కర్నూలు బస్సు ఘటనలో సహాయక చర్యలు
జిల్లా అధికార యంత్రాంగానికి సహకారం
బాధితుల కోసం కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల్లో హెల్ప్‌లైన్
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల కలెక్టర్ బిఎం.సంతోష్
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తున్నట్టు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం.సంతోష్ తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. శుక్రవారం ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా అధికారులు, ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్‌తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మృతిచెందారని, పదిమంది గాయాలతో బయటపడ్డారని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామన్నారు. మృతులకు సంబంధించి రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రయివేట్ బస్సుల యాజమాన్యాలు సుశిక్షకులైన డ్రైవర్లను నియమించుకునేలా, రవాణా శాఖ నియమ నిబంధనలను పాటించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
19 మంది మృతి : కలెక్టర్
హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన కావేరి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులతోపాటు డ్రైవర్, క్లీనర్ ఉన్నట్టు తెలిసిందని కలెక్టర్ వివరించారు. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు మృతిచెందినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారన్నారు. గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వాస్పత్రితో పాటు పలు ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. పోస్టుమార్టం నివేదికను బట్టి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. కర్నూలు జిల్లా అధికార యంత్రాంగానికి జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పూర్తి సహాయ, సహకారాలు అందించడమే కాక బాధిత కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు గద్వాలలోని కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్, హెల్ప్‌డెస్క్ ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచామన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్: 9502271122, జోగులాంబ గద్వాల జిల్లా హెల్ప్ డెస్క్ నంబర్స్: 9100901599, 9100901598. పోలీస్ కార్యాలయ కంట్రోల్ రూమ్ నెంబర్ : 8712661828, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నెంబర్ : 9100901604. ఈ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. మంత్రి వెంట తెలంగాణ జెన్కో సీఎండీ హరీష్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, డీఎస్పీ మొగిలయ్య, ఆర్డీవో అలివేలు, ఉండవెల్లి ఎమ్మార్వో ప్రభాకర్ తదితరులున్నారు.
మృతుల వివరాలు..
బస్సు ప్రమాదంలో మృతుల వివరాలు… జె.ఫిలోమిన్ బేబీ (64), కిషోర్ (64), ప్రశాంత్ (32), ఆర్గా బందోపధ్యాయ (23), యువన్ శంకర్ రాజా (22), మేఘనాథ్ (25), ధాత్రి (27), అమత్ కుమార్ (18), చందన మంగ (23), అనూష (22), గిరి రావు (48), కేనుగు దీపక్ కుమార్ (24), జి.రమేష్, జి.అనూష, మనిత, కేశనాథ్, సంధ్యారాణి, కర్రీ శ్రీనివాస రెడ్డి, పంచాల శివశంకర్ (ద్విచక్ర వాహనదారుడు) ఉన్నారు.
గాయపడిన ప్రయాణికుల వివరాలు
ప్రమాదంలో గాయపడిన వారిలో మన్నెంపల్లి సత్యనారాయణ(27)తండ్రి ఎం.రవి, (సత్తుపల్లి, ఖమ్మం జిల్లా) బడంత్ర జయసూర్య(24), తండ్రి సుబ్బరాయుడు, మియాపూర్, హైదరాబాద్, అండోజ్ నవీన్‌కుమార్(26), తండ్రి కృష్ణాచారి, హయత్‌నగర్, హైదరాబాద్, సరస్వతి హారిక(30), తండ్రి రంగరాజు, బెంగళూరు, 5.నెలకుర్తి రమేష్ (36), దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా, శ్రీలక్ష్మి (నెలకుర్తి రమేష్ భార్య), జస్విత(8), అభీరా (1.8 సంవత్సరాలు), కపర్ అశోక్ (27), తెలంగాణ, ముసలూరి శ్రీహర్ష (25), నెల్లూరు జిల్లా, పునుపట్టి కీర్తి (28), ఎస్‌ఆర్.నగర్, హైదరాబాద్ , వేణుగోపాల్ రెడ్డి(24), తెలంగాణ, ఎంజి.రామరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా, ఘంటసాల సుబ్రమణ్యం, కాకినాడ, అశ్విన్ రెడ్డి, ఆకాశ్ , జయంత్ కుశ్వాల్, మధ్యప్రదేశ్, పంకజ్ ప్రజాపతి, గుణ సాయి, తూర్పు గోదావరి జిల్లా, శివా (గణేష్ కొడుకు) – బెంగళూరు, గ్లోరియా ఎల్సా సామ్, బెంగళూరు, చారిత్ (21), బెంగళూరు, మొహమ్మద్ ఖిజర్ (51), బెంగళూరు, తరుణ్ ఉన్నారు.



