Sunday, November 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందాడులు చేస్తే సహించం

దాడులు చేస్తే సహించం

- Advertisement -

గర్వంతో విర్రవీగితే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధిచెప్తారు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
బీఆర్‌ఎస్‌ కార్యకర్త రాకేశ్‌ క్రిస్టోఫర్‌కు పరామర్శ


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే బీఆర్‌ఎస్‌ కార్యకర్త రాకేశ్‌పై కాంగ్రెస్‌ గూండాలు దాడి చేయడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ఖండించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అధికారం, విజయగర్వంతో విర్రవీగితే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధిచెప్తారని అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ పరిధిలోని రెహమత్‌నగర్‌లో కాంగ్రెస్‌ గూండాల దాడిలో గాయపడిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త రాకేశ్‌ క్రిస్టోఫర్‌ ఇంటికి వెళ్లి ఆయనతోపాటు కుటుంబ సభ్యులను కేటీఆర్‌ పరామర్శించారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్‌ రౌడీయిజం, గూండాయిజం మొదలెట్టిందని విమర్శించారు.

తాము పదేండ్లు అధికారంలో ఉన్నామనీ, ఎన్నో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందామని గుర్తు చేశారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ తరహాలో ప్రతిపక్షాలపై దాడులు చేయలేదన్నారు. తాము అధికారంలో ఉన్నపుడు దాడులు చేసి ఉంటే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించుకోవాలని చెప్పారు. బీఆర్‌ఎస్‌కు సంబంధించిన ప్రతి కార్యకర్తనూ కంటికిరెప్పలా కాపాడుకుంటామని అన్నారు. ఆపదొస్తే అన్ని వేళల్లో పార్టీ అండగా ఉంటుందని వివరించారు. తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్‌ బాధ్యత వహించాలని చెప్పారు.

దొంగ ఓట్లు, గూండా గిరి చేసి, డబ్బులు పంచి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో తమకు గతంలో 80 వేలు ఓట్లు వస్తే ఈ ఉప ఎన్నికల్లో 75 వేల ఓట్లు వచ్చాయని వివరించారు. కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు, రిగ్గింగ్‌ చేసినా తమ ఓట్లు కేవలం ఐదు వేలు మాత్రమే తగ్గాయన్నారు. కచ్చితంగా భవిష్యత్తులో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందిస్తూ శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ చేసిన విజయోత్సవ ఊరేగింపుతోనే ఎవరిది అహంకారమో తేలిపోయిందని అన్నారు.

గతంలో తాము అనేక ఉప ఎన్నికలు గెలిచామనీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాలేదని చెప్పారు. కాంగ్రెస్‌ గుర్తును గాడిద మీద వేసి ఊరేగించామా?అని ప్రశ్నించారు. ఒక్క ఉప ఎన్నికల్లో గెలిచినందుకే ఇంత ఎగిరి పడడం అవసరం లేదన్నారు. ఎవరిది అహంకారమో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలపై పార్టీ నేతలు, కార్యకర్తలతో ఈనెల 18న సమావేశాన్ని నిర్వహించి సమీక్షిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -