాలతో కూడిన పాలసీ ప్రకటించాలి.
జ్వలించే కాంక్షతో రగిలిపోయే యువతను సరైన దారిలో పెట్టకపోతే సమాజమే పక్కదారి పడుతుంది. మన దేశంలో యువతకు కొదవ లేదు. వారిని ఉపాధి బాట పట్టించకపోతే నేరాలవైపు ఆకర్షితులవుతారనడానికి అనేక ఘటనలు కళ్లముందు కన్పిస్తున్నాయి. కాబట్టి మన దేశ అవసరాలకు తగ్గట్టు యుతకు ఉపాధి అవకాశాలు చూపించడం, అందుకు తగ్గ నైపుణ్యాలు సైతం నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అదే సమయంలో యువత కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన సమయం ఇది.
– అనంతోజు మోహన్‌కృష్ణ
88977 65417