Sunday, December 14, 2025
E-PAPER
Homeజాతీయంకేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాం

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాం

- Advertisement -

ముఖ్యమంత్రి విజయన్‌

తిరువనంతపురం : కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) పైచేయి సాధించింది. 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్‌ పంచాయితీలు, 14 జిల్లా పంచాయతీలు, 87 మున్సిపాలి టీలు, ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లతో కూడిన మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా మెజారిటీ స్థానిక సంస్థల్లో యూడీఎఫ్‌ విజయం సాధించింది. జిల్లా పంచాయతీల్లో ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌లు ఏడేసి సీట్లు గెలుచుకున్నాయి. కన్నూర్‌, త్రిసూర్‌, కొచ్చి కార్పొరేషన్లను యూడీఎఫ్‌ గెలుచుకోగా, కొజికోడ్‌లో అతి పెద్ద బ్లాక్‌గా ఎల్డీఎఫ్‌ నిలిచింది. తిరువనంతపురం కార్పొరేషన్‌లోని 101 సీట్లలో 50 సీట్లతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అతిపెద్ద బ్లాక్‌గా నిలిచింది. కొల్లాంలో యూడీఎఫ్‌ అతిపెద్ద బ్లాక్‌గా మారింది. 2020 ఎన్నికల్లో కన్నూర్‌ మినహా ఎల్డీఎఫ్‌ ఐదు కార్పొరేషన్లను కైవసం చేసుకుంది.

2020 ఎన్నికల్లో గెలుపొందిన పాలక్కాడ్‌, పండాళం మున్సిపాలిటీలను ఈసారి బీజేపీ చేజార్చు కుంది. 14 జిల్లా పంచాయతీ సంస్థల్లో కేవలం ఒకే ఒక సీటును కమలం గెలుచుకోగలిగింది. యూడీఎఫ్‌ 181 జిల్లా పంచాయతీ డివిజన్లను గెలుపొందగా, ఎల్‌డీఎఫ్‌ 130 డివిజన్లను కైవసం చేసుకుంది. మున్సిపాలిటీల్లో యూడీఎఫ్‌ 54 స్థానాల్లో విజయం సాధించగా, ఎల్డీఎఫ్‌ 28, ఎన్డీఏ రెండు స్థానాల్లో గెలిచాయి. 941 గ్రామ పంచాయతీలకుగానూ యూడీఎఫ్‌ 505 స్థానాలు గెలుచుకోగా, ఎల్డీఎఫ్‌ 340 సీట్లలో విజయం సాధించింది. 152 బ్లాక్‌ పంచాయతీల్లో యూడీఎఫ్‌ 79, ఎల్డీఎఫ్‌ 63 స్థానాలు గెలుచుకున్నాయి.

ఎన్నికల ప్రచారాన్ని మతోన్మాదం ప్రభావితం చేసింది : సీఎం విజయన్‌ వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను ఎల్డీఎఫ్‌ సాధించలేక పోయిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున విజయం లభిస్తుందని భావించినప్పటికీ ఆ రీతిలో పురో గతి సాధించలేకపోయామన్నారు. ఇందుకు గల కారణాలను సవివరంగా విశ్లేషిస్తామన్నారు. అవసరమైన దిద్దుబాటు చర్యలు తప్పక తీసుకుంటామ న్నారు. ఆ రీతిగా ఎల్డీఎఫ్‌ ముందుకు సాగుతుందని చెప్పారు. రాజధాని నగరంలో ఎన్డీఏ పైచేయి సాధించడం, ఎన్నికల ప్రచారాన్ని మతోన్మాదం ప్రభావితం చేసిందన్న వాస్తవం లౌకికవాదాన్ని విశ్వసించే వారికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని విజయన్‌ వ్యాఖ్యానించారు.

ఈ ఫలితాలు- ప్రజలు విషపూరితమైన ప్రచారానికి, మతోన్మాద శక్తుల నీచపుటెత్తుగడలకు ఎరగా మారకుండా నివారించేందుకు మరింత అప్రమత్తత అవసరమన్న హెచ్చరికను పంపుతున్నదన్నారు. అన్ని రూపాల్లోని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాల్సిన అవసరాన్ని కూడా ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో, ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి, చర్చించి, నిర్ణయాలు తీసుకుని యావత్‌ ప్రజానీకం మద్దతును పొందే దిశగా ఎల్డీఎఫ్‌ ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల పునాదిని మరింత బలోపేతం చేసుని, ప్రజా మద్దతును పెంచుకునే దిశగా కృషి చేయడానికి కట్టుబడి వుందని ముఖ్యమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -