2047 నాటికి తెలంగాణ గేమ్ ఛేంజర్ అవుతుంది
హైడ్రాపై విషప్రచారాన్ని తిప్పికొట్టండి
మూసీ పునరుజ్జీవంతోనే హైదరాబాద్‌లో వరదలకు అడ్డుకట్ట
గోదావరి, కృష్ణాలో ఒక్క నీటి చుక్కను వదులుకోం
కాళేశ్వరం లేకున్నా రాష్ట్రంలో 2.85 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి
బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలి : గోల్కొండ కోటలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భావోద్వేగాలను రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడితే ఎవర్నీ ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి, అలాంటి ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ కాబోతోందని స్పష్టంచేశారు. 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో శుక్రవారం ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జై ఇండియా..జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. 2035 నాటికి ఒక ట్రిలియన్, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పారు. దీనికోసమే ”తెలంగాణ రైజింగ్-2047” విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామనీ, ఈ ఏడాది డిసెంబర్ నాటికి దీన్ని ప్రజల ముందు చర్చకు పెడతామని తెలిపారు. మూసీ పునరుజ్జీవం నుంచి గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్‌లో పొందుపర్చామన్నారు. ”ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ను బ్రాండింగ్ చేసేందుకు ఇటీవల 72వ ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించాం. దీనివల్ల మన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను ప్రపంచ దేశాలకు చూపించే అవకాశం కలిగింది” అని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), గ్లోబల్ రైస్ సమ్మిట్, బయోఏషియా సదస్సు, భారత్ సమ్మిట్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి, తెలంగాణ విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశామని వివరించారు. రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి, ఫ్యూచర్ సిటీతో పాటు త్వరలో ప్రారంభం కానున్న వరంగల్, అదిలాబాద్ ఏయిర్ పోర్టులు తెలంగాణ అభివృద్థికి దిక్సూచిగా మారతాయన్నారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారుతోందనీ, ఇక్కడి నుంచే 40 శాతం బల్క్ డ్రగ్స్ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెంటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
హైడ్రాపై రాజకీయ విమర్శలు
హైదరాబాద్‌ను స్వచ్ఛమైన. సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అనీ, దానికోసమే హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. బెంగుళూరు, ముంబాయి, చెన్నై లాంటి నగరాలు వరదలతో చిన్నాభిన్నం అవుతున్నాయనీ, హైదరాబాద్‌కు ఆ దుస్థితి రాకూడదనే కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. హైడ్రా ఇప్పటి వరకు 13 పార్కులు, 20 సరస్సులను అక్రమణల నుంచి రక్షించిందనీ, రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడిందని వివరించారు. కేవలం స్వీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తున్నాయనీ, ప్రజల బాగోగుల గురించి పని చేస్తున్న హైడ్రాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఒక్క నీటి చుక్కనూ వదులుకోం
గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. నీటి వాటాల విషయంలో ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ భూములు సస్యశ్యామలం అయ్యాకే ఇతర ప్రాంతాలకు నీరివ్వడం గురించి ఆలోచిస్తామన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లను గోదావరిలో వృధాగా పోసి, ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామన్నారు. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
బీసీ, ఎస్సీలకు న్యాయం చేశాం
కుల గణనతో బలహీనవర్గాల వందేండ్ల కలను, ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించామని అన్నారు. ”కుల గణన ప్రామాణికంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదింపజేసి చట్టరూపం ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
3.10 కోట్ల మందికి సన్నబియ్యం
”రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఈ రోజు ధనికులతో సమానంగా రాష్ట్రంలో పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. పదేండ్ల నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్రంలోని అర్హులైన పేదలకు రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేశామనీ, ‘ఇందిరమ్మ రైతు భరోసా’ ద్వారా కేవలం తొమ్మిది రోజుల్లోనే 70,11,184 మంది రైతులకు రూ.9 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ప్రజాప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి రూ.1.13 కోట్లను ఖర్చు చేసిందనీ, ఫలితంగా కాళేశ్వరం లేకున్నా 2.85 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి సాధించి దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు. సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామనీ, వ్యవసాయానికి 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు.
సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లతో తొలివిడతలో నిర్మిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. 27 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్లతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ఇప్పటి వరకు వైద్యారోగ్య రంగంపై రూ.16,521 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ‘మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి’ అనే నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామనీ, మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం ఇప్పటి వరకు రూ.46,689 కోట్లు సమకూర్చిందని వివరించారు. తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామనీ, 20 నెలల వ్యవధిలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. యంగ్ ఇండియా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటును ప్రస్తావించారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా స్కూళ్లు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఉత్తమ పోలీసింగ్‌లో తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్నారు.
అప్పులు ఏ రూ.8,21,651 కోట్లు
”గత పాలకులు వారసత్వంగా ప్రజా ప్రభుత్వానికి రూ.8,21,651 కోట్ల అప్పులు బకాయిలు మిగిల్చి వెళ్లారు. దాన్ని సరిచేయడానికి అనేక తంటాలు పడుతున్నాం. ఇప్పటి వరకు అసలు రూపేణా రూ.1,32,498 కోట్లు, వడ్డీలకు రూ.88,178 కోట్లు, మొత్తం రూ.2,20,676 కోట్లు చెల్లించాం” అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరాల వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామ న్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, నవ భారత నిర్మాత నెహ్రూల స్ఫూÛర్తి, ప్రజల ఆదరణతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు. సీఎం తన ప్రసంగం ఆఖర్లో జై ఇండియా, జై తెలంగాణ అని నినదిస్తూ ముగింపునిచ్చారు. అనంతరం పోలీసులతో పాటు వివిధ విభాగాల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ఆయన పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, డీజీపీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భావోద్వేగాలను రెచ్చగొట్టే కుట్రలను అడ్డుకుంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES