నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా దురాక్రమణ బెదిరింపుల నేపథ్యంలో రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ తాజాగా క్యూబాలో పర్యటించారు. గురువారం హవానా కనెన్షన్ సెంటర్‌లో సెర్గీతో క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలను మరింత బలపరుచుకునే విషయాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇప్పటికే ఉన్న సంబంధాలను మరింత పెంపొందించుకోవడానికి ఇరు దేశాలు సుముఖత వ్యక్తం చేసినట్లు క్యూబా విదేశాంగమంత్రిత్వశాఖ టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూబాను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో మాస్కో అందిస్తున్న సంఘీభావ ప్రయత్నాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు డియాజ్ కానెల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ఈ పర్యటన సందర్భంగా ‘మేము మీకు అండగా ఉంటాము’ అని ర్యాబ్కోవ్ కానెల్‌కి నొక్కి చెప్పారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలపై ఇరు ప్రతినిధి బృందాలు దృష్టి సారించాయి. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు క్యూబాలోని పారిశ్రామిక సదుపాయాలను నిర్వహించేందుకు రష్యన్ కంపెనీలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన 23వ రష్యా- క్యూబా అంతర్ ప్రభుత్వ కమిషన్‌లో ఈ నిర్ణయం ఖరారు చేయబడింది. ఈ కమిషన్‌లో క్యూబా ఉత్పాదక సామర్థ్యాన్ని బలోపేతం చేసే ఉమ్మడి ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ చొరవ వ్యాపార సహకారానికి కొత్త అవకాశాల్ని కలిస్తూ, పెట్టుబడుల గమ్యస్థానంగా క్యూబా ఆకర్షణను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రష్యా పరిశ్రమ, వాణిజ్య శాఖ ఉపమంత్రి రోమన్ చెకుషెవ్ అన్నారు.



