. డిప్యూటెషన్ పై వెళ్ళిన హెడ్మాస్టర్ ను తిరిగి తేవాలి
. గిరిజన బాలికల పాఠశాలలో విద్యార్థినుల ఆందోళన
. అక్రమ డిప్యూటెషన్ రద్దు చేయాలని డిమాండ్
. ఇప్పటికే తరగతులకు సరిపోనూ ఉపాధ్యాయులు లేరని ఆవేదన
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్
మా హెడ్మాస్టర్… మాకు కావాలంటూ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థినులు శనివారం ఆందోళన నిర్వహించారు. తప్పు చేసిన వారిని వదిలి ఏ తప్పు చేయని మాస్టారుని పంపడమేంటని నినాదాలు చేస్తూ రెండు గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ డివిజన్ అధికారి డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లుతో కలిసి విద్యార్థులకు ఎంత చెప్పినా మా సార్ మాకు కావాలి అంటూ నినదించారు. కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి విద్యార్థుల సమస్యను వివరించగా, ఒక నెల అనంతరం తగు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలపడం, ఆర్డీఓ, తహసిల్దార్, సీఐ వేణు విద్యార్థులకు నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి వరకు 309మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల పదవతరగతిలో ఉత్తీర్ణత శాతం బాగా వచ్చిందని హెడ్మాస్టర్ రాజు తమ పట్ల ప్రత్యేక చొరవతో చదువులో పలు సూచనలు అందిస్తారని విద్యార్థులు చెప్పుకొచ్చారు. అంతేగాకుండా గణితం, హిందీ సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు లేరని తెలిపారు. కాగా మాస్టారును ఇదే పాఠశాలలో ఉంచాలని విద్యార్థులు కోరుతున్నారు.