నవతెలంగాణ-హైదరాబాద్: CPI(M) మాజీ పోలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్ సంస్మరణ సభ ఆగస్టు 3న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతుంది. ఈ సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం)పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సంస్మరణ సభను జయప్రదం చేయాలని ప్రజలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
వి.ఎస్.అచ్యుతానందన్ జూలై 21న అనారోగ్యంతో మృతిచెందిన విషయం విదితమే. అచ్యుతానందన్ ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా అనేక పోరాటాల్లో కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. 17 సంవత్సరాలకే కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరారు. కామ్రేడ్ కృష్ణ పిళ్లై నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. చారిత్రాత్మక పున్నప్రవాయలర్ పోరాటంలో జైలు కెళ్లారు. కార్మికులు, వ్యవసాయ కార్మికుల పోరాటాలకు ప్రత్యక్ష నాయకత్వం వహించారు.
కేరళలో కమ్యూనిస్టు పార్టీని అభివృద్ధి చేయడంలో కీలకమైన పాత్ర నిర్వహించారు. 1964 సీపీఐ(ఎం)ను ఏర్పాటు చేసిన 32 మందిలో వి.ఎస్.అచ్యుతానందన్ ఒకరు. 1980 నుండి 1991 వరకు కేరళ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1964లో కేంద్ర కమిటీలోకి, 1985లో పోలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేరళ అసెంబ్లీకి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ప్రతిపక్షనేతగానూ, 2006 నుండి 2011 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ సేవలందించారు.