సిడ్నీ : సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోనీ ఆల్బనేస్ చెప్పారు. పాలస్తీనాను గుర్తిస్తామని బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా దేశాలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. నిస్సైనికీకరణ జరుపుతామని, ఎన్నికలు నిర్వహిస్తామని, వదిలి వెళ్లేందుకు ఇజ్రాయిల్‌కు ఉన్న హక్కును గుర్తిస్తామని పాలస్తీనా అథారిటీ (పీఏ) హామీ ఇచ్చిందని ఆల్బనేస్ తెలిపారు. మధ్యప్రాచ్యంలో హింసకు స్వస్తి చెప్పేందుకు, ఘర్షణను నివారించేందుకు, గాజాలో ఆకలి మంటలను చల్లార్చేందుకు, ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు రెండు దేశాలు పరిష్కారం కనుగొనాలని మానవాళి కోరుకుంటోందని ఆయన సోమవారం విలేకరులతో అన్నారు.
భవిష్యత్తులో పాలస్తీనా వ్యవహారాలలో హమాస్‌కు ఎలాంటి పాత్ర ఉండబోదని పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ హామీ ఇవ్వడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆల్బనేస్ వివరించారు. బ్రిటన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, జపాన్ దేశాల ప్రధానులతో పక్షం రోజులుగా ఇదే విషయంపై చర్చలు జరుపుతున్నానని ఆయన చెప్పారు.
ఓ అవకాశం వచ్చిందని, దానిని ఉపయోగించుకునేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి కృషి చేస్తామని తెలిపారు. గత సంవత్సరం స్పెయిన్, ఐర్లాండ్, నార్వే దేశాలు పాలస్తీనా దేశాన్ని లాంఛనంగా గుర్తించాయి. ఐరాసలోని 193 సభ్య దేశాలలో ఇప్పటి వరకూ పాలస్తీనాను 147 దేశాలు గుర్తించాయి. ఐరాసలో పాలస్తీనాకు ‘శాశ్వత పరిశీలక దేశం’గా గుర్తింపు ఉంది. కానీ ఓటింగ్ హక్కులు లేవు. పాలస్తీనాను గుర్తించే ప్రశ్నే లేదని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది.
గాజాలో యుద్ధాన్ని నిలిపివేయాలంటూ ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయ సమాజం తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే పాలస్తీనా దేశాన్ని గుర్తించడమంటే ఉగ్రవాదానికి ఊతమివ్వడమే అవుతుందని ఇజ్రాయిల్ వాదిస్తోంది. కాగా గాజాలో శనివారం నుంచి ఐదుగురు ఆకలి, పోషకాహారలోపంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ ఆకలికి తాళలేక చనిపోయిన వారి సంఖ్య 217కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023లో ఇజ్రాయిల్ సైనిక దాడులు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ 61 వేల మందికి పైగా ప్రజలు మరణించారని వివరించింది.
పాలస్తీనాను గుర్తిస్తాం : ఆస్ట్రేలియా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES