Wednesday, November 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎకరాకు ఏడు క్వింటాళ్లే కొంటాం

ఎకరాకు ఏడు క్వింటాళ్లే కొంటాం

- Advertisement -

పత్తి రైతులకు కేంద్రం షరతు
– విదేశీ దిగుమతులపై సుంకాలు ఎత్తివేత
– ఫలితంగా పడిపోయిన స్వదేశీ పత్తి ధరలు
– ‘కిసాన్‌ కపాస్‌’ పేరుతో రైతుల్ని దోపిడీ చేస్తున్న మోడీ సర్కార్‌
– పత్తి కొనుగోళ్ల నుంచి సీసీఐ తప్పుకునే యత్నం
– చోద్యం చూస్తున్న కేంద్ర మంత్రులు

”ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటాం. అదికూడా కిసాన్‌ కపాస్‌లో నమోదు చేసుకుంటేనే. తేమశాతం ఎక్కువుంటే కొనే ప్రసక్తే లేదు” రాష్ట్రంలో పత్తిపంట కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులు ఇవి. ఇటీవలి భారీ వర్షాలకు ‘తెల్లబంగారం’ రంగుబారిన విషయం తెలిసిందే. ఇలాంటి విపత్తు సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం, కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దేశంలో అకాల వర్షాలతో పత్తిపంటకు నష్టం జరిగిందని తెలియగానే విదేశీ దిగుమతులపై సుంకాలను ఎత్తేసింది. ఫలితంగా స్వదేశీ పత్తికి ధర లేకుండా పోయింది. పత్తి కొనుగోళ్ల నుంచి కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ను తప్పించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు ఉంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్యల వల్ల దేశంలోని 50 లక్షల మంది పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు దీనిపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడట్లేదు. పైగా మరో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి కేంద్రం విధించిన నిబంధనల్ని సమర్థిస్తూ ప్రకటనలు చేయడాన్ని రైతాంగం తీవ్రంగా ఆక్షేపిస్తుంది.

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వరి ధాన్యం తర్వాత అత్యధికంగా సాగయ్యే వాణిజ్య పంట పత్తి. 49 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతున్నది. నేలల రకాన్ని బట్టి దిగుబడి వస్తుంది. తెలంగాణలో సరాసరిగా ఇసుక నేలల్లో 5 నుంచి 7 క్వింటాళ్లు, ఎర్ర నేలల్లో 8 నుంచి 12 క్వింటాళ్లు, నల్లరేగడి నేలల్లో 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నది. కాలం బాగా అయితే, ఇంకా అధికంగానే పండుతుంది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఏటా రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్నది. ఈ సారి పత్తి మద్దతు ధరను రూ.8,110గా నిర్ణయించారు. రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. పైగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా ఎకరాకు గరిష్టంగా ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధన తీసుకొచ్చింది. దీంతో మిగతా పత్తిని రైతులు ఎక్కడ అమ్ముకోవాలనే దానికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. తక్కువ ధరకు రైతులు దళారుల వద్ద అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫలితంగా క్వింటాకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు నష్టపోయే ప్రమాదముంది. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏటా ప్రయివేటు వ్యాపారుల వద్ద రైతులు ఐదారు లక్షల క్వింటాళ్ల పత్తిని అమ్ముకుంటున్నారు. ఈ ఒక్క జిల్లాలోనే వంద కోట్ల రూపాయలను పత్తిరైతులు నష్టపోయే ప్రమాదముంది. ఈ లెక్కన రాష్ట్రంలోని పత్తి రైతులు రూ.వెయ్యికోట్లకుపైగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.

కపాస్‌తో కష్టాలు…

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పత్తి పంటకు మద్దతు ధరను నిర్ణయించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నది. గతంలో కొనుగోలు కేంద్రాలకు వెళ్లే రైతులకు టోకెన్లు ఇచ్చి కొనుగోలు చేసేది. ఈసారి మాత్రం కపాస్‌ కిసాన్‌ యాప్‌ను తీసుకొచ్చింది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు తమ పంటను అమ్ముకోవడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 70 శాతానికిపైగా రైతుల వద్ద స్మార్టు ఫోన్లు లేవు. ఉన్నవారికి యాప్‌ల గురించి అవగాహన అంతంతే. చాలామంది నిరక్షరాస్యులు. గిరిజన రైతులకైతే అది మరింత ఇబ్బందికరంగా మారింది. ఆ యాప్‌లో లాగ్‌ ఇన్‌..రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, స్టాట్‌ బుకింగ్‌, రైతు పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ నెంబర్‌, యాడ్‌ ల్యాండ్‌, స్లాట్‌ ఇన్ఫర్మేషన్‌, సెలెక్ట్‌ స్టేట్‌, సెలెక్ట్‌ డిస్ట్రిక్‌, సెలెక్ట్‌ మార్కెట్‌, సెలెక్ట్‌ మెయిల్‌, ఎన్ని క్వింటాళ్ల పత్తి(సుమారు), ఎంటర్‌ మొబైల్‌ నెంబర్‌, ఎంటర్‌ ఓటీపీ ఇలాంటివన్నీ యాప్‌లో రైతులు పూర్తిచేయాలి. ఒక యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలంటే చదువుకున్నవారికే చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

తేమ పేరుతో తిరకాసు
స్లాట్‌ బుక్‌ అయి ఇచ్చిన తేదీ రోజు సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రానికిగానీ, జిన్నింగ్‌ మిల్లుకుగానీ రైతులు తమ పంటను తీసుకెళ్తే అక్కడ తేమ పేరుతో ఆటంకాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో 322కిపైగా జిన్నింగ్‌ మిల్లులుండగా ఇప్పటివరకూ సీసీఐ 70 వరకు మిల్లులకు పత్తి కొనుగోళ్లకు మాత్రమే అనుమతిలిచ్చింది. దీంతో రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో తమకు దగ్గర్లోని మిల్లులు కనిపించక ఇబ్బంది పడుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రం/జిన్నింగ్‌ మిల్లుకు తీసుకెళ్తే అక్కడ 12 శాతం తేమకు ఒక్క పాయింట్‌ ఎక్కువ ఉన్నా కొనుగోలు చేయడంలేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి తేమ శాతం 15 నుంచి 20 శాతం వరకు ఉంటుంది. 12 శాతం వచ్చే వరకు ఎండబెట్టుకుని రావాలని రైతులను తిప్పి పంపుతున్నారు. దీంతో రైతులపై అదనంగా రవాణా చార్జీల భారం పడుతోంది. కొనుగోళ్లకు రెండు, మూడు రోజులు ఆగాల్సి వస్తే వెయిటింగ్‌ చార్జీలు కట్టాల్సి వస్తోంది. ఈ గోలంతా భరించలేక రైతులు మద్దతు ధర రూ.8,110 ఉన్నా, గ్రామాల్లో దళారులకు 5,800 నుంచి రూ. 6,200కు తెగనమ్ముకోవాల్సి వస్తున్నది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చడంతో పాటు కూలీలకు కూలీ ఇవ్వడం వంటివి రైతులకు తక్షణావసరాలుగా ఉన్నాయి. రైతులకు ఇన్ని ఆటంకాలు సృష్టించడం వెనుక సీసీఐ కుట్రకూడా ఉందని రైతులు చెప్తున్నారు. తమ పంట మార్కెట్‌కు రాగానే, దళారులకు అమ్ముకునేలా సీసీఐనే పరోక్షంగా సహకరిస్తుందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రైతుల్ని పూర్తిగా వ్యవసాయం నుంచి వెళ్లగొట్టి కార్పొరేట్లకు వాణిజ్యపంటల్ని అప్పగించాలనే కుట్రకు కేంద్రంలోని బీజేపీ సర్కారు పాల్పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు బండి సంజరు, జీ కిషన్‌రెడ్డితో పాటు ఆపార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో మౌనంగా ఉంటుంన్నారు. కిషన్‌రెడ్డి మాత్రం కేంద్రం కుట్రల్ని, కపాస్‌ విధానాన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేస్తున్నారని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

అన్యాయం చేయొద్దు : మంత్రి తుమ్మల
ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన విధించడం సరికాదు. పత్తి రైతులకు అన్యాయం చేయొద్దు. అలాగే రాష్ట్రంలో జిన్నింగ్‌ మిల్లర్ల సమస్యల్ని పరిష్కరిం చాలి. సీసీఐ అవలంబిస్తున్న ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 అలాట్‌మెంట్‌ విధానాన్ని ఎత్తేయాలి. అన్ని జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లకు అనుమతులివ్వాలి. కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా పత్తి కొనుగోళ్లలో సాంకేతికంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం వీటిపై చర్యలు తీసుకోవాలి.

పరిమితి ఎత్తేయాలి : టి. సాగర్‌
ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ విధించిన పరిమితిని ఎత్తేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కిసాన్‌ కపాస్‌ రిజిస్ట్రేషన్‌తో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని విమర్శించారు. తేమ శాతం 8-12 శాతం పెట్టడం, వర్షాలతో తేమ శాతం పెరగటంతో సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ము కునే పరిస్థితి లేదన్నారు. ఎలాంటి పరిమితి లేకుండా రైతులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి సర్కారు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా ఇలాంటి నిబంధనలు వ్యతిరేకించకపోవడం శోచనీయమన్నారు. పత్తి దిగుమతిపై ఉన్న 11 శాతం సుంకాన్ని ఎత్తివేసి, దేశంలోని 50 లక్షల మంది పత్తి రైతులను కేంద్ర ప్రభుత్వం నిలువునా ముంచిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులను సమీకరించి ఆందోళనా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇ జంగారెడ్డి, ప్రొఫెసర్‌ హరిబండి ప్రసాదరావు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -