Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభవిష్యత్‌కు అద్భుతమైన నగరాన్ని అందిస్తాం

భవిష్యత్‌కు అద్భుతమైన నగరాన్ని అందిస్తాం

- Advertisement -

మానవ తప్పిదాలతోనే చరిత్ర కనుమరుగు
ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన ఆగదు
మూసీలో గోదావరి జలాలు పారిస్తాం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
మూసీ తీరాన శ్రీఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన
పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు

నవతెలంగాణ-గండిపేట్‌
భవిష్యత్‌ తరాల కోసం అద్భుతమైన నగరాన్ని అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంతో చరిత్ర కల్గిన నగరం మానవ తప్పిదాలతో కనుమరుగయ్యే ప్రమాదం వచ్చిందన్నారు. ఆ ప్రమాదం నుంచి నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి సర్కిల్‌లోని మంచిరేవుల గ్రామ ఔటర్‌ రింగ్‌ రోడ్డు మూసీ ఒడ్డున చారిత్రక వీరభద్ర స్వామి ప్రాంగణంలో శనివారం శ్రీ మంచిలేశ్వర స్వామి శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో సీఎం ప్రసంగించారు.

చారిత్రాత్మక మందిరాన్ని నిర్మించు కోవడం ఒక చారిత్రక సందర్భం అన్నారు. ‘శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ అంటారని, ఆ శివుడి ఆజ్ఞతోనే ఈ మందిరాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి 140 ఏండ్ల చరిత్ర ఉందన్నారు. చరిత్రను గమనిస్తే.. నది, సముద్ర తీర ప్రాంతాలు ఎంతో అభివృద్ధిని సాధించాయని చెప్పారు. తెలంగాణ సముద్ర తీరం లేని రాష్ట్రమని, కృష్ణ, గోదావరి, ఈసా, మూసీ నదులను సరిగ్గా వినియోగించకపోవడంతో కొన్ని తరాలు నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ, ఈసీ నది పునర్జీవంపై చాలా మంది ప్రయత్నిం చారని, కారణాలు ఏమైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదన్నారు. ఆ అవకాశం తమకు దక్కడం సంతోషకరమన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంతో జన జీవనం స్తంభిస్తోందన్నారు. భవిష్యత్‌లో ఇక్కడా అలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ పరివాహకంలో మతసామరస్యానికి చిహ్నంగా ఒక మసీదు, నాగోలు ప్రాంతంలో చర్చిని నిర్మించబోతున్నామని చెప్పారు. పురానాపూల్‌ వద్ద మసీదు, గౌలిగూడ సమీపంలో గురుద్వార్‌ నిర్మిస్తామని ప్రకటించారు. గండిపేటకు గోదావరి జలాలను తరలించి, మూసీలో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది ఓట్ల కోసం, నోట్ల కోసం చేస్తున్న పని కాదని స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో అన్ని పదవులూ అనుభవించిన అక్క, ఆమె కొడుకు అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌లో కేసు వేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యనించారు.

‘మా అక్కకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్న.. నీ పుత్రరత్నం వేసిన కేసును వెనక్కి తీసుకోండి’ అని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మూసీ రివర్‌ ఫ్రంట్‌ను పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, కాలే యాదయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి, ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్లు తలారి మల్లేష్‌ముదిరాజ్‌, వేణుగౌడ్‌, మాజీ సర్పంచ్‌ ప్రవీణ్‌యాదవ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ లంకల పాపిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, జిల్లా అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -