సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
న్యూఢిల్లీ : భారతదేశం, చైనా మధ్య సంబంధాలలో పురోగతిని స్వాగతిస్తున్నట్లు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఆదివారం పోస్టు చేశారు. భారతదేశం-చైనా సంబంధాలలో పురోగతిని, సరిహద్దు నిర్వహణపై ఒప్పందాలు చేసుకోవడాన్ని, కైలాష్ మానస సరోవర్ యాత్ర పున్ణప్రారంభం, ఇరుదేశాల మధ్య నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75వ వార్షికోత్సవం చేసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంలో ప్రపంచంలోని అత్యంత జనాభా కలిగిన రెండు దేశాలు, పురాతన నాగరికతల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, సహకారాన్ని బలోపేతం చేసుకోవడం చాలా సానుకూల పరిణామమని తెలిపారు. మన భవిష్యత్తు పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంపై నిర్మించబడాలని ఇరువైపులా పునరుద్ఘాటించడం ముఖ్యమైన అంశమని వివరించారు. గ్లోబల్ సౌత్‌లో కీలక సభ్యులుగా భారతదేశం, చైనా, బహుపాక్షికతను నిలబెట్టడానికి, సామ్రాజ్యవాద ఒత్తిళ్లను నిరోధించడానికి, బహుళ ధ్రువ ప్రపంచ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చారిత్రాత్మక బాధ్యతను కలిగి ఉన్నాయని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య సంఘీభావాన్ని బలోపేతం చేయడం మన ప్రజల శ్రేయస్సుకు మాత్రమే కాకుండా, మొత్తం మానవాళి శాంతికి, పురోగతికి కూడా ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ – చైనా సంబంధాల పురోగతిని స్వాగతిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES