ఇప్పటికే 60 వేల పోస్టులు భర్తీ చేశాం
ఇదే రోజున దుర్మార్గ పాలన అంతమొందించి..ప్రజా పాలన తెచ్చారు
కేసీఆర్‌కు హుస్నాబాద్ సెంటిమెంట్ ప్రచారానికే..నిధులివ్వడానికి కాదు
హుస్నాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
సర్పంచ్ ఎన్నికల్లో మంచోళ్లని ఎన్నుకోవాలంటూ సూచన
రూ. 262.78 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-సిద్దిపేట, హుస్నాబాద్ రూరల్
రెండున్నరేండ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి ఆశయ సాధనలో భాగంగా ఇప్పటికే 60వేల పోస్టులు భర్తీ చేశామని, త్వరలో మరో 40వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. 2023 డిసెంబర్ 3న ఓటు అనే ఆయుధంతో దుర్మార్గ పాలనను అంతమొందించి.. ప్రజాపాలనను తీసుకొచ్చారని గుర్తుచేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ముందుగా రూ.262.78 కోట్లతో హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని, సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని తెలిపారు. 60 ఏండ్ల కల నెరవేర్చిన సోనియమ్మను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం అందించానని, ప్రధాని మోడీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిసి గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించి వచ్చామని, అందుకే సభకు రావడం ఆలస్యమైందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరలేదని, బీఆర్‌ఎస్ పాలనలో లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 4 వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసినట్టు తెలిపారు. రూ. 8 వేల కోట్లు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఖర్చు చేశామని, ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని అన్నారు.
పదేండ్లు అధికారంలో ఉన్నవాళ్లు హుస్నాబాద్‌కు సాగునీరు అందించే గండిపెల్లి, గౌరెల్లి ప్రాజక్టులను పూర్తి చేయలేదని ఆరోపించారు. హుస్నాబాద్ కేసీఆర్‌కు ప్రచారానికి సెంటిమెంట్ అని, నిధులు ఇవ్వడానికి కాదని అన్నారు. ప్రచారం మొదలు పెట్టేందుకు సెంటిమెంట్‌గా హుస్నాబాద్‌ను ఉపయోగించుకున్నారని తెలిపారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్నారు కానీ హుస్నాబాద్‌ను అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకుల్లా తాము హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయబోమని, ఎన్ని నిధులైనా ఖర్చు చేసి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ పేదలకు ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వలేదని, పదేండ్లు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ఈ పదేండ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని తెలిపారు.
సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని, ఇవి మన గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మంచోళ్లని ఎన్నుకోవాలని, ఏకగ్రీవం అయినా చేసుకోండి లేదా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి, గ్రామాలను అభివృద్ధి చేసే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి అని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగిన రింగ్ రోడ్డు, ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, తాగు నీరు ఇతర పనులను చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సంజయ్ కుమార్, సత్యనారాయణ, సత్యం, నాయకులు వీహెచ్, సిరిసిల్ల రాజయ్య, వెంకట్రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



