Saturday, November 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటైప్‌-1 డయాబెటిస్‌ చిన్నారులకు అండగా ఉంటాం

టైప్‌-1 డయాబెటిస్‌ చిన్నారులకు అండగా ఉంటాం

- Advertisement -

ఆధునిక సాంకేతికతను చేరువ చేయడంలో ముందుంటాం
వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా.జి.చొంగ్తూ
ఇన్సులిన్‌ పంపులు టైప్‌-1 డయాబెటిస్‌ చిన్నారులకు క్రాంతికార మార్పులు : నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప
కుంగిపోవద్దు…ట్రీట్‌మెంట్‌ ఉంది
నిమ్స్‌ ఎండోక్రైనాలజి విభాగాధిపతి డాక్టర్‌ బియాట్రిస్‌ అని

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
టైప్‌-1 డయాబెటిస్‌ చిన్నారులకు అండగా ఉంటున్నామనీ, డయాబెటిస్‌ నిర్వహణలో ఆధునిక సాంకేతికతలను ప్రజలకు చేరువ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా.జి.చొంగ్తూ భరోసానిచ్చారు. వరల్డ్‌ డయాబెటిస్‌ డే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లోని ఎమర్జెన్సీ భవనంలోని ట్రామా ఆడిటోరియంలో ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ బియాట్రిస్‌ అని అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్పతో కలిసి క్రిస్టినా.జి.చొంగ్తూ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చొంగ్తూ మాట్లాడుతూ..టైప్‌ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య అవగాహన, ఆత్మవిశ్వాసం, సమగ్ర సంరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని ఆకాంక్షించారు. డాక్టర్‌ బీరప్ప మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం ద్వారా అందజేస్తున్న ఇన్సులిన్‌ పంపులు టైప్‌-1 డయాబెటిస్‌తో జీవిస్తున్న జీవితాల్లో క్రాంతికార మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఆ పంపులు రక్తంలోని చక్కెర నియంత్రణను మెరుగుపరచడమే కాకుండా పిల్లల దైనందిన జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతున్నాయని వివరించారు. డాక్టర్‌ బియాట్రిస్‌ అని మాట్లాడుతూ…టైప్‌-1 డయాబెటిస్‌ చిన్నారులకు చాలెంజింగ్‌గా మారిందనీ, అయితే, బాధిత చిన్నారులు కుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దానికి ట్రీట్‌మెంట్‌ ఉందనీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తే సాధారణ జీవితం గడుపొచ్చన్నారు.

అనంతరం డాక్టర్‌ శ్రీధర్‌, స్వీట్‌ సోల్స్‌ సొసైటీ ఫర్‌ చిల్డ్రన్‌ టైప్‌-1 డయాబెటిస్‌ ప్రతినిధి కిదాంబి రమేశ్‌లు మాట్లాడుతూ..దీనిని కనిపించని వైకల్యంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. టైప్‌-1 డయాబెటిస్‌తో బాధపడే చిన్నారుల పట్ల వివక్ష తగదన్నారు. వారూ అందరి లాంటి పిల్లలేనని చాటిచెప్పేందుకు విద్యా, వైద్యారోగ్య శాఖలు సంయుక్తంగా పాఠశాలల్లో చైతన్యకార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి స్కూల్‌లోనూ మెడికల్‌ ఎమర్జెన్సీ రూమ్‌ ఉండేలా, ఇన్సులిన్‌ నిల్వ కోసం చిన్న రిఫ్రిజిరేటర్‌ ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు సుమన, సుబ్బలక్ష్మి, సదాశివుడు, వరలక్ష్మి, మెట్రానిక్‌ సంస్థ రీజినల్‌ మేనేజర్‌ అరిఫ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -