నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పేదల పక్షపాతి అయిన ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని, పేద విద్యార్థులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
పచ్చని అడవుల జిల్లా ఆదిలాబాద్ ను మినీ కాశ్మీర్ గా మారుస్తామని.. పర్యాటకాన్ని డెవలప్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆదిలాబాద్ కు పెట్టుబడులు వస్తాయని.. యువకులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దే గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. సీఎం సభలో మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమంలో భాగంగా గత సంవత్సరం పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం జరిగిన నష్టంపై చర్యలు తీసుకుని రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైజింగ్ తెలంగాణ 2047 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి దూర దృష్టితో ప్రణాళిక రూపొందించి రాష్ట్రంలో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.



