నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును త్వరగా ఆమోదిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించినట్లు చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించామని తెలిపారు.
ఈ బిల్లు ఆమోదం కోసం కేంద్రంలోని విపక్ష కూటమి నేతలను కూడా కలిసి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లు అంశంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అందుకే కేంద్రం త్వరగా బిల్లును ఆమోదించాలని కోరారు.
రిజర్వేషన్ల అంశంపై బీజేపీ నాయకత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగించాలని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటున్నారని, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో ముస్లిం రిజర్వేషన్లను తొలగించాకే బీజేపీ నేతలు తెలంగాణ గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కులగణన సర్వేలో వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలను పేర్కొనలేదని అన్నారు. తమకు ఏ కులం లేదని 3.99 శాతం మంది చెప్పారని ముఖ్యమంత్రి అన్నారు. కులగణన సర్వే డేటాను ఆయా పార్టీల ముందు, అసెంబ్లీలో పెడతామని అన్నారు. తాము కల్పించే రిజర్వేషన్లలో మత ప్రస్తావన లేదని స్పష్టం చేశారు.
పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం నిబంధన దాటిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డురాని నిబంధనలు బీసీ రిజర్వేషన్లకు అడ్డు వస్తున్నాయా? అని ధ్వజమెత్తారు. కేంద్ర పదవుల్లోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీని తొలగించారని, ఇప్పటికే దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారని ఆయన అన్నారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.