– ప్రమాదస్థలికి ముఖ్యమంత్రి వెళ్లినా, వెళ్లలేదని కేటీఆర్ ట్వీట్
– ‘పాశమైలారం’పై సీఎంను బదనాం చేస్తారా? : బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి వివేక్ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాశమైలారం ప్రమాద ఘటన జరిగిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి అక్కడికి వెళ్లారని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. సీఎం అక్కడికి వెళ్లినా వెళ్ళలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు. గతంలో కొండగట్టు ఘటన జరిగితే కేసీఆర్ కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో నిర్వహించిన ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమానంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ చొరవతో విజయవంతంగా కొనసాగుతున్నదని చెప్పారు. ప్రజల వినతులు స్వీకరించిన మంత్రి…సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి కొన్నింటిని వెంటనే పరిష్కరించినట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను పరిష్కరించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం జనంలో ఉండాలని సీఎం ఆదేశించారని చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే సుప్రీం అని అన్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటూ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టత ఇచ్చారని తెలిపారు.
కేటీఆర్, కవితకే పంచాయితీ
బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, కవితకు మధ్యనే పంచాయితీ ఉన్నప్పుడు ఆయా నియోజకవర్గాల్లో పంచాయితీలు, విభేదాలు ఉండటం సహజమని వివేక్ కొట్టిపారేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు మంత్రులతో మాట్లాడే అవకాశం లేదని అన్నారు. కానీ తమ ప్రభుత్వంలో దర్జాగా మంత్రులను కలిసే అవకాశం ఉందని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో పోలీసుల పహారా ఉండేదనీ, కానీ తమ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎవ్వరిపైనా కేసులు నమోదు చేయలేదని గుర్తు చేశారు. కేసీఆర్ సర్కారు ధర్నా చౌక్ ఎత్తివేసిందనీ, తమ ప్రభుత్వం ధర్నాలకు అవకాశం కల్పించిందని అన్నారు. పార్టీలో పాత, కొత్త విబేధాలు లేవనీ, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. గిగ్ వర్కర్ల చట్టం గురించి ప్రిపరేషన్స్ నడుస్తున్నాయనీ, గిగ్ వర్కర్స్ హక్కుల కోసం చర్యలు తీసుకుంటామని అన్నారు. పాశమైలారంలో 43 మంది చనిపోయిన ఘటనలో విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. సిగాచి కంపెనీ నిబంధనలను పాటించి ఉంటే ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు.