నవతెలంగాణ-హైదరాబాద్: కొలంబియా, వెనిజులాల మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని కొలంబియా అధ్యక్షుడు గుస్తావొ పెట్రో మంగళవారం పునరుద్ఘాటించారు. కరేబియన్ సముద్రతీరంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వెనిజులా, దాని చుట్టుపక్కల గగనతలాన్ని పూర్తిగా మూసివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఆదేశాలను పెట్రో సవాలు చేశారు.
”వెనిజులా వైమానిక ప్రాంతాన్ని మూసివేయడానికి అమెరికాకు హక్కులేదు. తన సొంత విమాన సంస్థలపై ఆధిపత్యాన్ని చెలాయించవచ్చుకానీ.. ప్రపంచంలోని ఇతర సంస్థలకు ఆదేశాలిచ్చే హక్కులేదు. కొలంబియా, వెనిజులాల మధ్య పౌరవిమాన సేవలను పునరుద్ధరిస్తోంది. ఇది చర్చలకు సమయం కానీ.. క్రూరత్వానికి కాదు” అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ స్టేట్స్ ‘ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న పెట్రో.. అమెరికా అడ్వైజరీని పరిశీలించడానికి, ప్రతి దేశం తన సొంత గగనతల సార్వభౌమత్వాన్ని నిలుపుకుంటుందనే సూత్రానిన సమర్థించడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థను అభ్యర్థిస్తానని పెట్రో పేర్కొన్నారు. మరో దేశ గగనతలాన్ని మూసివేయాలని మరో దేశ అధ్యక్షుడు ఏకపక్షంగా ఆదేశించడం అంతర్జాతీయ చట్టాన్ని దెబ్బతీయడం, సౌర్వభౌమాధికారాన్ని బలహీనపరచడమేనని ఆయన హెచ్చరించారు. అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని, దౌత్య ఉద్రిక్తతను పెంచే ఏకపక్ష చర్యలను నివారించాలని ఆయన అమెరికాను కోరారు.
కొలంబియా రవాణా మంత్రి ఫెర్నాండా రోజాస్ మాంటిల్లా కూడా అమెరికా ఆదేశాలను ఖండించారు.



