Sunday, December 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఇతర మతాలను కించపరిస్తే శిక్షిస్తాం

ఇతర మతాలను కించపరిస్తే శిక్షిస్తాం

- Advertisement -

అసెంబ్లీలో చట్టాన్ని తెస్తాం
అన్ని మతాలను సమానంగా గౌరవించాలి
మైనారిటీల సంక్షేమ పథకాలు ఎవరి భిక్షకాదు..వారి హక్కు
క్రిస్టియన్‌, ముస్లిం శ్మశానవాటికల సమస్యలు పరిష్కరిస్తాం
క్రిస్‌మస్‌ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు, క్రిస్టియన్‌ పెద్దలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తూ, అందరికీ సమాన అవకాశాలు కల్పించటమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించా లని సూచించారు. ఎవరైనా ఇతర మతాలను కించపరు స్తూ మాట్లాడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు అసెంబ్లీలో చట్టాన్ని తెస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్‌మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించా రు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో మంత్రులు అజహరుద్దీన్‌, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ… రాష్ట్రంలో మత ప్రాతిపదికన దాడులు చేసేందుకు ప్రయత్నించిన వారిని తమ ప్రభుత్వం అణచివేసిందని గుర్తు చేశారు. మైనారిటీలకు అందించే సంక్షేమ కార్యక్రమాలు ఎవరి దయాదాక్షిణ్యాలు కాదనీ, అది వారి హక్కు అని స్పష్టం చేశారు. క్రిస్టియన్‌, ముస్లిం స్మశాన వాటికల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మానవ సేవే మాధవ సేవగా భావించి, ప్రేమను పంచి, శాంతిని పెంచాలనే సూక్తిని ఏసుక్రీస్తు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారని కొనియాడారు. ద్వేషించే వారిని సైతం ప్రేమించాలంటూ ఆయన మానవాళికి మంచి సందేశమిచ్చారని తెలిపారు.

జీసస్‌ జన్మించిన డిసెంబర్‌ నెలలోనే కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మించారనీ, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కూడా ఇదే నెలలో ఏర్పడిందని గుర్తుచేశారు. ఏసు ప్రభువు బోధనల స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. క్రిస్టియన్‌ మిషనరీలు ప్రభుత్వంతో పోటీపడి విద్య, వైద్యాన్ని ప్రాధాన్యతగా తీసుకొని పేదలకు అందించా యని కొనియాడారు. ఎవరెన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, తమపై ఎంత దుష్ప్రచారం చేసినా, ఓర్పు, పట్టుదలతో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించామన్నారు.

50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ను అందించి పేదల కుటుంబా ల్లో వెలుగులు నింపామన్నారు. ఆనాడు ఆహార భద్రత చట్టాన్ని కాంగ్రెస్‌ తీసుకొచ్చిందనీ, ఈ రోజు అదే పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 3.10 కోట్ల మంది పేదలకు సన్న బియ్యాన్ని అందిస్తున్నామని వివరించారు. రైతు రుణమా ఫీ చేసి, సన్న వడ్లకు రూ.500 బోనస్‌ అందించటం ద్వారా వ్యవసాయాన్ని పండగ చేశామన్నారు. ఆనాడు పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌ రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించిందనీ, దానిలోని అంశాలను అమలు చేయటం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని చెప్పారు. అనంతరం వేడుకలకు విచ్చేసిన చిన్నారులకు సీఎం క్రిస్‌మస్‌ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -