సరిహద్దులో శాంతి, సుస్థిరత
నెలకొన్నాయి : జిన్‌పింగ్‌తో మోడీ గంటకు పైగా భేటీ
శాంతి, అభివృద్ధికి దోహదం : ఎస్‌సీఓ సమావేశంలో జిన్‌పింగ్
తియాంజిన్ : పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా చైనాతో సంబంధాలను పెంచుకునేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) నేతల సదస్సుకు ముందు ఆయన ఆదివారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. కజన్‌లో గత సంవత్సరం జరిగిన సమావేశంలో ఫలప్రదమైన చర్చలు జరిపామని, ద్వైపాక్షిక సంబంధాలకు అవి సానుకూల దిశను అందించాయని జిన్‌పింగ్‌కు తెలిపారు. మోడీ అభిప్రాయంతో జిన్‌పింగ్ ఏకీభవించారు. ‘గత సంవత్సరం కజన్‌లో విజయవంతంగా జరిగిన సమావేశం కారణంగా భారత్-చైనా సంబంధాలు పున్ణప్రారంభమయ్యాయి. రెండు దేశాల మధ్య అభిప్రాయాల మార్పిడి, సహకారం కొనసాగుతున్నాయి’ అని ఆయన చెప్పారు.
గత సంవత్సరం అక్టోబర్ 23న కజన్‌లో జరిగిన బ్రిక్స్ నేతల సదస్సు సందర్భంగా ఇరువురు నాయకులు భేటీ అయిన విషయం తెలిసిందే. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ మధ్య గత సంవత్సరం డిసెంబరులో జరిగిన సమావేశాన్ని మోడీ ప్రస్తావించారు. సరిహద్దు నిర్వహణపై రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధులు ఒక ఒప్పందానికి వచ్చారని చెప్పారు. సరిహద్దులో నిస్సైనికీకరణ జరిగిన తర్వాత ఇప్పుడు శాంతి, సుస్థిరత నెలకొన్నదని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరంగా ఉంచేందుకు తీసుకున్న రెండు ముఖ్యమైన చర్యలను మోడీ వివరించారు. ‘కైలాస్ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా నడుస్తున్నాయి’ అని అన్నారు. విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై ఆయన ప్రకటన చేయడం ఇదే మొదటిసారి.
‘మన సహకారం రెండు దేశాలకూ చెందిన 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉంది. మానవాళి సంక్షేమానికి కూడా ఇది దోహదపడుతుంది. ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకుపోవడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని ప్రధాని చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ కూడా చర్చల్లో భాగస్వాములయ్యారు. ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమించిందని, దానిపై కలసికట్టుగా పోరాడాలని మోడీ సూచించారు. సమావేశం వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మోడీ తెలియజేశారు. సరిహద్దులో శాంతి, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు రెండు దేశాలు అంగీకరించాయని చెప్పారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అవగాహనను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాల్సిందిగా జిన్‌పింగ్‌ను మోడీ ఆహ్వానించారు.
శత్రువులుగా, ముప్పుగా చూసుకోవద్దు : జిన్‌పింగ్
‘చైనా, భారత్ దేశాలు ప్రాచీన తూర్పు నాగరికతలు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు. గ్లోబల్ సౌత్‌తో ముఖ్యమైన సభ్యులు. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం కలిగించడం, వర్ధమాన దేశాల మధ్య ఐక్యతను, పునరుజ్జీవనాన్ని పెంచడం, మానవ సమాజ అభివృద్ధిని ముందుకు నడిపించడం వంటి ముఖ్యమైన బాధ్యతలను అవి నిర్వర్తిస్తున్నాయి. మంచి ఇరుగు పొరుగు స్నేహితులుగా, భాగస్వాములుగా పరస్పర విజయాలు సాధిస్తున్నాయి. డ్రాగాన్, ఏనుగుల నృత్యం మాత్రమే భారత్, చైనాలకు సరైన ఎంపిక’ అని జిన్‌పింగ్ తెలిపారు.
భారత్, చైనా సంబంధాలకు ఈ ఏడాది 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక కోణం నుంచి చూడాల్సి ఉంటుంది. తియాంజిన్ సదస్సు ద్వారా ఈ సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. ద్వైపాక్షిక సంబంధాలలో సుస్థిర, ఆరోగ్యకరమైన అభివృద్ధి జరుగుతు ంది. ముందుగా రెండు దేశాలువ్యూహాత్మక సంప్రదింపులను బలోపేతం చేయాలి. పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాలి. శత్రువులుగా, ముప్పుగా చూడకుండా రెండు దేశాలు భాగస్వాములుగా మెలగినంత కాలం ద్వైపాక్షిక సంబంధాలు సుసంపన్నం అవుతాయి. పరస్పర ప్రయోజనాల కోసం సహకారాన్ని విస్తరించుకోవాలి. ఒకరి ఆందోళనలను మరొకరు అర్థం చేసుకుంటూ శాంతియుత సహజీవనానికి బాటలు వేయాలి. సరిహద్దు ప్రాంతాలలో శాంతి, సుస్థిరత కోసం కలసికట్టుగా కృషి చేయాలి. సరిహద్దు వివాదం భారత్-చైనా సంబంధాలను దెబ్బతీసేలా ఉండకూడదు’ అని జిన్‌పింగ్ తెలిపినట్లు చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మోడీ, జిన్‌పింగ్ ఆదివారం మధ్యాహ్నం ఒక గంటకు పైగా సమావేశమయ్యారు. వాస్తవానికి 40 నిమిషాల పాటు మాత్రమే సమావేశం జరగాల్సి ఉండగా దానిని పొడిగించారు.
ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES