Friday, December 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం

తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం

- Advertisement -

విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం
పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది
త్వరలో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో అభివృద్ధి
ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమిస్తున్నాం
రెండేండ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు : ఆదిలాబాద్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరుగునపడేసిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతామని, గోదావరి జలాలు రైతాంగానికి అందిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలను గురువారం సీఎం ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆపేసిందని ఆరోపించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టును 150 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు పక్క రాష్ట్రంతో అనుమతులు తీసుకుంటామని తెలిపారు. మహారాష్ట్రను ఒప్పించడంలో స్థానిక బీజేపీ నాయకులు సహకరించాలని కోరారు. త్వరలో ప్రాజెక్టుకు సంబంధించి అంచనాలు వేసి టెండర్లు ఆహ్వానిస్తామని ప్రకటించారు. గోదావరి జలాలు రైతాంగానికి ఉపయోగపడేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు.

ఎర్ర బస్సు రావడమే కష్టమనుకున్న ఆదిలాబాద్‌లో ఎయిర్‌బస్‌ను దించి.. పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌ లో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నా రు. ప్రజల సొమ్ము దోచుకుని ఆ అక్రమ సొమ్ము కోసం ఇవాళ ఆ కుటుంబంలో గొడవలు పడుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత జిల్లాకు విశ్వవిద్యాలయం ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. దాన్ని ఎక్కడ పెట్టాలన్నది ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కేసీఆర్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించిన రూ.లక్ష కోట్లు గోదావరి పాలయ్యాయని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబంలో పైసల పంచాయితీనే తప్పా ప్రజల సమస్యలు పట్టవని అన్నారు.

ఆడబిడ్డల సంతోషమే మా లక్ష్యం
ఆడబిడ్డలు ఎక్కడ సంతోషంగా ఉంటారో అక్కడ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండుతాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో కోటి చీరల పంపిణీ కార్య క్రమం చేపట్టామని, ఇప్పటివరకు 65 లక్షల చీరలు పంపిణీ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా కోటిమం ది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఒక్క రూపాయి చెల్లించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విధంగా అవకాశం కల్పించామన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూనే రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రెండేండ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి స్ఫూర్తితో గత ప్రభుత్వంపై పోరాటం చేశానని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరుల స్థూపం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే దస్త్రంపై సంతకం పెట్టానని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే నిరుద్యోగులకు 61 వేల ఉద్యోగాలు ఇచ్చామని, గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు.

ఇటీవల 785 మందికి గ్రూప్‌-2 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. రాజకీయాలకంటే తమకు ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు. గతంలో పరిపాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చేది కాదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఆ పరిస్థితులు లేవన్నారు. ఒకే వేదికపైన ప్రతిపక్ష బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇస్తున్నామంటే అభివృద్ధికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్న ఉక్కు సంకల్పంతో సోనియాగాంధీ, రాజీవ్‌ గాంధీ, ప్రియాంకగాంధీ ఆశీస్సులతో ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరినట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌ వెంకట స్వామి, ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -